logo

మోసగించే పార్టీలకు బుద్ధి చెప్పాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్‌ ఆనాడే అన్నారు కాంగ్రెస్‌, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 10 May 2024 06:19 IST

భైంసాలో మాజీ మంత్రి కేటీఆర్‌

నిర్మల్‌ రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌, చిత్రంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, భారాస నేతలు

భైంసా, నిర్మల్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం బాగుపడ్డదా..తెలంగాణ అప్పుడెట్లుండే. ఇప్పుడెట్లైంది.. కేసీఆర్‌ ఆనాడే అన్నారు కాంగ్రెస్‌, భాజపాల మాటలకు మోసపోతే గోసపడుతారని, ఇప్పుడు 5 నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింద’ని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన నిర్మల్‌ పట్టణం, భైంసాలో పర్యటించారు. సాయంత్రం 5:30 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా భైంసా చేరుకున్న కేటీఆర్‌ నిర్మల్‌-బాసర మార్గంలోని బైపాస్‌ రహదారి నుంచి ఆటోనగర్‌, వివేకానంద చౌక్‌ మీదుగా పాత పోస్టాఫీసు వద్ద 7 గంటలకు రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్‌, భాజపాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. అధికారం చేపట్టిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారని, చేశారా అని ప్రశ్నించారు. రైతు భరోసా కింద రూ.15వేలు, మహిళలకు రూ.2,500, వృద్ధులకు పింఛను రూ.4వేలు, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఎప్పుడిస్తారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. ఈ సారి మోసపోవద్దని, కర్రు కాల్చి వాతపెట్టాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ హయాంలోనే అందరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ముథోల్‌ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, విఠల్‌రెడ్డిని ఎమ్మెల్యేగా నిలబెడితే ఓడిపోయారన్నారు, పార్టీ మారిన ఆయన గురించి మాట్లాడేది లేదన్నారు. ఒక్కరు పోతే నలుగురు వచ్చారని, వారితో పార్టీని నిలబెట్టుకుందామన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పదేళ్లలో మత రాజకీయాలు చేయడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. గుజరాత్‌ అభివృద్ధికి ఎన్నో నిధులు ఇచ్చిన మోదీ తెలంగాణకు నయాపైసా ఇవ్వలేదన్నారు. దేవుడి పేరుతో ఓట్లు అడిగి దేశాన్ని దోచి అదానీకి ఇస్తున్నారని ఆరోపించారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమే మోదీ తత్వమని ఎద్దేవా చేశారు. రాముడు అందరికీ దేవుడని, ఆయన ఆదర్శం ఇదేనా అని ప్రశ్నించారు. రెండు పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పి, ఎంపీ అభ్యర్థి అత్రం సక్కును గెలిపించాలని కేటీఆర్‌ కోరారు. అనంతరం నిర్మల్‌కు బయలుదేరారు.

పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం

కేటీఆర్‌ రోడ్‌షో విజయవంతం కావడంతో భారాస శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించింది. నిర్మల్‌లో సాయంత్రం 6.30 గంటలకు రావాల్సిన కేటీఆర్‌ 8.50 గంటలకు వచ్చారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా జై తెలంగాణ.. జై కేసీఆర్‌.. జై కేటీఆర్‌ అంటూ నినాదాలు చేశారు. నిర్మల్‌తోపాటు ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అంతకుముందు కళాకారుల పాటలతో ఉత్సాహ పరిచారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. భైంసా, నిర్మల్‌ రోడ్డుషో కార్యక్రమాల్లో నిర్మల్‌, ఆదిలాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్లు విజయలక్ష్మి, జనార్దన్‌, మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే జాదవ్‌ అనిల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి జాన్సన్‌నాయక్‌, నిర్మల్‌ నియోజకవర్గ పరిశీలకులు యూసుస్‌ అక్బాని, సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యులు జీవన్‌రెడ్డి, చారులత, జానుబాయి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు డా.సుభాష్‌, పార్టీ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ప్రధాన కార్యదర్శి నజీరొద్దీన్‌, సమన్వయ కమిటీ నాయకులు పి.రమాదేవి, విలాస్‌ గాదేవార్‌, డా.కిరణ్‌ కొమ్రెవార్‌, లోలం శ్యాంసుందర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఖానాపూర్‌లో రాత్రి భోజనం

ఖానాపూర్‌: భైంసా, నిర్మల్‌ రోడ్‌షోల అనంతరం కేటీఆర్‌ గురువారం రాత్రి ఖానాపూర్‌ వచ్చారు. భారాస ఖానాపూర్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జాన్సన్‌నాయక్‌ ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయనతో ఫొటోలు దిగడానికి స్థానిక నాయకులు పోటీపడ్డారు. అనంతరం కేటీఆర్‌ రోడ్డు మార్గాన సిరిసిల్లకు బయలుదేరి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని