logo

జనం ఆస్తులకు జగనే గండం

ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు.

Updated : 06 May 2024 06:32 IST

భూ భక్షక చట్టంతో బెంబేలు
తప్పులతడకగా భూముల రీసర్వే

దేశంలో ఎక్కడా అమలులో లేని భూ యాజమాన్య హక్కుల చట్టాన్ని సీఎం జగన్‌ రాష్ట్రంలో ప్రవేశపెట్టారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేస్తున్నారు.
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వివాదాస్పద భూములను వైకాపా నేతలు చక్కబెట్టేశారు.
ప్రభుత్వ, దేవాదాయ భూములను రికార్డులు తారుమారు చేసి మరీ సొంతం చేసుకున్నారు.
అసైన్డ్‌ భూములను ఆక్రమించుకున్నారు.


  • నక్కపల్లి మండలంలో 13 గ్రామాల్లో సర్వే చేపట్టారు. చాలాచోట్ల కొలతల్లో తేడాలు వచ్చాయి. ఇంత వరకు భూముల విస్తీర్ణం తగ్గినట్లు 40 వరకు ఫిర్యాదులు వచ్చాయి. 10 నుంచి 20 సెంట్ల వరకు వ్యత్యాసం వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • మునగపాక మండలంలో చేపట్టిన రీసర్వేలో లెక్కలేనన్ని అవకతవకలు కనిపించాయి. భూముల విస్తీర్ణం తగ్గిపోవడమే కాకుండా సర్వే, ఖాతా నంబర్లు, రైతుల పేర్లు అన్ని తప్పులుగానే నమోదు చేశారు. ఆ వివరాలతో కూడిన పుస్తకాలను రైతులకు అందజేస్తే వాటిని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఇవేవీ సరిచేయకుండానే ఇప్పుడు టైటిలింగ్‌ యాక్ట్‌ను నెత్తిన తెచ్చిపెడుతున్నారు.

ఈనాడు, అనకాపల్లి న్యూస్‌టుడే, పాడేరు పట్టణం,  చింతపల్లి గ్రామీణం: ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు. మరికొందరు వాయిదాలకు తిరుగుతూ ఎప్పుడో ఒకనాడు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు.. ఇకపై అలాంటి ఆశలు వదులుకోవాల్సిందే. జగన్‌ తెచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టంతో భూవివాదాల పరిష్కారానికి సివిల్‌ కోర్టులకు బదులు ప్రభుత్వం నియమించిన అధికారులనే ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రభుత్వంతో అంటకాగుతూ జగన్‌ సైన్యానికి మించి స్వామి భక్తిని చూపిస్తున్న అధికారులు రేపు ఈ చట్టం ఉపయోగించి వైకాపా నేతలకు మేలు చేయకుండా ఉంటారని గ్యారంటీ ఉందా అని న్యాయనిపుణులే ప్రశ్నిస్తున్నారు.

చెప్పేవి గొప్పలు.. అంతా లొసుగులు

అనకాపల్లి జిల్లాలో మొత్తం 737 గ్రామాలున్నాయి. 9.18 లక్షల ఎకరాల భూములను రీసర్వే చేయాల్సి ఉంది. రెండు విడతల్లో ఇప్పటి వరకు 203 గ్రామాలో సర్వే పూర్తిచేశారు. వాటిలో చాలావరకు భూమి కొలతలు తక్కువగా నమోదయ్యాయి. సాగు విస్తీర్ణం నుంచి పాసుపుస్తకాల్లో ముద్రించే పేర్లు, ఆధార్‌, ఫోన్‌ నంబర్లు అన్నీ తప్పులతడకలుగా ఉంటున్నాయి. వందేళ్లనాటి భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న సర్కారు.. భూ యజమానుల మధ్య సరికొత్త సమస్యలను తెచ్చిపెట్టింది.


  • చోడవరం మండలంలోని గౌరీపట్నం గ్రామంలో రీసర్వే తప్పులతడకగా తయారైంది. దాదాపు 300 ఎకరాల మేర భూములు సాగులో ఒకరుంటే దస్త్రాల్లో మరో పేరు చేర్చారు. ఆ గ్రామానికి చెందిన వీఆర్‌ఏ తన భార్య, బంధువుల పేరున 11 ఎకరాలు నమోదు చేయించుకున్నారు. సెంటు భూమి లేనివారికి కూడా పదుల ఎకరాలున్నట్లు రికార్డుల్లో ఎక్కించేశారు.

గాంధీగ్రామం పంచాయతీ శివారు రమణయ్యపేటలో ఓ రైతు భార్య పేరున 40 సెంట్ల భూమి ఉంది. రీసర్వే తర్వాత 23 సెంట్లు ఉన్నట్లు డాక్యుమెంట్లు ఇచ్చారు. దీనికితోడు భూమి పత్రాలు రైతు భార్య పేరున ఉంటే రీసర్వే పత్రాలు భర్త పేరిట ఇచ్చారు. భూవిస్తీర్ణం తగ్గిందేమిటని ప్రశ్నిస్తే రీసర్వే చేసేటపుడు పొలంలో నీరుండటం వల్ల ఇలా జరిగిందని సర్వేయర్లు చెప్పుకొచ్చారు. సరిచేయమని ఇప్పుడు అధికారుల చుట్టూ సంబంధిత రైతు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు


కొత్త చట్టంతో చిక్కులే..

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను గతేడాది అక్టోబర్‌ నుంచే అమలులోకి తెచ్చారు. ఈ చట్టంతో భూ యజమానులు, కొనుగోలుదారులు తమ భూములపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. భూ వివాదాలను కోర్టులను కాదని ప్రభుత్వం నియమించే టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి (టీఆర్వో), ల్యాండ్‌ టైటిలింగ్‌ అప్పిలేట్ అధికారుల (ఎల్‌టీఓ) దగ్గరే తేల్చుకోవాలి. ఇక్కడే అధికార పార్టీ నేతలు తమ ప్రతాపాన్ని చూపించడానికి అవకాశం ఉంది. అధికారులు ఎలాగూ తాము సిఫార్సు చేసినవారే నియమితులవుతారు కాబట్టి భూ వివాదాల్లో వారికి కావాల్సినట్లే పని చేస్తారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎవరిదైనా భూమి వివాదంలో చిక్కుకుంటే దానిపై కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను 15 రోజుల్లోగా టీఆర్‌ఓ దగ్గర సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కోర్టు ఉత్తర్వులను కూడా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే క్లాజ్‌ అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. న్యాయస్థానాలు చేయాల్సిన పని జిల్లాకో ట్రైబ్యునల్‌తో చేయాలని చూడటం సాధ్యమయ్యే పనేనా.. తరతరాలుగా మీ పేరున్న భూమిని తనదంటూ ఎవరైనా ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఆ భూమి వివాదంలో పెట్టేస్తారు. రెండేళ్లలో మీరు ఆ భూ వివాదంపై స్పందించకపోతే అవతలి వ్యక్తి పేరున భూమిని రాసేయొచ్చని చట్టంలో పొందుపరచడం భూ యజమానులకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తరచూ మన భూములు మన చేతుల్లోనే ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాల్సి ఉంటుంది.


రైతుల కడుపు కొట్టినట్లే..

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు దుర్మార్గమైనది. గ్రామీణ ప్రాంతాల్లోని సన్న, చిన్నకారు రైతుల భూహక్కులు హరించుకుపోతాయి. భూమిపై పెత్తనమంతా అధికారుల చేతుల్లో ఉంటుంది. వైకాపా ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయంతో గ్రామీణ రైతుల కడుపు కొట్టినట్లే.

సుమంతుల మోహన్‌కృష్ణ, న్యాయవాది, పాడేరు


ఇది దారుణమైన చట్టం

దేశంలోనే ఇంత దారుణమైన చట్టం మరొకటి లేదు. సివిల్‌ కోర్టుల అధికారాన్ని హరించడం మొదటి తప్పు. న్యాయపరమైన అంశాల్లో నిపుణులు కానివారికి అధికారాలను కట్టబెట్టడం మరో లోపం. బలమున్న వాడిదే రాజ్యమవుతుంది. బడుగు, బలహీనవర్గాలు, నిరక్షరాస్యులు..హైకోర్టు, సుప్రీంకోర్టులను ఆశ్రయించగలిగే పరిస్థితులు ఉండవు.

గోవిందు, న్యాయవాది, చింతపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని