logo

రక్త పిశాచి... చొరవ చూపితేనే విముక్తి

తలసీమియా.. ఈ రక్తపిశాచితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్థులు యాతన పడుతున్నారు. రోజూ మనిషి ఆహారాన్ని ఎలా కోరుకుంటాడో.. ఈ మహమ్మారి పక్షంరోజులకు ఒకసారి ఆయా బాధితుల రక్తం స్వీకరించేందుకు ఉవ్విళ్లూరుతుంటుంది.

Updated : 08 May 2024 06:58 IST

నేడు ప్రపంచ తలసీమియా దినోత్సవం

మంచిర్యాల వైద్యవిభాగం, న్యూస్‌టుడే: తలసీమియా.. ఈ రక్తపిశాచితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాధిగ్రస్థులు యాతన పడుతున్నారు. రోజూ మనిషి ఆహారాన్ని ఎలా కోరుకుంటాడో.. ఈ మహమ్మారి పక్షంరోజులకు ఒకసారి ఆయా బాధితుల రక్తం స్వీకరించేందుకు ఉవ్విళ్లూరుతుంటుంది. ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతూ జిల్లాలో వందలాది మంది చిన్నారులు నరకం అనుభవిస్తున్నారు. వీరు బతకాలంటే క్రమం తప్పకుండా శరీరంలోకి రక్తం ఎక్కించుకోవాల్సిందే. అవసరమైన మందులు వాడాల్సిందే. బాధితులకు ఊరటనిచ్చే అంశం ఏదైనా ఉందంటే ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా రెడ్‌క్రాస్‌, ప్రభుత్వ రక్తనిధి కేంద్రాలతో  ఉచితంగా రక్తం, మందులు, రవాణా ఖర్చులు ఇవ్వడమే. అంతకుమించి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేసింది లేదు. ఇటీవల రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వంతో పాటు త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి ఏర్పడే కేంద్ర ప్రభుత్వమైనా ఈ భయంకరమైన వ్యాధి నిర్మూలనకు పరిష్కారం చూపించాలని ఆశిద్దాం. బుధవారం ప్రపంచ తలసీమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ప్రత్యేక కథనం..

ఈ రోగం బారిన పడిన వారందరూ దాదాపు పేదలే కావడంతో పట్టించుకునేవారు కరవయ్యారు. ఈ మహమ్మారికి చికిత్స ఉందని, నయం అవుతుందని తెలిసినా ఏ ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదు. బోన్‌మ్యారో చికిత్సతో ఈ రక్తపిశాచి నుంచి బయటపడే అవకాశముంది. రాష్ట్రంలో పలు కార్పొరేట్‌ ఆసుపత్రులు చికిత్స అందిస్తున్నా ఖర్చుతో కూడుకుంది అని నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇటీవల ఆరోగ్యశ్రీ స్థాయితో పాటు పలు రకాల చికిత్సలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ నిత్యం ప్రాణభయంతో కొట్టుమిట్టాడుతున్న తలసీమియా చిన్నారులకు అవసరమైన వైద్యాన్ని అందులో చేర్చలేకపోతుంది. తాత్కాలిక ఉపశమనంగా పక్షం రోజులకు ఓ యూనిట్‌ రక్తం, మాత్రలు అందిస్తుందే తప్ప శాశ్వత చికిత్సకు మొగ్గుచూపడం లేదు.

సంకల్ప్‌ చేయూత..

తలసీమియా వ్యాధిగ్రస్థులకు అండగా నిలిచేందుకు, పునర్జన్మ ఇచ్చేందుకు కర్ణాటకకు చెందిన స్వచ్ఛంద సంస్థ ముందుకురావడం అభినందనీయం. సంకల్ప్‌ ఇండియా ఫౌండేషన్‌ బెంగళూరులోని మహావీర్‌జైన్‌ ఆసుపత్రిలో బోన్‌మ్యారో చికిత్సను అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు. ఆయా ఆసుపత్రిలో చికిత్సకు రూ.10 లక్షలు అవుతుండగా ఫౌండేషన్‌ రూ.5 లక్షలు భరిస్తుండటం, కేంద్ర ప్రభుత్వ సహకారం(రూ.3లక్షలు) వస్తుండటంతో బాధితుడికి ఉపశమనం కలుగుతుంది. ఈ చికిత్సకు ప్రధానంగా కావాల్సింది హెచ్‌ఎల్‌ఏ(హ్యూమన్‌ ల్యూకోసైట్‌ యాంటిజెన్‌)పరీక్షలో ఆయా బాధితుల కుటుంబసభ్యుల బోన్‌మ్యారో సరిపోవడమే. ఇప్పటికే జిల్లాకు చెందిన ఒకరికి విజయవంతం కాగా మరో నలుగురు చికిత్సకు సిద్ధమవుతున్నారు. బోన్‌మ్యారో చికిత్సను సింగరేణి ఆరోగ్యకార్డుతో పూర్తిగా ఉచితంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సిటిజన్‌ హాస్పిటల్స్‌లో ఇప్పటికే సంబంధిత కార్మిక కుటుంబాలకు చెందిన ముగ్గురు బాధితులు ఇటీవల బోన్‌మ్యారో చికిత్స విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం సైతం ఈ వ్యాధికి చికిత్సను ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తే వేలమందికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుంది.

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌కు చెందిన సతీష్‌-రాణి దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురికి ఏడాదిన్నర వయసులోనే తలసీమియా వ్యాధిని గుర్తించారు. కొంతకాలంగా రక్తం స్వీకరిస్తుండగా ఇటీవల చేసిన హెచ్‌ఎల్‌ఏ పరీక్షలో సోదరుడి బోన్‌మ్యారో సరిపోవడంతో చికిత్స చేసేందుకు సిద్ధమయ్యారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ, సంకల్ప్‌ ఇండియా ఫౌండేషన్‌ సహకారంతో బెంగళూరులోని ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటుందని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు. బాధిత బంధువుల కణాలు సరిపోయి దానానికి ముందుకొస్తే 15 ఏళ్ల లోపు చిన్నారులందరూ తలసీమియా నుంచి ఉపశమనం పొందవచ్చని తెలుపుతున్నారు.

ఇటీవల రెడ్‌క్రాస్‌ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖ తలసీమియా వ్యాధిపై అవగాహన పెంచేందుకు వారం రోజుల పాటు సదస్సులు నిర్వహించింది. దీని బారినపడకుండా వివాహానికి ముందు హెచ్‌బీఏ 2 పరీక్షను చేసుకోవాలని సూచించింది. వేసవికాలం కావడం, రక్తనిల్వల కొరత ఏర్పడుతుండటంతో ప్రస్తుత బాధితుల అవసరంరిత్యా రక్తదానానికి ముందుకురావాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని