logo

మూగజీవాల దాహం కేకలు

మూగజీవాల దాహార్తి తీర్చాలని గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి నీటి తొట్టెలు నిర్మించింది. అధికారుల అవగాహన లోపం, పర్యవేక్షణ లేని కారణంగా గుత్తేదారులు

Published : 09 May 2024 06:54 IST

నీటి తొట్టెలపై నిర్లక్ష్యం
న్యూస్‌టుడే, తలమడుగు

తలమడుగు మండలం కజ్జర్లలోని ఓ చెరువులో నీటిని తాగేందుకు పరుగులు పెడుతున్న ఆవులు, గేదెలు

మూగజీవాల దాహార్తి తీర్చాలని గత ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి నీటి తొట్టెలు నిర్మించింది. అధికారుల అవగాహన లోపం, పర్యవేక్షణ లేని కారణంగా గుత్తేదారులు ఇష్టారాజ్యంగా నిర్మించడంతో నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. దీంతో పశువుల దాహార్తి తీరకపోగా నిధులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లాయి. వేసవి తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటుతుండటంతో గుక్కెడు నీటికి మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

జిల్లా వ్యాప్తంగా ఏడాదిన్నర కిందట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 766 నీటి తొట్టెలు మంజూరయ్యాయి. ఒక్కో  తొట్టెకు రూ.22,000 చొప్పున మొత్తం రూ.1.66 కోట్లు కేటాయించారు. మంజూరైన వాటిలో దాదాపు 396 తొట్టెల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిర్మాణ దశలో 200 ఉండగా నిరుపయోగంగా 170 ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆవులు, గేదెలు 3,50,000, గొర్రెలు, మేకలు 1,95,000 ఉన్నాయి. ఎండలు తీవ్రమవుతుండగా, భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో మూగజీవాలు గుక్కెడు నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.  

పట్టింపు ఏది?

వేసవి నేపథ్యంలో నిరుపయోగంగా ఉన్న నీటి తొట్టెలను వినియోగంలోకి తేవాలి. అయినా పశుసంవర్ధక శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీశాఖ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వీటికి నీటి సరఫరాపై దృష్టి సారించడం లేదు. ఏడాది నుంచి ఉపాధి హామీ పథకంలో భాగంగా వీటి నిర్మాణాన్ని తొలగించారు. దీంతో మూగజీవాల దాహార్తికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


నీటి కోసం వెళ్లి మృత్యువాత  

ఇక్కడ కనిపిస్తున్న చిత్రం సుంకిడి గ్రామంలోనిది. కుచులాపూర్‌కు చెందిన రమణయ్యకు సంబంధించిన మూడు గేదెలు తాగు నీటికి మత్తడివాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లాయి. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరగగా మృత్యువాత పడ్డాయి. వాస్తవానికి కుచులాపూర్‌ చెరువుల్లో నీటి నిల్వ ఉంటే అయిదు కిలోమీటర్ల దూరంలోని ప్రాజెక్టు వద్దకు వచ్చేవి కావు.


నిరుపయోగంగా నీటితొట్టె  

తలమడుగు మండలం ఝరి పంచాయతీ పూనగూడలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గతంలో మూగజీవాల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టె నిర్మించారు. వాస్తవానికి ట్యాంకుకు అనువైన స్థలంలో నీటి తొట్టె నిర్మించి ట్యాంకు ద్వారా పైపులైన్‌తో నీరు సరఫరా చేయాలి. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అనువుగాని చోట నిర్మించారు. ప్రస్తుతం నిరుపయోగంగా మారింది.


నిధులు లేక ఇబ్బందులు
ఫణీందర్‌రావు, ఇన్‌ఛార్జి జిల్లా పంచాయతీ అధికారి

జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో నూతన నీటి తొట్టెలు ఏర్పాటు చేసుకునేందుకు పంచాయతీల్లో అవసరమైన నిధులు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు విడుదల కాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని