logo

బడి.. నిర్వహణ కొరవడి

నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు.

Updated : 28 Mar 2024 04:25 IST

రెండేళ్లుగా నిధులు ఎరగని పాఠశాలలు
సుద్దముక్కలకు సొమ్ముల్లేవు.. కుట్టు ఛార్జీలకు కాసుల్లేవు!
ఈనాడు, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి

నాడు-నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశాం అని గొప్పలు చెబుతున్న సర్కారు బడిలో సుద్దముక్కలకి కూడా సొమ్ములు ఇవ్వడం లేదు. రెండేళ్లుగా స్కూల్‌ గ్రాంట్లు విడుదల చేయనేలేదు. ప్రధానోపాధ్యాయులే పాఠశాల నిర్వహణ ఖర్చులు భరించాల్సి వస్తోంది. మరోవైపు విద్యా కానుకగా ఏకరూప దుస్తుల (యూనిఫాం) వస్త్రాన్ని ఇస్తున్నా వాటి కుట్టు ఛార్జీలు మాత్రం చెల్లించడం లేదు. రెండేళ్లుగా ఈ డబ్బులు తల్లుల ఖాతాలకు చేరడం లేదు. వారికిచ్చే అరకొర సొమ్ములను అందివ్వడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. నాడు-నేడు పేరుతో రూ.వందల కోట్లు ఖర్చుచేస్తున్నా పాఠశాలల్లో కనీస అవసరాలకు పైసలు విదల్చకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 3.23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గతంలో తరగతుల వారీగా విద్యార్థులకు కుట్టించి ఇచ్చేవారు. గత నాలుగేళ్లుగా పిల్లల తల్లిదండ్రులకు ఏకరూప దుస్తులకు అవసరమైన వస్త్రాన్ని అందజేస్తున్నారు.  ఇదివరకు రెండు జతలు ఇస్తే ఇప్పుడు ఒక్కో విద్యార్థికి మూడు జతల వస్త్రాన్ని ఇస్తున్నారు. అయితే వారిచ్చే వస్త్రం రెండు జతలకే సరిపోతోంది.

కుట్టుకూలి ఛార్జీలుగా ఒకటి నుంచి ఎనిమిది తరగతుల ఒక్కో జతకు రూ.40 చొప్పున రూ.120 ఇవ్వాలి. తొమ్మిది, పది విద్యార్థులకు రూ.80 చొప్పున మూడు జతలకు రూ.240 తల్లుల ఖాతాల్లో జమచేయాలి. వరుసగా రెండో విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోనూ కుట్టు ఛార్జీలు జమకాలేదు.

విద్యార్థులకు ఇచ్చిన వస్త్రం

రూ.8.84 కోట్లు బకాయిలు..

ఉమ్మడి జిల్లాలో 3,23,341 మందికి జగనన్న విద్యా కానుక కిట్లు అందించారు. వీరిలో 2,77,573 మంది ఒకటి నుంచి ఎనిమిది తరగతులు విద్యార్థులున్నారు. వీరికి రూ.120 చొప్పున రూ.3.33 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేయాలి. అలాగే తొమ్మిది, పది విద్యార్థులు 45,768 మంది ఉన్నారు. వీరికి రూ.240 చొప్పున రూ.1.09 కోట్లు సాయం అందాలి. మొత్తంగా రూ.4.42 కోట్ల నిధులు కుట్టు ఛార్జీలు రూపంలో ఉమ్మడి జిల్లాకు ఇవ్వాలి. గతేడాదికి సంబంధించిన నిధులు విడుదల చేసినట్లే చేసి మరలా వెనక్కి తీసుకున్నారు. ఆ సొమ్ములు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ ఏడాది ఇవ్వాల్సిన నిధులు కలిపి లెక్కిస్తే రూ.9 కోట్లకు పైగా బకాయిలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందాల్సి ఉంది. ప్రభుత్వం ఇచ్చేది తక్కువ మొత్తమే అయినా కుట్టు ఛార్జీల్లో కొంతవరకైనా ఖర్చులు కలిసి వస్తాయని లబ్ధిదారులు ఆశిస్తున్నారు.

భారం పెరిగిపోయింది..

నాడు-నేడు తర్వాత తరగతి గదుల నిర్వహణ పెరిగింది. స్మార్ట్‌ టీవీలు, ఐఎఫ్‌టీ ప్యానళ్లు, ఆర్వోప్లాంట్‌, మరుగుదొడ్లకు నీటి వసతి కోసం విద్యుత్తు ఎక్కువగా వినియోగించాల్సి వస్తోంది. గతంలో రూ.వందల్లో బిల్లులు వస్తే ఇప్పడవి రూ.వేలల్లోకి చేరిపోయాయి. వీటిని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పినా డిమాండ్‌ నోటీసులు పాఠశాలలకు పంపిస్తున్నారు. మిగతా బోధనకు అవసరమైన సామగ్రి, గ్రంథాలయం, ప్రయోగశాలలు, స్టేషనరీ, పరీక్షల ఖర్చులని నెలకు కనీసం రూ.3 వేల వరకు ప్రధానోపాధ్యాయుడి చేతి డబ్బులు పెట్టాల్సి వస్తోంది. విద్యార్థుల సంఖË్య ఆధారంగా రూ.10 వేల నుంచి రూ. లక్ష వరకు ఇవ్వాలి. గతేడాది గ్రాంట్లు ఇప్పటికీ విడుదల కాలేదు. ఎన్నికల కోడ్‌ ఉండడంతో ఇప్పట్లో గ్రాంట్లు విడుదల చేసే అవకాశం లేదని గురువులు గగ్గోలు పెడుతున్నారు.  


ఒక్క ఏడాది కూడా..: మూడేళ్లగా పిల్లలిద్దరూ ప్రభుత్వ బడిలోనే చదువుతున్నారు. యూనిఫాం ఇచ్చినప్పుడు కుట్టుకూలి ఇస్తారని చెప్పారు. ఒక్కో జతకు బయట రూ. 400లు చెల్లించాం. ఇప్పటికి మూడేళ్లు కావస్తోంది, ఒక్కసారీ కుట్టుకూలి రాలేదు. బకాయిలన్నీ కలిపి వస్తే ఎంతో కొంత మేలు జరిగేది.

బి.సూర్యకుమారి


ఎప్పుడిచ్చేది చెప్పడం లేదు..: పాఠశాలలో ముగ్గురు పిల్లలకు వస్త్రం ఇచ్చినప్పుడు జతకు రూ. 40లు చొప్పున ప్రభుత్వం చెల్లింస్తుందన్నారు. మా ముగ్గురు పిల్లలకు దుస్తుల నిమిత్తం చాలా ఖర్చయ్యింది. ఖాతాలోకి పైసా రాలేదు. ఎప్పుడిస్తారో లేదో తెలియడం లేదు.

వి.మణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని