logo

సెలవు కరవు.. విధుల బరువు..

కనిపించని నాలుగో సింహం పోలీస్‌. ఇది అక్షర సత్యం. అదే సమయంలో పోలీసు జీవితం వెనక కనిపించని కష్టాలు, ఒత్తిళ్లు, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఖాకీ చొక్కా.. ప్యాంటులో హుందాతనంగా కనిపిస్తుంటారు.

Published : 06 May 2024 05:08 IST

ఒత్తిడికిలోనై అనారోగ్యం పాలవుతున్న పోలీసులు, సిబ్బంది
మంచిర్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే

సర్వీస్‌లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది.. వయసు 35  సంవత్సరాలు రాకముందే బీపీ, షుగర్‌ వచ్చాయి. ఇంట్లో శుభకార్యాలకు ఉండలేని పరిస్థితి ఉంది.

ఓ కానిస్టేబుల్‌ ఆవేదన


వరుసగా ఎన్నికలు, ప్రముఖుల రాకపోకలు, జాతరలు రావడంతో కొద్దిరోజులుగా కుటుంబసభ్యులకు దూరంగా ఉంటున్నాం. అందరం కలిసి భోజనం చేసి చాలా రోజులైంది.

మరో కానిస్టేబుల్‌ వేదన


జిల్లాకేంద్రంలో బ్లూకోట్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న సతీష్‌ అనే కానిస్టేబుల్‌ ఆదివారం ఉదయం ఈత కొడుతుండగా తీవ్ర అస్వస్థతకు గురై హఠాన్మరణం పొందారు. వరుస విధులతో కొద్దిరోజులుగా ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

‘ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదయ్యే పోలీస్‌స్టేషన్‌ మంచిర్యాల. ఏటా 650కు పైగా నమోదవుతాయి. దీనికితోడు నిత్యం ఫిర్యాదులు, ఆందోళనలు, రాజకీయ నాయకుల రాకలు, ఇతరత్రా ఇక్కడ అధికారులతోపాటు సిబ్బందికి పనిభారం తప్పడం లేదు. 62 మంది సిబ్బందికి ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. వాస్తవానికి పట్టణంలో అదనపు ఠాణాతో పాటు మరో 30 మంది సిబ్బంది అవసరముంది.’  


నిపించని నాలుగో సింహం పోలీస్‌. ఇది అక్షర సత్యం. అదే సమయంలో పోలీసు జీవితం వెనక కనిపించని కష్టాలు, ఒత్తిళ్లు, ఆరోగ్య, కుటుంబ సమస్యలతో పోలీసులు మానసికంగా కుంగిపోతున్నారు. ఖాకీ చొక్కా.. ప్యాంటులో హుందాతనంగా కనిపిస్తుంటారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వారంలో ఒక్క రోజుకూడా కుటుంబసభ్యులతో సరదాగా గడపలేని పరిస్థితి. పోలీస్‌ సిబ్బందికి ప్రభుత్వం అయిదు సంవత్సరాల క్రితం వారాంతపు సెలవులు ప్రకటించినా జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. సిబ్బంది కొరత కారణంగా అవసరాన్ని బట్టి.. స్టేషన్‌ అధికారి అనధికారికంగా అనుమతి ఇస్తేనే బయటకు వెళ్లాల్సి వస్తోంది. అనుకోకుండా బందోబస్తు, ఇతర నేరాలు జరిగినట్లయితే ఆ అనుమతి రద్దు చేసుకొని తిరిగి విధుల్లోకి రావాల్సిందేనని కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. వీరికి అనుబంధంగా పనిచేస్తున్న హోంగార్డుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. విధులకు హాజరుకాని రోజు వారి వేతనంలో కోత విధిస్తున్నారు.


సగం కన్నా ఎక్కువ ఖాళీలు..

రామగుండం పోలీసు కమిషనరేట్‌లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం కానిస్టేబుల్‌స్థాయి నుంచి ఎస్సై వరకు కమిషనరేట్‌లో 2500 మంది ఉంటారు. సిబ్బంది కొరత ఉండడంతో వారాంతపు సెలవులు అమలు జరగడం లేదని అధికారులు చెబుతున్నారు. రామగుండం పోలీసు కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌ 2017 నవంబరులో పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులకు శ్రీకారం చుట్టారు. ఇది కొద్దిరోజులే అమలుకు నోచుకుంది. తర్వాత అధికారులు మారడంతో వారాంతపు సెలవులు సైతం నిలిచిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని