logo

అతివేగం.. బతుకులు ఆగం..

చిన్నపాటి నిర్లక్ష్యం.. త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆతృతతో అత్యంత వేగంగా, మద్యం తాగి వాహనాలను నడపడంతోనే ప్రమాదాలు చోటుచేసుకొని విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

Updated : 07 May 2024 06:54 IST

గాలిలో కలుస్తున్న విలువైన ప్రాణాలు
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ నేర విభాగం  

చిన్నపాటి నిర్లక్ష్యం.. త్వరగా గమ్యం చేరుకోవాలన్న ఆతృతతో అత్యంత వేగంగా, మద్యం తాగి వాహనాలను నడపడంతోనే ప్రమాదాలు చోటుచేసుకొని విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఎక్కువగా ఈ ప్రమాదాల్లో యువకులే మృత్యువాత పడి కుటుంబ సభ్యులు వారిపై పెట్టుకున్న ఆశలను నీరుగారుస్తూ విషాదాన్ని మిగులుస్తున్నారు. జిల్లాలో రెండు నెలల్లోనే 71 ప్రమాదాలు చోటు చేసుకోగా 27 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 48 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు. జాతీయ రహదారి 44పై గుడిహత్నూర్‌ మండలంలోని మేకలగండి, సీతాగొంది, మావల సమీపంలోని దేవాపూర్‌ చెక్‌పోస్టు, మావల బైపాస్‌ వద్ద, నేరడిగొండ మండలం బోరిగాం, కుప్టి ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం అతి వేగం, ఏమౌతుందిలే అనే  నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇంద్రవెల్లి మండలం ఇన్కô్గూడ వద్ద అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. హైదరాబాద్‌కు చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.


ఇద్దరు యువకుల దుర్మరణం

నార్నూర్‌ మండలం చోర్‌గాం గోండ్‌గూడ చెందిన దుర్వ చందు(27), ఆడ మధుకర్‌(20) ద్విచక్ర వాహనంపై అతి వేగంగా ప్రయాణిస్తూ ఇంద్రవెల్లి మండలం ధనోరా(బి)-ఇన్కర్‌గూడ మధ్య ఆర్‌టీసీ బస్సును ఏప్రిల్‌ 26న ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడ్డారు. రిమ్స్‌కు తరలించగా అదే రోజు అర్ధరాత్రి మృతి చెందారు.


జూనియర్‌ అసిస్టెంట్ దుర్మరణం  

ఆదిలాబాద్‌ పోలీసు ముఖ్య కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్గా విధులు నిర్వహించే అక్షయ్‌(25) కారును నిర్లక్ష్యంగా అపసవ్య దిశలో నడుపుతూ 44వ జాతీయ రహదారిపై నడుపుతూ ఏప్రిల్‌ 9న ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రగాయాల పాలవ్వగా నిజామాబాద్‌కు తరలించి చికిత్స అందించారు. 13న చికిత్స పొందుతూ మృతి చెందారు.  


ముందున్న కంటైనర్‌ను ఢీకొని

44వ జాతీయ రహదారిపై మావల బైపాస్‌ సమీపంలో ఏప్రిల్‌ 1న ముందు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీకొంది. కారు ముందు భాగం కంటైనర్‌ వెనుక ఇరుక్కుపోయింది. ప్రమాద తీవ్రతకు కారులోని బెలూన్లు సైతం పగిలిపోయాయంటే కారు వేగాన్ని అంచనా వేయొచ్చు. ఈ ప్రమాదంలో డీఆర్‌డీఏలో పని చేసే సీనియర్‌ అసిస్టెంట్ గోవిందరాజు దుర్మరణం పాలయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవటంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.


త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

జిల్లా కేంద్రం సమీపంలోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులిద్దరికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. దంపతులిద్దరు గాయాలపాలయ్యారు. కేఆర్‌కే కాలనీకి చెందిన కాంబ్లె భీంరావు, భార్య లక్ష్మీ ఆదిలాబాద్‌ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో ముందు వెళ్తున్న ఆర్‌టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆటో ఢీకొనటంతో రోడ్డుపై పడిపోయారు. ద్విచక్రవాహనం బస్సు టైర్ల కిందకు దూసుకెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని