logo

సిబ్బంది కొరత.. రోగుల అవస్థ

జిల్లాలోని పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎం, వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులకు నామమాత్రపు వైద్యం అందించి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

Published : 05 May 2024 02:45 IST


న్యూస్‌టుడే, ఇచ్చోడ, బేల : జిల్లాలోని పీహెచ్‌సీల్లో స్టాఫ్‌నర్సులు, ఏఎన్‌ఎం, వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులకు నామమాత్రపు వైద్యం అందించి పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తీరా రోగాలు తగ్గకపోవడంతో ప్రైవేటును ఆశ్రయించే పరిస్థితి నెలకొంది. ముగ్గురు ఉండాల్సినచోట ఒక్కరు, ఇద్దరు ఉండాల్సిన చోట ఒక్కరే దిక్కయ్యారు. దీంతో అక్కడ పని చేసే సిబ్బందే మందులు ఇచ్చి పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీహెచ్‌సీలో కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్సులకు ఇటీవల ఉద్యోగాలు రావడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఇవి భర్తీ కాకపోవడంతో సమస్య తీవ్రంగా మారింది.

 తూతూమంత్రంగా విధులు..

 ప్రభుత్వం పల్లె దవాఖానాల పేరుతో ఇటీవల ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ ఎంఎల్‌హెచ్‌పీలను నియమించినా.. ఆశించిన ఫలితం కనిపించడం లేదు. చాలాచోట్ల వారు విధులకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటువైపు ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

మచ్చుకు మరికొన్ని..

  •  సొనాల పీహెచ్‌సీలో ఇద్దరు స్టాఫ్‌నర్సులు ఉండాలి. అందులో ఒకరు ఉండగా మరొకరు వేరే చోటకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఓపీ ఏఎన్‌ఎం పోస్టు ఖాళీగా ఉంది. అటెండర్‌ పోస్టు ఖాళీగా ఉండగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
  • ఇచ్చోడ మండలం నర్సాపూర్‌ పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండగా ఒక్కరు మాత్రమే డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. ఇతను వైద్య శిబిరాలకు వెళ్తే ఆసుపత్రిలో ఎవ్వరూ ఉండటం లేదు. వచ్చేది వర్షాకాలం కావడంతో మరో వైద్యుడిని నియమిస్తేనే ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితి అనేక చోట్ల నెలకొంది.

ఒక్కరే దిక్కు

ఇది బేల మండల కేంద్రంలో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్‌సీ. ఇక్కడ ఇద్దరు వైద్యులు పనిచేయాల్సి ఉండగా ఒక్కరే పని చేస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న ముగ్గురు స్టాఫ్‌నర్సులకు ఉద్యోగాలు వచ్చి, వారు వేరే చోట విధుల్లో చేరడంతో ఒక్కరే దిక్కయ్యారు. వెరసి ఇక్కడ ప్రసవాలు నిలిచిపోయాయి.

ఇచ్చోడలో ఇదీ పరిస్థితి

ఇది ఇచ్చోడలోని 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన పీహెచ్‌సీ. జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం, మారుమూల ప్రాంతాలకు చెందినవారు ఎక్కువగా వస్తుండగా ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ సాధారణ రోజుల్లో 100కుపైగా, సీజనల్‌ వ్యాధుల సమయంలో 200లకుపైగా రోగులు ఆసుపత్రికి వస్తారు. ఇద్దరు వైద్యులు ఉన్నా.. మరొకరిని నియమించాల్సిన అవసరం ఉంది. స్టాఫ్‌ నర్సులు ఇక్కడ అయిదుగురు ఉండాల్సి ఉండగా ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారు. నైట్‌వాచ్‌మెన్‌ లేక రాత్రి వేళ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏడాది కిందట ఇక్కడ పని చేస్తున్న అటెండర్‌ మృతి చెందడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది.

భర్తీకి చర్యలు: రాఠోడ్‌ నరేందర్‌, డీఎంహెచ్‌ఓ

జిల్లాలో ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాం. ఎన్నికల నియమావళి నేపథ్యంలో భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. త్వరలో వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, ఏఎన్‌ఎంలతోపాటు ఇతర సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేసి ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తాం. ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించేలా చూస్తున్నాం. ఎంఎల్‌హెచ్‌పీలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని