logo

పండగ రోజులా భావించి ఓటేసేందుకు రండి

‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి.

Published : 10 May 2024 06:23 IST

అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం!
రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషా పిలుపు

‘ఇవి దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు. కోరుకున్న ప్రభుత్వ విధానాలు అమలు కావాలన్నా.. నచ్చిన ప్రభుత్వం ఏర్పడాలన్నా ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలి. ఎండల దృష్ట్యా ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్‌ రోజును సెలవుదినంగా కాకుండా పండగ రోజులా భావించి ఓటేసేందుకు రావాలి’ అని ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాజర్షిషా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ నెల 13న ఎంపీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనున్న దృష్ట్యా అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలపై ’న్యూస్‌టుడే’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు..

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం


న్యూస్‌టుడే : ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ తగ్గకుండా తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
పాలనాధికారి : ఎండల ప్రభావం ఓటర్లపై పడకుండా పోలింగ్‌ కేంద్రాల్లో నీడ కోసం షామియానాలు, కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాం. చల్లని తాగునీటి వసతి కల్పిస్తాం. సిబ్బందికి కూలర్లు పెట్టిస్తున్నాం. అవసరం ఉన్న చోట ఓటర్లకూ కూలర్లు అందుబాటులో ఉంచుతాం. ఏఎన్‌ఎం, ఆశాలు ఓఆర్‌ఎస్‌, మందులతో సిద్ధంగా ఉంటారు.


న్యూ : వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారా?
పా : పోలింగ్‌ కేంద్రాలకు దివ్యాంగులను, వయోవృద్ధులు, గర్భిణులను ఆటోల్లో తరలించి వారికి నేరుగా ఓటేసే అవకాశం కల్పిస్తున్నాం. దివ్యాంగులకు చక్రాల కుర్చీలు ఉంచి వాలంటీర్ల సాయంతో వారిని లోనికి తీసుకెళ్లి ఓటు వేయించే వెసులుబాటు కల్పిస్తాం.


న్యూ : పోస్టల్‌, హోం ఓటింగ్‌కు స్పందన ఎలా ఉంది?
పా : పోస్టల్‌ ఓటు వినియోగంలో రాష్ట్రంలోనే మన పార్లమెంటు స్థానం ముందంజలో ఉంది. దాదాపు 15 వేల మంది పోస్టల్‌ ఓటుకు దరఖాస్తు చేసుకుంటే ఇప్పటి వరకు 13 వేలకు పైగా ఓటేశారు. ఒక రోజు సమయం ఉన్నందున మిగిలినవారూ వేస్తారని భావిస్తున్నాం. ఇక హోం ఓటింగ్‌ 95 శాతం నమోదైంది.


న్యూ : ప్రస్తుతం డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల దృష్ట్యా గురుకులాలు, వసతిగృహాల్లో ఉంటున్న వారికి ఓటేసే అవకాశం ఇవ్వరనే మాట విద్యార్థుల నుంచి వినిపిస్తోంది. వారు ఓటేసేలా చొరవ చూపుతారా?
పా : డిగ్రీ విద్యార్థులంతా ఓటేయాలని కళాశాలల్లో ప్రచారం చేశాం. ఆదివారంతో పాటు పోలింగ్‌ రోజైన సోమవారం సెలవు ఉన్నందున ప్రతి ఒక్కరికి ఓటు వేసేలా వారి ఇళ్లకు పంపాలని సంబంధీకులకు ఆదేశాలిస్తాం. వారంతా విధిగా ఓటేసేలా చూడాలని సూచిస్తాం.


న్యూ : పోలింగ్‌కు 48 గంటల ముందు ఎలాంటి చర్యలు ఉంటాయి?
పా : ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి, మిగిలిన అయిదు చోట్ల సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచారం నిలిపేయాలి. బయట ప్రాంత వ్యక్తులు ఉంటే వెళ్లిపోవాలి. అంతటా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. నగదు రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే ఆధారాలు చూపించాలి.


న్యూ : పోలింగ్‌ కేంద్రం దూరంగా ఉండటంతో ఎండల దృష్ట్యా ఉచిత రవాణా సదుపాయం కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు?
పా : ఈ విషయమై మాకు విజ్ఞప్తులు వచ్చాయి. ఎక్కడైతే అలాంటి అవసరం ఉందో అక్కడి ఓటర్లకు రవాణా సౌకర్యం కల్పించాలని మా సిబ్బందికి ఆదేశాలిస్తాం.


న్యూ : కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో అర్బన్‌ ఏరియాలో 70 శాతం మించి పోలింగ్‌ కాలేదు. ఈ సారి ఆ శాతం పెరిగేలా తీసుకుంటున్న చర్యలేమిటి?
పా : ప్రతి గ్రామం, పట్టణం అన్ని చోట్ల ఓటరు చైతన్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాం. విద్యార్థుల చేత సంకల్ప పత్రాలను ఇంటింటికి పంపించి ఓటు వేయాలని వారితో చెప్పించాం. జిల్లాలో 93 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయ్యింది. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ మినహా మిగిలిన ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో ఓటేసేందుకు సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినందున పోలింగ్‌ శాతం పెరగవచ్చని భావిస్తున్నాం.


న్యూ : కీలకమైన పోలింగ్‌ సిబ్బంది కోసం ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? ఈవీఎంలు అప్పగించాక స్వస్థలాలకు రవాణా కల్పించాలంటున్నారు.
పా : పార్లమెంటు పరిధిలో ఈసారి వారి హోదాను బట్టి ఒకే రకమైన రెమ్యునరేషన్‌ ఇవ్వబోతున్నాం. ఎండకు అలసి పోకుండా కూలర్లు పెట్టిస్తున్నాం. ప్రత్యేక మెనూతో పాటు తరచూ మజ్జిగను పంపిణీ చేయిస్తున్నాం. స్వస్థలాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేస్తాం.


న్యూ : సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు?
పా : పార్లమెంటు పరిధిలో 250 పోలింగ్‌ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. అక్కడ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రత్యేక భద్రతా బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.


న్యూ : చివరగా ఓటర్లకు మీరిచ్చే సందేశం?
పా : బీఎల్‌వోలు ఇచ్చిన ఓటరు స్లిప్పులతో పాటు ఎన్నికల సంఘం సూచించిన 13 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి వెంట తీసుకురావాలి. ఎండలో ఏం వెళ్తామని నిర్లక్ష్యం చేయకుండా పండగలా భావించి ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓటువేయాలి. అయిదేళ్లకు తమకు నచ్చిన అభ్యర్థిని, దేశ భవిష్యత్తుకు పాటుపడే ప్రభుత్వం ఏర్పడేందుకు ఓటును తప్పక వినియోగించుకోవాలి. నేనూ ఇక్కడే ఓటు వేయబోతున్నా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు