logo

ఓటు వేయడం.. బాద్యతగా భావిద్దాం

జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 13న నిర్వహించనున్న ఆదిలాబాద్‌ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం.

Published : 10 May 2024 05:58 IST

ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అశిష్‌ సంగ్వాన్‌

నిర్మల్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని నిర్మల్‌, ముథోల్‌, ఖానాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 13న నిర్వహించనున్న ఆదిలాబాద్‌ పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఎక్కడా ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఓటుహక్కు రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. పోలింగ్‌ ఏర్పాట్లకు సంబంధించి గురువారం ఆయనతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు


పట్టణాల్లో ఓటింగ్‌ శాతం పెంచడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు

ఇప్పటికే ‘స్వీప్‌’ ద్వారా అవగాహన కల్పించాం. సదస్సులు, ర్యాలీలు నిర్వహించాం. కళాజాత బృందాలతో ప్రజలను చైతన్యవంతులను చేశాం. ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకుని ఓటింగ్‌లో పాల్గొనాలి. పట్టణాల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి కృషి చేస్తున్నాం. ఓటర్లను చైతన్యం కలిగించేలా సెల్ఫీ పాయింట్లు, ఓటు విలువ తెలిపే బోర్టు ఏర్పాటుచేసి అవగాహన కల్పిస్తున్నాం.

ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా ఎలాంటి ఏర్పాట్లు చేశారు

ఓటరు స్లిప్పుల వెనుక పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లే రూట్‌ మ్యాప్‌ ఉంది. వీటితో పాటు ప్రత్యేకంగా ‘నిర్మల్‌లో ఓట్‌’ యాప్‌ను రూపొందించాం. ఈ యాప్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. పోలింగ్‌ కేంద్రం తెలియని వారు ఈ యాప్‌ ద్వారా ఆ కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చు.

జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి..

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 926 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. బ్యాలెట్‌, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించాం.  

ఎండాకాలం దృష్ట్యా పోలింగ్‌ కేంద్రాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..  

ప్రతి పోలింగ్‌ కేంద్రంలో నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నాం. తాగునీటి వసతి కల్పిస్తున్నాం. వైద్య బృందం అందుబాటులో ఉంటుంది. ఎండ తీవ్రత ఉందని ఆందోళన వద్దు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయవచ్చు. నిర్ణీత సమయం వరకు పోలింగ్‌ కేంద్రంలోకి వచ్చిన వారందరికీ ఓట్లు వేసే అవకాశం కల్పిస్తాం. దివ్యాంగులు, వయో వృద్ధుల కోసం వీల్‌ఛైర్లు అందుబాటులో ఉంటాయి.

సమస్యాత్మక ప్రాంతాల్లో తీసుకునే చర్యలేమిటి..

149 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాం. ఆయా కేంద్రాల్లో సూక్ష్మ పరిశీలకులు, వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పోలింగ్‌ జరిగే తీరు నిరంతర వీక్షణ ఉంటుంది. ఒక రోజు ముందు నుంచి పోలీసు భద్రత ఉంటుంది.

ఎన్నికల సందర్భంగా ఓటర్లకు మీరిచ్చే సందేశం

స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎలాంటి భయాందోళనకు గురికావద్దు. ఎవరైనా ప్రలోభాలకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా పోలీసులకు సమాచారం అందించాలి. పోలింగ్‌శాతం ఎక్కువైతే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఓటుహక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు సద్వినియోగం చేసుకోవాలి.

ఈ ఎన్నికల్లో ఎలాంటి ఆధునికత సాంకేతికతను వినియోగిస్తున్నారు..

గతానికి భిన్నంగా ఈసారి ఆధునిక సాంకేతికను వినియోగించేలా ఏర్పాట్లు చేశాం. అన్ని పోలింగ్‌ కేంద్రాలకు వెబ్‌కాస్టింగ్‌ అనుసంధానం చేశాం. అంతర్జాలం వేదికగా అనుసంధానిస్తున్న ఈ సరికొత్త విధానాన్ని ప్రతి పోలింగ్‌ కేంద్రానికి వర్తింపచేస్తున్నాం. ఇప్పటికే టీఎస్‌సీవోపీ ప్రత్యేక యాప్‌ ద్వారా గూగుల్‌ మ్యాప్‌ను అనుసరించి పోలింగ్‌ కేంద్రం చిత్రాలతో పాటు ఇతర విషయాలను పొందుపరిచాం.

ఓటరు స్లిప్పులు పంపిణీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు..

ఇప్పటికే జిల్లాలో 97.17 శాతం ఓటర్లకు ఓటు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. అందుబాటులో లేని, చనిపోయిన ఓటర్ల పేర్లతో ఎ.బి. ప్రత్యేక జాబితాను రూపొందిస్తున్నాం. ఈ జాబితా పోలింగ్‌ అధికారులకు అందజేస్తాం. స్లిప్పులు లేకుండా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్ల పేర్లు ఆ జాబితాలో ఉన్నాయా లేదో పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న పరిశీలకులు గమనిస్తారు. ఆ ఓటరు సంబంధించి నిజధృవీకరణ పత్రాల్లో ఏదేని ఒకటి చూపిస్తే ఓటు వేయడానికి అనుమతి ఇస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని