logo

అగ్రనేతలపై కాంగ్రెస్‌.. భాజపా ఆశలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌, భాజపా, భారాసలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగాయి. మంచిర్యాలలో శనివారం రాత్రి భారాస అధినేత కేసీఆర్‌ రోడ్‌షో జరిగింది.

Updated : 05 May 2024 06:56 IST

నేడు ఉమ్మడిజిల్లాకు  రాహుల్‌... అమిత్‌షా

నిర్మల్‌లో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కాంగ్రెస్‌ నేతలు

 ఈటీవీ - ఆదిలాబాద్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకుంటోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్‌, భాజపా, భారాసలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగాయి. మంచిర్యాలలో శనివారం రాత్రి భారాస అధినేత కేసీఆర్‌ రోడ్‌షో జరిగింది. కాంగ్రెస్‌ తమ అగ్రనేత రాహుల్‌గాంధీతో ఆదివారం నిర్మల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. మరోపక్క భాజపా ఆదివారమే కాగజ్‌నగర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా పాల్గొననుండటం ప్రాధాన్యతాంశంగా మారుతోంది.

 భాజపాకు బలం చేకూరేనా?

సిటింగ్‌ స్థానమైన ఆదిలాబాద్‌ సీటును మరోసారి కైవసం చేసుకోవటం భాజపాకు పరీక్షగా మారింది. సిటింగ్‌ ఎంపీ సోయం బాపురావుకు టికెట్‌ నిరాకరించటం, చివరి నిమిషంలో భారాస నుంచి వచ్చిన గోడం నగేష్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటం, నలుగురు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవటం శ్రేణులకు మింగుడుపడటం లేదు. పార్టీకి పట్టున్న ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో సంప్రదాయ భాజపా శ్రేణులు అంటీముట్టనట్లే వ్యవహరిస్తున్నాయి. రమేష్‌ రాఠోడ్‌, సుహాసినిరెడ్డి, అయ్యన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్‌, చాకటి దశరథ్‌ సహా ఆదిలాబాద్‌, నిర్మల్‌, భైంసాలో ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలను సైతం విస్మరిస్తున్నారనే విషయం దిల్లీ దృష్టికి వెళ్లింది. గత లోక్‌సభ ఎన్నికల్లో సోయం బాపురావు ఎంపీగా విజయం సాధించటం మొదలుకొని, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో సిర్పూర్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, ముథోల్‌ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోవటంతో భాజపా బలం పెరిగింది. పార్టీ సిద్ధాంతాలపరంగా కాకుండా, తమ వ్యక్తిగత పరపతితో ఎన్నికల్లో గెలిచామని కొంతమంది నేతలు భావిస్తున్నందునే భాజపాలో సంప్రదాయ శ్రేణులకు గుర్తింపు లేకుండా పోతోందని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓ కీలక నేత ఆవేదన వ్యక్తం చేశారు.

అభ్యర్థి - ప్రచారం : ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌ మృదుస్వభావి అని పేరుంది. తానొవ్వక ఇతరులను నొప్పించకుండా ఉండే మనస్తత్వం కారణంగా మధ్యవర్తుల ప్రమేయం పెరిగి భాజపా సిద్ధాంతాలకు లోబడి పని చేసే వారికి ప్రాధాన్యం లేకుండా పోతోందనే అభిప్రాయం పార్టీలో గూడుకట్టుకుంది. ఆదివాసీలు, గిరిజనులు, గిరిజనేతరుల మద్దతు కూడగట్టడంలో నగేష్‌ ముందువరుసలో ఉన్నా ఎన్నికల్లో ఏ మేరకు ఓట్ల రూపంగా మారుతాయో అనేది ఆ పార్టీలో భయాన్ని రేకెత్తిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో పోలైన ఓట్ల మాదిరిగానే ఓట్లు వచ్చి, భారాస డీలాపడితే ఏ ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. ప్రధాని మోదీ చరిష్మా, హిందూత్వ నినాదం, రామమందిర నిర్మాణం అంశాల ప్రాతిపదికనే ప్రచారం సాగుతోంది. శాసనసభ ఎన్నికలకు జిల్లాకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు ఇవ్వకపోవటం, నామపత్రాలు దాఖలు నుంచి కేంద్ర, రాష్ట్ర నాయకులెవరూ జిల్లాకు రాకపోవటం శ్రేణుల్లో కొంత నైరాశ్యం పెరగటానికి కారణమైంది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, విదేశాంగ మంత్రి శివశంకర్‌లాంటి పర్యటనలు సైతం అర్ధాంతరంగా రద్దుకావటం చర్చనీయాంశమైంది. వీటిన్నింటికీ విరుగుడుగా ఆదివారం కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అగ్రనేత అమిత్‌షా రానుండటం ప్రాధాన్యం రేకెత్తిస్తోంది. శ్రేణులందరినీ ఏకతాటిపైకి తేవటమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో శక్తి కేంద్రాల వారీగా ఓటింగ్‌ శాతాన్ని నిర్దేశించే పనిలో భాజపా నాయకత్వం దృష్టి సారించింది.


కాంగ్రెస్‌కు కలిసొచ్చేనా..

ఆదిలాబాద్‌ ఎంపీగా ఆత్రం సుగుణ విజయంతో భాజపాకు సవాలు విసరాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) భావిస్తోంది. పార్టీకి అనుకూలంగా భావించే వివిధ వర్గాల మద్దతు కూడగట్టడంలో సఫలమవుతున్నా సొంత పార్టీశ్రేణులను ఏకతాటిపై తీసుకురావటంలో విఫలమవుతోంది. మంత్రి సీతక్క, పీసీసీ ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్‌ నేతల మధ్య సఖ్యత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  నియోజకవర్గానికో విధానం అన్నట్లుగా పరిస్థితి ఉంది. నిర్మల్‌లో కీలక నేతలు అభ్యంతరం వ్యక్తం చేసినా మాజీ మంత్రి  ఇంద్రకరణ్‌రెడ్డి వేణుగోపాలాచారి, ముథోల్‌లో విఠల్‌రెడ్డి, సిర్పూర్‌లో కోనప్ప, మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌లను పార్టీలోకి ఆహ్వానించిన నేతలు ఆదిలాబాద్‌లో సాజిద్‌ఖాన్‌, గండ్రత్‌ సుజాత, సంజీవ్‌రెడ్డిలను వ్యతిరేకించటం గమనార్హం. ఖానాపూర్‌లో రేఖానాయక్‌, బోథ్‌లో గోక గణేష్‌రెడ్డి, మల్లెపూల నర్సయ్య, ఆసిఫాబాద్‌లో విశ్వప్రసాద్‌ సహా ఎంపీ సీటు ఆశించిన నరేష్‌జాదవ్‌కు జిల్లాస్థాయిలో సముచిత స్థానం దక్కలేదు. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను పీసీసీకి వివరించటంలో లోపం ఉన్నట్లుగా పరిశీలకులుగా వచ్చిన నేతలు గుర్తించారు.

పథకాలు - అభ్యర్థి : ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ పట్ల ఓటర్లలో సానుకూలత ఉంది. నిర్మల్‌, సిర్పూర్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల కాంగ్రెస్‌ అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 వంటగ్యాసు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వినియోగం సహా పంద్రాగస్టుకు రూ.2 లక్షల రుణమాఫీ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో నేతలు ఆసక్తి చూపడం లేదనే  చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఇప్పటికే ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం పూర్తి చేయగా ఆదివారం పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్మల్‌కు రానుండటం కీలకం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని