logo

రాజ్యాంగ పరిరక్షణకు ఐక్యంగా సాగాల్సిన సమయమిది

‘అధిక సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రమాదంలో పడుతున్న రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అంతా ఐక్యంగా సాగాల్సిన సమయం వచ్చిందని..’ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు.

Published : 09 May 2024 06:43 IST

మాట్లాడుతున్న ఆచార్య కోదండరాం

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే : ‘అధిక సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రమాదంలో పడుతున్న రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు అంతా ఐక్యంగా సాగాల్సిన సమయం వచ్చిందని..’ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్‌లో ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అంశంపై నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2000లో భాజపా జస్టిస్‌ వెంకటాచలయ్య కమిషన్‌ వేసిందని, కానీ తమ ఎజెండాను పక్కన పెట్టకుండా రాజ్యాంగాన్ని యూరప్‌, బ్రిటీష్‌ వారు రాశారని, ఇది మనది కాదని చెబుతూ వచ్చారన్నారు. వాస్తవానికి స్వాతంత్రోద్యమం నుంచి వచ్చిన విలువల ఆధారంగా రాజ్యాంగం తయారు చేసుకున్నామని చెప్పారు. రాజ్యాంగం వచ్చాక మనుషులంతా సమానంగా గుర్తించి, అందరు సమానంగా బతకడానికి, ఎదగడానికి అవకాశం కల్పించడం మొదలైనట్లు పేర్కొన్నారు. బతకడానికి, మనుషులుగా నిలవడానికి కారణమైన రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్న ఈ తరుణంలో ఎన్నికలు ఒక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. తద్వారా రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

దేశంలో అసమానతలు..

దేశంలో అసమానతలు పెరిగాయని అంబానీ ఆదాయం రూ.1.50 లక్షల కోట్ల నుంచి రూ.7.50 లక్షల కోట్లకు, అదానీ ఆదాయం రూ.25 వేల కోట్ల నుంచి రూ.7.50 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. కానీ మీలో ఎవరివైనా నాలుగైదింతలు పెరిగిందా? అని ప్రశ్నించారు. రోజు రోజుకు మనం కిందపడి పోతున్నాం. వ్యవసాయం కుంటుబడిపోతోంది. ఖర్చులు పెరుగుతున్నాయి. తద్వారా ఇక వ్యవసాయం చేయగలుగుతామా అన్న భయం చాలా మందిలో ఉన్నట్లు చెప్పారు. ఇలాంటి వాటి నుంచి బయట పడేందుకే ఈ చర్చల ఉద్దేశమని పేర్కొన్నారు. అంతకు ముందు సీనియర్‌ పాత్రికేయుడు మునీర్‌, మరి కొందరు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా జీవించాల్సిన దేశంలో హక్కులకు భంగం కలుగుతోందని, రాజ్యాంగం ప్రమాదంలో పడిపోతుందన్నారు. నాగాలాండ్‌లోని ఆరు జిల్లాల్లో నాలుగు లక్షల మంది ఓటర్లు ఎన్నికలు బహిష్కరించిన విషయం పెద్ద చర్చనీయాంశమని తెలిపారు. కేంద్రంలో భాజపాను అడ్డుకోవడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, తెలంగాణ జనసమితి ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జి బాబన్న, వివిధ సంఘాల సభ్యులు రవీందర్‌, సోయం చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని