logo

మోదీ సభకు సర్వం సిద్ధం

ప్రధాని నరేంద్ర మోదీ విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లపాలెం సమీపంలోని సభాస్థలి ఏర్పాట్లను కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Published : 06 May 2024 01:44 IST

సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మాధవ్‌, దాడి రత్నాకర్‌ తదితరులు

కశింకోట, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లపాలెం సమీపంలోని సభాస్థలి ఏర్పాట్లను కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం సభా ప్రాంగణాన్ని బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేసింది. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. నాయకులు, కార్యకర్తలు చేరుకోవడానికి, వాహనాల పార్కింగ్‌ స్థలాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు అభ్యర్థి సీఎం రమేశ్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లను భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు పొన్నగంటి అప్పారావు, నాయకులు పర్యవేక్షించారు.

కశింకోట, న్యూస్‌టుడే: అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి సీఎం రమేశ్‌ను బలపరిచేందుకు ప్రధాని మోదీ మన ప్రాంతానికి రావడం గర్వించదగ్గ విషయమని మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌, తెదేపా నేత దాడి రత్నాకర్‌ అన్నారు. ఆదివారం సాయంత్రం సభాస్థలాన్ని వీరు పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల పార్లమెంట్‌ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు హాజరయ్యే కార్యక్రమానికి 7 నియోజకవర్గాల నుంచి జనాలు తరలివస్తారన్నారు. భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, పొన్నగంటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ మళ్లింపు

అనకాపల్లి పట్టణం, కశింకోట, న్యూస్‌టుడే: తాళ్లపాలెం వద్ద ప్రధాని బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా మళ్లిస్తున్నట్లు ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు జాతీయ రహదారిపై భారీ వాహనాలను మళ్లిస్తామన్నారు. విశాఖ నుంచి తుని వెళ్లే వాహనాలు లంకెలపాలెం కూడలి నుంచి, సబ్బవరం జాతీయ రహదారి మీదగా వచ్చే వాహనాలు అనకాపల్లి మీదగా లంకెలపాలెం కూడలి వచ్చి మరలాలని తెలిపారు. చోడవరం నుంచి తుని వెళ్లే వాహనాలు అనకాపల్లి, మునగపాక. అచ్యుతాపురం మీదగా రేగుపాలెం కూడలి నుంచి ఎలమంచిలి వైపు వెళ్లాలని ఎస్పీ సూచించారు.


ఆవగింజలతో ప్రధాని ముఖచిత్రం

మాకవరపాలెం: నేడు జిల్లాకు రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ తూటిపాల సూక్ష్మకళాకారుడు బి.రవికుమార్‌ 888 ఆవగింజలతో ప్రధాని ముఖచిత్రాన్ని రూపొందించారు. 9 గంటలపాటు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని