logo

ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్యాయత్నం

ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆ దంపతులు బలవన్మరణానికి యత్నించారు.

Published : 07 May 2024 03:40 IST

భార్య మృతి, ప్రాణాలతో బయటపడిన భర్త

పుష్పలత

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆ దంపతులు బలవన్మరణానికి యత్నించారు. భార్య మృతిచెందగా, భర్త ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. పట్టణ ఎస్సై రాజేశ్వర్‌గౌడ్‌ తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని ప్రియదర్శినినగర్‌కు చెందిన కృష్ణమూర్తి (60), పుష్పలత (56) దంపతులు. భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, భార్య గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. కృష్ణమూర్తి ఉద్యోగం చేస్తూనే స్థిరాస్తి వ్యాపారం, చీటీల నిర్వహణ చేపట్టేవారు. ఈ క్రమంలో అప్పుల్లో కూరుకుపోయారు. వాటిని తీర్చేమార్గం కనిపించకపోవడంతో మానసికంగా ఆందోళనకు గురయ్యారు. దీనికితోడు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే వారి కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి మధ్య ఏర్పడిన మనస్పర్థలతో దాదాపు ఏడాదిగా కోడలు ఇంటికి రాకపోవడం వారిని మరింత కుంగదీసింది. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మూడురోజుల క్రితం బాసర అమ్మవారి క్షేత్రానికి వెళ్లిన వీరిద్దరూ ఆదివారం రాత్రి నిర్మల్‌కు తిరిగొచ్చారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పట్టణంలోని బంగల్‌పేట్‌ వినాయకసాగర్‌లో దూకారు. భార్య నీటమునిగి చనిపోగా, భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా, గమనించిన స్థానికులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని