logo

గిరిజన కోటలో.. గిరిజనేతరుల ఓట్లే కీలకం

ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి.

Published : 10 May 2024 06:09 IST

న్యూస్‌టుడే, రాంనగర్‌ : ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపులో గిరిజనులతో పాటు గిరిజనేతరుల ఓట్లు కీలకంగా మారాయి. లోక్‌సభ నియోజకవర్గం ఎస్టీకి కేటాయించడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురూ గోండు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో గిరిజనేతరుల ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో అభ్యర్థులు ఉన్నారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధిలో 16.50 లక్షల మంది ఓటర్లు ఉండగా, గిరిజన సంఘాల నేతల లెక్కల మేరకు 3.55 లక్షల ఓట్లు గిరిజనులవి ఉన్నాయి. మిగిలిన 12.94 లక్షల ఓట్లు గిరిజనేతరులవే. వీటిని వర్గాల వారీగా రాబట్టుకునే ప్రయత్నంలో అభ్యర్థులు ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ గిరిజనుల జిల్లాగా ప్రసిద్ధి చెందింది. 240కి పైగా గ్రామాలు నోటిఫైడ్‌ గ్రామాలు ఉన్నాయి. గిరిజనులతో పాటు ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు సైతం నివసిస్తున్నారు. ఇక్కడ ఎప్పటినుంచో సాగు చేస్తున్న భూములకు పట్టా సమస్య ఉంది. గత ప్రభుత్వం గిరిజనులతో పాటు గిరిజనేతరుల భూ సమస్యను పరిష్కరించేందుకు దరఖాస్తులు చేసుకోమని చెప్పింది. వారి నుంచి ఆధారాలతో సహా దరఖాస్తులు తీసుకున్నారు. తీరా గిరిజనులకు అటవీహక్కు పత్రాలు ఇచ్చేసి, గిరిజనేతరుల సమస్య అలాగే వదిలేశారు. ఏజెన్సీ ఏరియాల్లో 40 వేల మంది రైతులు కొన్నేళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నారు. పట్టా పాసుపుస్తకాలకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ వాళ్ల భూములు నోటిఫైడ్‌ గ్రామాల్లో ఉండటంతో సమస్య అలాగే ఉండిపోయింది. ఇదిలా ఉంటే మిగిలిన గ్రామాల్లో గిరిజనేతరులే ఎక్కువగా ఉన్నారు. వీళ్ల ఓట్లు రాబట్టుకునేందుకు వర్గాల వారీగా కుల సంఘాలతో సమావేశాలు పెడుతున్నారు.

ప్రత్యేక దృష్టి

గిరిజనేతరుల ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. స్వయం ఉపాధితో పాటు పరిశ్రమల ఏర్పాటు, విద్యావకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నాయి. ప్రధానంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉండే గిరిజనేతరులకు మేలు చేసే కుప్టి, కుమురం భీం తదితర ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీనిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు, రైల్వే మార్గం పొడిగింపు తదితర హామీలను అభ్యర్థులు సైతం చెబుతున్నారు. నిర్మల్‌ జిల్లా పరిధిలో ఉండే బీడీ కార్మికుల సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆదిలాబాద్‌, సిర్పూర్‌, నిర్మల్‌, ముథోల్‌ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థులు, బోథ్‌, ఆసిఫాబాద్‌, భారాస, ఖానాపూర్‌ నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీల ప్రాబల్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో సైతం ఎక్కువ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నంలో పార్టీలు ఉన్నాయి. అసమ్మతి నేతలను పార్టీలో చేర్చుకోవడంలో ప్రాధాన్యమిస్తున్నాయి. ఆసిఫాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల్లో గిరిజనుల ఓట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నా, వాటిలో కూడా గిరిజనేతరుల ఓట్లు కీలకంగా ఉండే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని