logo

వసతులు కరవు.. బతుకు బరువు!

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో పాలకులదే ప్రధాన పాత్ర. అలాంటి వారిని ఎన్నుకునే బాధ్యత ప్రజలది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాలకులను ఎన్నుకుంటూ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు.

Published : 09 May 2024 06:41 IST

ఎన్నికలు బహిష్కరిస్తామంటున్న గ్రామస్థులు

చెలమ నీరు తోడుకుంటున్న దాబగూడవాసులు

ఆసిఫాబాద్‌, తిర్యాణి, న్యూస్‌టుడే: ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, అభివృద్ధి పనులు చేపట్టడంలో పాలకులదే ప్రధాన పాత్ర. అలాంటి వారిని ఎన్నుకునే బాధ్యత ప్రజలది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా పాలకులను ఎన్నుకుంటూ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. కానీ వారు జీవనం సాగిస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రజా ప్రతినిధులు విఫలం అవుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా.. ఇప్పటికీ ఆయా గ్రామాలకు కనీసం రహదారి సౌకర్యం లేకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక ఎవరు వచ్చినా తమకు ఒనగూరేది ఏమీ లేదని భావించిన ఆ గ్రామస్థులు.. ఓటింగ్‌కు దూరంగా ఉంటామంటున్నారు. ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలను బహిష్కరిస్తామని తిర్యాణి మండలం గోవెన పంచాయతీ పరిధిలోని గ్రామస్థులు మూడు రోజుల కిందట కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేకు వినతి పత్రం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

ఎడ్లబండిపై రేషన్‌ సరకులు తెచ్చుకుంటున్న గోవెన గ్రామస్థులు

జిల్లాలోనే అత్యంత వెనుకబడిన మండలం తిర్యాణి. ఈ మండలంలోని గోవెన పంచాయతీ పరిధి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇక్కడ గోండ్‌గూడ, కొలాంగూడ, నాయకపుగూడ, కర్సుగూడ, దాబగూడ.. ఇలా అయిదు గూడేలు ఉన్నాయి. మొత్తం 69 కుటుంబాలు 361 జనాభా ఉంది. 136మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా పంచాయతీ కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే ఈ గూడేలు వసతుల లేమితో అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారు. మండల కేంద్రం నుంచి సుమారు 25-30 కి.మీ. దూరంలో ఈ పంచాయతీ కేంద్రం ఉంది. నేటికీ బీటీ రోడ్డు లేదు. మట్టి రోడ్డే దిక్కు. మధ్య మధ్యలో గుట్ట ప్రాంతం, వాగులు ఉన్నాయి. ఈ గ్రామానికి 108, 102 ఇతర ఏ వాహనాలు వెళ్లలేని దుస్థితి. ఎవరైనా అనారోగ్యానికి గురైతే దేవునిపైనే భారం వేయాల్సి వస్తోంది.

వానాకాలంలో దయనీయ పరిస్థితి

వానాకాలంలో వీరి పరిస్థితి దయనీయంగా మారుతుంది. మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి రావాలన్నా మధ్యలో వాగులు దాటాల్సి వస్తుంది. అవి ఉప్పొంగి ప్రవహించిన సమయంలో బాహ్య ప్రపంచానికి దూరం కావాల్సిందే. ఎడ్లబండ్లే వీరి రవాణా సాధనం. గూడేల్లో బావులు ఉన్నా.. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. భగీరథ నీరు సక్రమంగా రావడంలేదు. వాగుల వద్ద చెలమల నీటిని తెచ్చుకొని తాగుతున్నారు. నాయకపు గూడకు ఇప్పటికీ విద్యుత్తు సౌకర్యం లేదు. రాత్రివేళ చీకట్లలోనే గడపాల్సిన పరిస్థితి. చరవాణి సంకేతాలు సైతం అందుబాటులో లేవు.

గోవెన గ్రామానికి వెళ్లే దారి

రేషన్‌కు అటు.. నిత్యావసరాలకు ఇటు

ఈ గూడేలవాసులు రేషన్‌ సరకుల కోసం 10 కిలోమీటర్ల దూరంలోని పంగిడిమాదరకు, ఆసరా పింఛన్ల కోసం 20 కి.మీ. దూరంలోని సుంగపూర్‌కు వెళ్తుంటారు. ఎడ్లబండ్లు కలిగిన వారు.. వాటిపై, లేని వారు నెత్తిన మూటలతో బియ్యం, ఇతర సరకులు మోసుకుని కాలినడకన వెళ్లాల్సిందే. చాలా మంది నిత్యావసర సరకులు, ఇతర అవసరాలకు జిల్లా కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. గోవెన నుంచి పది కిలోమీటర్లు కాలినడకన ఆసిఫాబాద్‌ మండలం బల్హాన్‌పూర్‌కు రావాలి. అక్కడి నుంచి సుమారు 20 కి.మీ. వాహనాల్లో జిల్లా కేంద్రానికి వస్తుంటారు. ఏటా వర్షాకాలంలో సరకుల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందస్తుగా తెచ్చిపెట్టుకుంటుంటారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం పక్కా రోడ్డయినా ఏర్పాటు చేయాలని దీనంగా వేడుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని