logo

దక్కిన ప్రోత్సాహం రాజ్‌మాకు రాజయోగం

రాజ్‌మా.. ఒకప్పుడు మన్యం రారాజుగా వెలుగొందిన వాణిజ్య పంట. పూర్తి సేంద్రియ విధానంలో పండించే ఈ పంటకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్‌ ఉండటంతో ఏటా రూ. 60 కోట్ల వరకు వాణిజ్యం జరిగేది. 

Published : 28 Jan 2023 03:23 IST

గంజాయి నిర్మూలనతో పెరిగిన సాగు విస్తీర్ణం
కొనుగోళ్లు ప్రారంభం.. ధరలు ఆశాజనకం
గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే


ఎరుపు రకం చిక్కుళ్లు

రాజ్‌మా.. ఒకప్పుడు మన్యం రారాజుగా వెలుగొందిన వాణిజ్య పంట. పూర్తి సేంద్రియ విధానంలో పండించే ఈ పంటకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్‌ ఉండటంతో ఏటా రూ. 60 కోట్ల వరకు వాణిజ్యం జరిగేది. గంజాయి సాగు విస్తరణతో రాజ్‌మాకు గడ్డుకాలం ఎదురైంది. పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గత ప్రభుత్వం 90శాతం రాయితీతో విత్తనాలు సరఫరా చేసి ప్రోత్సహించింది. ప్రస్తుత ప్రభుత్వం అదే రాయితీతో విత్తనాలివ్వడం, గంజాయి నిర్మూలనతో రాజ్‌మా సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ వారం నుంచే మన్యంలో వీటి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

పోషకాహార వంటకాల్లో రాజ్‌మాదే పైచేయి. అందుకే వీటికి విదేశాల్లో, నక్షత్ర హోటళ్లలో డిమాండ్‌ ఉంది. దిల్లీ విమానాశ్రయంలో కేఎఫ్‌సీ బోన్‌లెస్‌ బకెట్‌ చికెన్‌ బకెట్‌ రూ. 1200 ఉంటే, 100 గ్రాముల రాజ్‌మా ఫ్రై రూ. 1850 చొప్పున విక్రయిస్తున్నారంటే వీటి ప్రాముఖ్యం అర్థమవుతోంది. అయితే పదేళ్ల కిందట మన్యం గిరిజనులు ప్రధాన వాణిజ్య పంటగా రాజ్‌మా చిక్కుళ్లను పండించేవారు. 5వేల హెక్టార్లలో ఈ పంట సాగయ్యేది. ఏటా రూ. 40కోట్ల నుంచి 60కోట్ల మేర క్రయవిక్రయాలు జరిగేవి. ఎప్పుడైతే ఈ ప్రాంతానికి గంజాయి సాగు పరిచయం అయ్యిందో రాజ్‌మాకు గ్రహణం పట్టింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడులు తగ్గిపోవడం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే గంజాయి సాగుపై గిరిజనులు దృష్టి మళ్లింది. దీంతో రాజ్‌మా సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోయి వచ్చింది. రెండేళ్ల క్రితం వరకు కేవలం 2వేల హెక్టార్ల కంటే తక్కువ విస్తీర్ణంలోనే ఈ పంట సాగయ్యింది.

తెలుపు రకం చిక్కుళ్లు

కలిసొచ్చిన ఆపరేషన్‌ పరివర్తన్‌..

మన్యంలో ఆపరేషన్‌ పరివర్తన్‌లో భాగంగా గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదే సమయంలో సంప్రదాయ రాజ్‌మా సాగును ప్రోత్సహించేలా పావులు కదిపింది. ఈ ఏడాది 90శాతం రాయితీతో 4300 క్వింటాళ్ల విత్తనాలు గిరిజన రైతులకు సరఫరా చేసింది. జీకే వీధి మండలానికే 961 క్వింటాళ్లు అందజేసింది. గతంలో మాదిరిగా విత్తనాలు తీసుకుని వ్యాపారులకు విక్రయించకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. విత్తనాలు విడిపించుకున్న రైతుతో పంట సాగు చేసేలా ఒప్పంద పత్రం రాయించుకున్నారు. సాగు మొదలెడితే ఈ-పంట నమోదు చేసి రాయితీలు అందిస్తామని చెప్పడంతో రైతులంతా ముందుకొచ్చారు. దీంతో ఈ ఏడాది జిల్లా మొత్తంగా 9వేల హెక్టార్లలో రాజ్‌మా సాగు చేపట్టారు. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు పడక స్వల్పంగా పంట దెబ్బతిన్నా దిగుబడులు బాగానే వచ్చాయి.

ప్రైవేట్‌కు దీటుగా జీసీసీ ధరలు

ఆదివాసీ గిరిజన రైతులు పండించిన రాజ్‌మా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వీటిని జీసీసీ, ప్రైవేట్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు కేజీ ఎరుపు చిక్కుళ్లు రూ.60, తెలుపు చిక్కుళ్లు రూ.80 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జీసీసీ ఎరుపు చిక్కుళ్లకు రూ. 75, తెలుపు చిక్కుళ్లు రూ. 90 చొప్పున చెల్లిస్తోంది. ప్రైవేట్‌కు దీటుగా జీసీసీ కూడా మంచి ధరలతో కొనుగోలు చేస్తుండటంతో ఈ ఏడాది రాజ్‌మాకు రాజయోగం దక్కేలా కనిపిస్తోంది.

విత్తనం తీసుకున్న రైతు పంట వేశాడో లేదో పరిశీలిస్తున్న వ్యవసాయాధికారి, సిబ్బంది

పక్కా పర్యవేక్షణతో గణనీయంగా..

గతంలో కంటే ఈ ఏడాది రాజ్‌మా సాగు విస్తీర్ణం 80శాతం పెరిగింది. 90శాతం రాయితీతో విత్తనం ఇవ్వడం, తీసుకున్న రైతు పక్కాగా సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దిగుబడులు కూడా బాగున్నాయి.

సంతల్లోనూ కొంటున్నాం

రాజ్‌మా పంట కొనుగోలుకు జీసీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. వారపు సంతల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఈ వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించాం. రాజ్‌మాకు మంచి ధర అందజేస్తున్నాం. రైతులు దళారుల బారిన పడకుండా జీసీసీకి విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జించొచ్చు.

-గసాడి మల్లేశ్వరరావు, జీసీసీ బీఎం, జీకేవీధి
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని