logo

కూటమి కూర్పులో స్వల్ప మార్పు

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.

Published : 28 Mar 2024 02:25 IST

అరకులోయ అసెంబ్లీ కమలానికి..
పాడేరులో మళ్లీ సైకిల్‌ పరుగులు
ఈనాడు, పాడేరు, న్యూస్‌టుడే, అరకులోయ, పాడేరు

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలో అధికార, విపక్ష పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, పొత్తుల్లో భాగంగా కొన్ని స్థానాల్లో ముందుగా ప్రకటించిన అభ్యర్థులను ఇరుపార్టీలు మార్చుతున్నాయి. అధికార వైకాపా అరకులోయ అసెంబ్లీకి సమన్వయకర్తగా ముందు ఎంపీ గొడ్డేెటి మాధవిని ప్రకటించింది. తర్వాత హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగాన్ని నియమించింది. ఆయనకే టికెట్‌ ఇస్తామని ప్రకటించింది. తాజాగా తెదేపా కూడా అనూహ్యంగా అరకులోయ అభ్యర్థిని మార్చింది. ముందు తెదేపా నుంచి సియ్యారి దొన్నుదొరను బరిలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. తర్వాత తెదేపా, జనసేన, భాజపా కూటమి సీట్ల సర్దుబాటులో మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అరకులోయ స్థానం నుంచి భాజపా అభ్యర్థి పాంగి రాజారావును పోటీలో దించుతున్నామని ప్రకటించింది.

ఈ మేరకు భాజపా జాతీయ నాయకులు బుధవారం దిల్లీలో ప్రకటన విడుదల చేశారు. ముందు పాడేరు స్థానాన్ని భాజపాకు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు అరకులోయే కావాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఈమేరకు మార్పు చేయాల్సి వచ్చింది. ఇన్నాళ్లూ దొన్నుదొర తెదేపా శ్రేణులను ముందుకు నడిపించినా దివంగత ఎమ్మెల్యే సోమా కుమారుడు, ఎస్టీ కమిషన్‌ మాజీ సభ్యుడు సివేరి అబ్రహం అసమ్మతి స్వరం వినిస్తున్నారు. తాజాగా రాజారావును రంగంలోకి దించుతామని ప్రకటించడం, ఆయన కూడా మన్యంలో బలమైన నేత కావడంతో కూటమి మద్దతుతో విజయం సాధించగలరని విశ్వాసం ఆయన వర్గీయుల్లో వ్యక్తమవుతోంది.


ఉపాధ్యాయునిగా.. గిరిజన సంఘం నేతగా..

పాంగి రాజారావు ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేసిన సమయంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో దళిత రత్న (రాష్ట్ర స్థాయి) అవార్డు కూడా దక్కించుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఉద్యోగం వచ్చేవరకు గిరిజన విద్యార్థి సంఘం (జీఎస్‌యూ)లో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని గిరిజన సంఘాలతో కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. 1997-1998 వరకు జీఎస్‌యూ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉపాధ్యాయుడిగా ఉంటూ గిరిజన ఉద్యోగుల సంఘంలో కీలకంగా ఎదిగి ఆ సంఘానికి అధ్యక్షునిగానూ పనిచేశారు. 2008లో ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే క్రమంలో 2009లో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 13,302 ఓట్లు సాధించారు.

భాజపా నేత బయోడేటా

  • పేరు: పాంగి రాజారావు
  • విద్యార్హతలు: ఎంఏ (హిందీ)
  • వయసు: 50 సంవత్సరాలు
  • స్వస్థలం : లకేపుట్టు గ్రామం, సీతగుంట పంచాయతీ, పెదబయలు మండలం
  • కులం/ ఉపకులం: ఎస్టీ (కొండదొరŸ)
  • వృత్తి : హిందీ ఉపాధ్యాయులు (రాజకీయాల్లోకి రాకముందు)

2019లో రాజారావునుజనసేన అధ్యక్షులు అరకు ఎంపీగా పోటీ చేయాలని కోరారు. కొన్ని కారణాల వల్ల నిరాకరించి స్వతంత్ర అభ్యర్థిగా అరకులోయ అసెంబ్లీకి పోటీ చేశారు. 10,875 ఓట్లు సాధించారు. 2020లో భారతీయ జనతా పార్టీలో చేరి అతి తక్కువ సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.

అభ్యర్థి ఎవరైనా గెలిచి చూపిస్తాం..

తెలుగుదేశం పార్టీ రెండు విడతల్లో మెజారిటీ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఏజెన్సీలో పాడేరు స్థానాన్ని భాజపాకి కేటాయించినట్లు ప్రచారం జరిగింది. ఆ మేరకు అక్కడ అభ్యర్థిని కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. దీంతో భాజపానే బరిలోకి దిగుతుందని భావించారు. తెదేపా నుంచి టికెట్‌ ఆశించిన గిడ్డి ఈశ్వరి, ఆమె మద్దతుదారులు భాజపాకి కేటాయించొద్దని ర్యాలీలు చేశారు. అనూహ్యంగా భాజపానే పాడేరుకు బదులు అరకులోయనే కోరుకోవడంతో పాడేరు తెదేపా శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. నిన్న మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న పార్టీ నేతలంతా ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయారు. అభ్యర్థి ఎవరైనా సరే తెదేపా నుంచి బరిలోకి దిగి గెలిచి చూపిస్తామంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని