logo

ఆసుపత్రిలో ఆకలి కేకలు

నక్కపల్లి ఆసుపత్రిలో నిత్యం సగటున 25 మంది రోగులు ఉండేవారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొవిడ్‌ పేరుతో దాదాపు మూడేళ్లపాటు నిలిపేసింది.

Published : 06 May 2024 01:50 IST

ప్రభుత్వం బిల్లులు చెల్లించక ఆపేసిన గుత్తేదారు
నక్కపల్లిలో నెల  రోజులుగా నిలిచిన భోజన పంపిణీ

ఇళ్ల నుంచి తెచ్చుకుని భోజనాలు చేస్తున్న రోగులు

ఈ చిత్రంలో ఉన్న దంపతులు పేర్లు దుర్గబాబు, శిరీష. గెడ్డంపాలెం గ్రామం. శిరీషకు అనారోగ్యంగా ఉండటంతో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఇక్కడ భోజనం లేకపోవడంతో రోజూ భర్తే భోజనం, అల్పాహారం తెచ్చి పెడుతున్నారు. ఇంటి నుంచి భోజనం తెచ్చుకోడానికి రోజూ ఇంటికి రెండు మూడుసార్లు తిరగాల్సి వస్తోంది.

నక్కపల్లి, న్యూస్‌టుడే: నక్కపల్లి ఆసుపత్రిలో నిత్యం సగటున 25 మంది రోగులు ఉండేవారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొవిడ్‌ పేరుతో దాదాపు మూడేళ్లపాటు నిలిపేసింది. ఏడాది క్రితం నుంచి దీన్ని తిరిగి అమలు చేశారు. జిల్లా స్థాయిలో టెండర్లు పిలిచి రోగులకు భోజనం అందించే ఏర్పాటు చేశారు. ప్రధాన గుత్తేదారు స్థానికుడు కాకపోవడంతో ఆసుపత్రికి భోజన సరఫరా బాధ్యతను ఉప గుత్తేదారుకు అప్పగించారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు చాలక మెనూ పక్కాగా అమలు చేయలేదు. అయినా అధికారులు పట్టించుకునేవారు కాదు. మరోవైపు భోజన బిల్లులు నెలల తరబడి ప్రభుత్వం చెల్లించకపోవడంతో సరఫరాదారులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. చివరకు చేసేదేమీలేక తాజాగా ఆసుపత్రికి భోజన సరఫరా నిలిపివేశారు. ఒక్క నక్కపల్లిలోని ఉప గుత్తేదారుకే రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్‌ నెల నుంచి భోజన సరఫరా లేకపోవడంతో రోగులు ఇల్లు, హోటళ్ల నుంచి రప్పించుకుని తింటున్నారు.


వైద్యాలయాల రూపురేఖలు మార్చేశామని గొప్పలు పోయిన వైకాపా సర్కార్‌ రోగులకు అందించే భోజన విషయంలో పట్టనట్లు వ్యవహరించడంతో రోగులకు భోజనాలు నిలిచిపోయాయి. నక్కపల్లి 50 పడకల సామాజిక ప్రభుత్వాసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరిన వారికి నెలరోజులుగా భోజనం అందడం లేదు.


ఇద్దరికీ ఇంటి నుంచే

అనారోగ్యం కారణంగా నేను, నా దగ్గర బంధువు ఆసుపత్రిలో రెండు రోజుల క్రితం చేరి చికిత్స పొందుతున్నాం. ఇద్దరికీ ఇంటి నుంచే భోజనం, అల్పాహారం తెస్తున్నారు. ఇక్కడే భోజనం పెట్టి ఉంటే మాలాంటి వారికి ఎంతో మేలు జరిగి ఉండేది.  

 వాసుపల్లి నాగరత్నం


నాలుగు రోజులుగా ఉన్నాం

ఆసుపత్రిలో ఉచిత భోజన సదుపాయం ఉన్నప్పటికి ప్రస్తుతం దీన్ని ఆపేసినట్లు తెలిపారు. దీంతో మేమే ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పటికి నాలుగు రోజులైంది. దగ్గరగా ఉన్నవారు సకాలంలో తెచ్చుకుంటారు, దూరంగా ఉన్నవారికి ఇబ్బంది కదా.

ఎం.అమ్మాణి, న్యాయంపూడి


ఉన్నతాధికారుల దృష్టికి

నెల రోజులుగా భోజనం ఆగిపోయింది. దీనిపై గుత్తేదారుతో మాట్లాడితే బిల్లులు రాక ఆపేసినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. భోజనం పెట్టేలా గుత్తేదారుతో మాట్లాడతామన్నారు.

శిరీష, నక్కపల్లి ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని