logo

ప్రత్యర్థులు అసూయ పడేలా అభివృద్ధి చేస్తా: సీఎం రమేశ్‌

కూటమి అభ్యర్థులను గెలిపించి ఇటు కేంద్రం, అటు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ కోరారు.

Published : 06 May 2024 01:46 IST

దేవరాపల్లిలో కూటమి నాయకులతో కలిసి సంఘీభావం తెలుపుతున్న సీఎం రమేశ్‌, బండారు తదితరులు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థులను గెలిపించి ఇటు కేంద్రం, అటు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ కోరారు. తనతోపాటు బండారు సత్యనారాయణమూర్తిని గెలిపిస్తే అనకాపల్లి జిల్లాతోపాటు మాడుగుల నియోజకవర్గంలో ప్రత్యర్థులు అసూయ పడేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మాడుగుల నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని మోడల్‌గా తీర్చిదిద్దుతానన్నారు. దేవరాపల్లిలో ఆదివారం రాత్రి బహిరంగ సభలో ప్రసంగించారు. ఉప ముఖ్యమంతి ముత్యాలనాయుడితో విబేధించి బయటకు వచ్చిన సర్పంచి సబ్బవరపు పెంటమ్మ, కిలపర్తి భాస్కరరావు, అవుగడ్డ రామ్మూర్తినాయుడు, కోటిపల్లి నాయుడు తదితరులకు బండారు సత్యనారాయణమూర్తితో కలిసి తెదేపా కండువాలు వేశారు. కె.కోటపాడుకు చెందిన డీసీసీబీ డైరెక్టర్‌ చల్లా సత్యనారాయణ తదితరులు భాజపాలో చేరగా వారికి ఆ పార్టీ కండువాలు వేశారు. సొంత కుటుంబానికే న్యాయం చేయలేని ముత్యాలనాయుడు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే రోజులు పోయాయన్నారు. ఈ ఎన్నికల్లో తండ్రి, కూతురుకి ఓటమి తప్పదన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు, మాజీ  ఎమ్యెల్యే గవిరెడ్డి రామానాయుడు, నాయకులు పైలా ప్రసాదరావు, పీవీజీ కుమార్‌, బుద్ద నాగజగదీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పెందుర్తి, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, పెందుర్తి అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు పేర్కొన్నారు. జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం 96వ వార్డు పరిధిలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ.. తెదేపా, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో రాష్ట్రంలో ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు.  

పెందుర్తిలో సీఎం రమేశ్‌, రమేశ్‌బాబును గజమాలతో సత్కరిస్తున్న నాయకులు

నిర్వాసితుల కష్టాలు పట్టించుకోని కన్నబాబు

అచ్యుతాపురం, రాంబిల్లి, న్యూస్‌టుడే: నిర్వాసితుల కష్టాలను ఎమ్మెల్యే కన్నబాబురాజు పదిహేనేళ్లగా పట్టించుకోలేదని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ మండిపడ్డారు. దిబ్బపాలెం సెజ్‌ కాలనీలో ఆదివారం భారీ బహిరంగ సభ, ర్యాలీ జరిగింది. ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, తెదేపా ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ లాలం భవానీతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెజ్‌ కోసం నిర్వాసితులు భూములు ఇస్తే ఎమ్మెల్యే కన్నబాబురాజు నిర్వాసితులను బూచిగా చూపించి కంపెనీల్లో కాంట్రాక్టులను కొట్టేశారన్నారు. ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ మాట్లాడుతూ నిర్వాసితులకు తెదేపా ప్రభుత్వ హయాంలో మేలు జరిగిందని, కట్‌ ఆఫ్‌ డేట్‌ 2004 నుంచి 2010 వరకు పెంచిన ఘనత తెదేపాదన్నారు. నిర్వాసితులకు మేలు చేయాలనే మనసు వైకాపా నాయకులకు లేదన్నారు. జనసేన మండల అధ్యక్షులు బైలపూడి రాందాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రాజాన సన్యాసినాయుడు, రాజాన విజయ్‌, భాను, నీరుకొండ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నావికాస్థావరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రమేశ్‌ హామీ ఇచ్చారు. మండలంలోని వాడనర్సాపురంలో  ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాపరిషత్తు మాజీ ఛైర్‌పర్సన్‌ లాలం భవాని, కలిదిండి రుఘురాజు, దూళి రంగనాయకులు, వర్మరాజు, కారె రాముడు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ఆస్తులకు గ్యారంటీ లేదు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, ఉద్యోగుల పొదుపు మొత్తాలకు గ్యారంటీ లేదని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. అచ్యుతాపురంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు భారీగా జనాలను తరలించాలనే అంశంపై చర్చించడానికి మూడుపార్టీల నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తపై పన్ను వేసిన సీఎం జగన్‌, ఇప్పుడు ప్రజల ఆస్తులకు కాజేయడానికి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఉద్యోగుల దాచుకున్న డబ్బులను ఇప్పటికే వాడేసుకున్నారని, డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాలపై దృష్టి పెట్టారని ఆందోళనవ్యక్తంచేశారు. ఎంపీ అభ్యర్థి సోదరుడు సీఎం రాజేశ్‌, నాయకులు రాజాన రమేష్‌కుమార్‌, కొలుకులూరి విజయ్‌బాబు, రాందాసు, దాడి ములిసినాయుడు, మేరుగు బాపునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని