logo

సరిహద్దుపై నజర్‌

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 10 May 2024 06:22 IST

ప్రాణహిత తీర ప్రాంతాల్లో బలగాల మోహరింపు

కోటపల్లి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపించింది. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రధానంగా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత, గోదావరి తీర ప్రాంత గ్రామాలపై ప్రత్యేక దృష్టిసారించారు. మారుమూల కోటపల్లి, వేమనపల్లి మండలాల మీదుగా పొరుగున మహారాష్ట్రతో ప్రాణహిత నది మీదుగా జరుగుతున్న రాకపోకలతోపాటు మావోయిస్టు ప్రభావిత గ్రామాలను డేగ కన్నుతో పరిశీలిస్తున్నారు.  

మహారాష్ట్రతోపాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఇటీవల పోలీసులు-మావోయిస్టుల మధ్య తరచూ జరుగుతున్న ఎదురుకాల్పుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ నెలకొన్న పరిస్థితులతోపాటు ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో ఎలాంటి అలజడులకు తావివ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా తమదైన కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రత్యేక బలగాలు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతుండగా మరోవైపు స్థానిక పోలీసులు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

  • జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం లేకున్నప్పటికీ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. ఇరు మండలాల్లో గతంలో చోటు చేసుకున్న ఘటనలు పునరావృతం కాకుండా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి గతంలో సానుభూతిపరులుగా ఉన్న సుమారు 72 మందిని గుర్తించి ముందస్తు బైండోవర్‌ చేశారు. ప్రాణహిత సరిహద్దులోని చెన్నూరు నుంచి కోటపల్లి, వేమనపల్లి, బెజ్జూరు మండలాల వరకు అప్రమత్తంగా ఉండాలనే ఉన్నత యంత్రాంగం ఆదేశాల మేరకు స్థానిక పోలీసు యంత్రాంగం తగు చర్యలు చేపడుతోంది. అడవులను జల్లెడ పడుతుండటంతో పాటు రహదారులు, కల్వర్టులను తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు.

సిబ్బందికి సూచనలు చేస్తున్న సీపీ, పాలనాధికారి(పాత చిత్రం)


నిఘా కట్టుదిట్టం

కోటపల్లి, వేమనపల్లి మండలాలగుండా ప్రాణహిత నది మీదుగా రాకపోకలు సాగించే ఫెర్రీ పాయింట్‌లను గుర్తించి ఆయా మార్గాలను పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తీర ప్రాంతాన్ని డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరిస్తూ అనుమానిత వ్యక్తుల సంచారంపై క్షేత్రస్థాయి వివరాలు సేకరిస్తున్నారు.

అదనపు బందోబస్తు

కోటపల్లి మండలం నక్కలపల్లి, పంగిడిసోమారం, బొప్పారం, అన్నారం, జనగామ, వెంచపల్లి, రొయ్యలపల్లి, ఆల్‌గామ, పుల్లగాంతోపాటు వేమనపల్లి మండలం కళ్లెంపెల్లి, ముక్కిడిగుడెం, వేమనపల్లి, రాచర్ల, జాజులపేట, రాచర్ల, నాగారం, లక్ష్మీపూర్‌, జిల్లెడ బద్దెంపల్లి తదితర గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక, గ్రామాల్లో ఇది వరకే కొన్నింటిలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. అల్లర్లు, అనుకోని ఘటనలు ఎదురైతే తక్షణం అప్రమత్తమయ్యేలా పోలీసులు సన్నద్ధమవుతున్నారు. సునిశిత పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ పూర్తయ్యే వరకు సాధారణ సిబ్బందే కాకుండా సివిల్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వుడ్‌కు సంబంధించి ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి అయిదుగురుతో కూడిన అదనపు సిబ్బందిని ఉంచేలా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 5 రూట్లుగా విభజించి క్యూఆర్‌టీ బృందాలను అందుబాటులో ఉంచారు. ఒక్కో బృందంలో నలుగురు సిబ్బందితో పర్యవేక్షించనున్నారు. ఎలాంటి గొడవలు జరిగినా పది నిమిషాల్లో సంబంధిత ప్రాంతానికి చేరేలా ఈ బృందాలను ఏర్పాటు చేశారు. వీరితోపాటు సీఐ, ఎస్సైలు తమతమ సిబ్బందితో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించేలా ఆదేశాలు జారీచేశారు. అంతరాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద వివిధ శాఖలకు చెందిన సుమారు 13 మంది మూడు షిప్టుల్లో విధులు నిర్వర్తిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు.


నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

వెంకటేశ్వర్లు, జైపూర్‌ ఏసీపీ

సరిహద్దు మండలాల్లో పోలింగ్‌ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్‌శాఖ తరఫున భద్రతా ఏర్పాట్లు చేశాం. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు