logo

వీరికి సార్వత్రిక సమరం.. వారిది ఆక్రమణల పర్వం

బెల్లంపల్లి పట్టణంలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. కబ్జాలు చేయడానికి ఏ మాత్రం భయపడడం లేదు. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే పాగా వేస్తున్నారు.

Updated : 09 May 2024 06:45 IST

బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న కబ్జాలు

షంషీర్‌నగర్‌లో ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మాణం

బెల్లంపల్లి పట్టణం, న్యూస్‌టుడే: బెల్లంపల్లి పట్టణంలో ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. కబ్జాలు చేయడానికి ఏ మాత్రం భయపడడం లేదు. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే పాగా వేస్తున్నారు. రెవెన్యూ అధికారులు సీˆజ్‌ చేసిన వాటి తాళాలు తీస్తున్నారంటే అక్రమార్కుల పలుకుబడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సమయం కావడంతో అక్రమార్కులు అత్యంత వేగంగా కబ్జాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అధికారులు ఎన్నికల హడావుడిలో ఉండటం అనువైన సమయంగా భావిస్తున్న కబ్జాకోరులు తమ పని తాము చేసుకుపోతున్నారు. పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌, షంషీˆర్‌నగర్‌లో ఆక్రమణలకు హద్దు లేకుండా పోతోంది. రాజకీయ అండదండలతో భారీ కబ్జాలకు తెరలేపుతున్నారు.

గదులకు వేసిన సీల్‌ తొలగింపు

గతంలో షంషీర్‌నగర్‌లో అక్రమంగా నిర్మించిన గదులకు అప్పటి తహసీల్దార్‌ సీజ్‌ చేశారు. రెవెన్యూ అధికారులు గదులు తెరిపించడానికి  అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ అక్రమార్కులు సీల్‌ వేసిన తాళాలను తొలగించారు. అయినా అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదు. తాళాలు తీయడంతోపాటు చుట్టు ప్రహరీ నిర్మిస్తున్నారు. గదుల వెనకాల ఉన్న స్థలాన్ని సైతం కబ్జా చేశారు. ఇసుక, రాళ్లు, ప్రహారీ ఇటుకలు సిద్ధంగా ఉంచారు. రోజూ పనులు కొనసాగిస్తున్నా అధికారులు స్పందించడం లేదు. యథేచ్ఛగా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తుంటే చోద్యం చూడడం అధికార యంత్రాంగం వంతవుతుంది.

షంషీర్‌నగర్‌లో చెట్టు నరికి చదును చేసిన ప్రభుత్వ స్థలం

రెవెన్యూ అధికారులకు ముడుపులు?

షంషీర్‌నగర్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణలో రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అధికారులకు కావల్సిన వాటిని సమకూరిస్తే చాలు ఆక్రమణలకు ఎవరూ అడ్డు ఉండరని అక్రమార్కులు బహిరంగంగానే చెబుతున్నారు. ముడుపుల కోసం ఎకరానికి ఒక ధర నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయంలో స్టేట్‌ బ్యాంకు ఎదురుగా ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఓ గది నిర్మాణమే ఉదాహరణ. ప్రభుత్వ భూములను రక్షించడంలో రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అక్రమార్కులతో అధికార యంత్రాంగం అంటకాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. షంషీర్‌నగర్‌ ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో సమగ్ర విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని