logo

ప్రయాణం ప్రాణ సంకటం

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల వంతెనలు శిథిలమై ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితి. కూలేందుకు సిద్ధంగా ఉన్న వాటిపై ప్రయాణించాలంటే ప్రజలకు నిత్యం ప్రాణసంకటంగా మారింది. వాటిలో ఒక వంతెన ఎనిమిదేళ్ల కిందట కూలిపోతుండటంతో పక్కనే బెయిలి బ్రిడ్జి నిర్మించారు.

Published : 17 Aug 2022 04:56 IST
ఆదమరిస్తే అంతే సంగతులు
ప్రతిపాదనలకే పరిమితమవుతున్న వంతెనల నిర్మాణం
న్యూస్‌టుడే, కూచిపూడి
ఎనిమిదేళ్ల కిందట కూలిపోయిన ఈ వంతెనపై నుంచే ప్రయాణికుల రాకపోకలు

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గల వంతెనలు శిథిలమై ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితి. కూలేందుకు సిద్ధంగా ఉన్న వాటిపై ప్రయాణించాలంటే ప్రజలకు నిత్యం ప్రాణసంకటంగా మారింది. వాటిలో ఒక వంతెన ఎనిమిదేళ్ల కిందట కూలిపోతుండటంతో పక్కనే బెయిలి బ్రిడ్జి నిర్మించారు. అది కూడా పూర్తిగా శిథిలమై కుయ్యో..మొర్రో.. అంటోంది. దీంతో పాత వంతెనపై మీదుగానే వాహనదారులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. మొవ్వ మండలం చినముత్తేవిలో గేదలకోడు డ్రెయిన్‌పై నిర్మించిన వంతెన కూడా పూర్తిగా పాడైంది. నేడో..రేపో కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..


మొవ్వ నుంచి మచిలీపట్నం వెళ్లే ప్రధాన మార్గంలోని కాజ శివారు ఐనంపూడి డ్రెయిన్‌పై ఏడు దశాబ్దాల కిందట నిర్మించిన వంతెన రెయిలింగ్‌ విరిగిపోయి శ్లాబు కూలిపోతుంది. దీంతో ఆర్‌ అండ్‌ బీ శాఖ బెయిలి బ్రిడ్జిని నిర్మించింది. దానిపై భారీ వాహనాలు రాకపోకలు చేస్తుండడంతో మూడేళ్లుగా రేకులు లేచిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. బెయిలి బ్రిడ్జికూడా ప్రమాదకరంగా మారడంతో కూలిపోతున్న పాత వంతెనపైనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. మొవ్వ, ఘంటసాల మండలాల్లోని 15 గ్రామాల ప్రజలు ఈ మార్గంలో నిత్యం మచిలీపట్నం ప్రయాణిస్తుంటారు. ఈ వంతెన కూలిపోతే కూచిపూడి, పామర్రు మీదుగా వ్యయప్రయాసలతో మచిలీపట్నం చేరుకోవాలి. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ రూ.6.5 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినా ఇంతవరకూ నిధులు మంజూరు కాలేదు. ఇదిలా ఉండగా కూచిపూడి నుంచి మచిలీపట్నం వెళ్లే ఆర్‌అండ్‌బీ దారిలో చినముత్తేవి వద్ద ఐనంపూడి డ్రెయిన్‌పై వంతెన శ్లాబు కూలిపోవడంతో ప్రస్తుతం బెయిలి వంతెన నిర్మిస్తున్నారు.

చినముత్తేవిలో గేదలకోడు డ్రెయిన్‌పై పూర్తిగా శిథిలమైన వంతెన

* చినముత్తేవిలో గేదలకోడు డ్రెయిన్‌పై వంతెన గోడలు పడిపోతున్నాయి. రెయిలింగ్‌ కూడా లేదు. ఇటీవల ఒక లారీ కూడా వంతెనపై నుంచి కాల్వలోకి పడిపోయింది. ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ వంతెనలపై మొవ్వ మండలంలోని ప్రజలే కాకుండా పమిడిముక్కల, తోట్లవల్లూరు మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు, ఇతర ప్రాంతాల ప్రయాణికులు కూచిపూడి మీదుగా చినముత్తేవి, నిడుమోలు నుంచి జిల్లా కేంద్రమైన మచిలీపట్నం రాకపోకలు సాగిస్తుంటారు.


అంచనాలు రూపొందిస్తున్నాం - హరీష్‌, ఆర్‌అండ్‌బీ జేఈ
ఈ వంతెనల నిర్మాణంపై ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం. అత్యవసర నిర్మాణాల కింద నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరతాం. ఐనంపూడి డ్రెయిన్‌పై వంతెనకు ఎన్‌డీబీ నిధులు కింద ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఇంతవరకూ నిధులు మంజూరు కాలేదు


కొత్త వంతెన నిర్మించాలి
- దగాని సంగీతరావు, సీపీఐ పామర్రు నియోజకవర్గ కార్యదర్శి, కాజ

తాత్కాలికంగా బెయిలి బ్రిడ్జి నిర్మించి చేతులు దులిపేసుకున్నారు. దానిపై టీవీఎస్‌ మోపెడ్‌తో వెళ్తూ పడిపోయి గాయపడ్డాను. ఇటీవల ఒక ఆటో కూడా రేకుల మధ్య ఇరుక్కుపోయి పెను ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహన చోదకులు ఏమాత్రం అదమరచి ప్రయాణిస్తే అనంత లోకాలకు చేరుకోవాల్సిందే. వెంటనే కొత్త వంతెన నిర్మించాలి. వర్షాకాలం కావడంతో ప్రస్తుతం మురుగు కాల్వలోకి వచ్చేస్తుంది.


ప్రమాదకరంగా మారాయి

- మహ్మద్‌ హుస్సేన్‌, ప్రయాణికుడు, మచిలీపట్నం

మచిలీపట్నం నుంచి రోజూ కూచిపూడి వచ్చి ఓ రెస్టారెంట్లో పని చేస్తున్నాను. మోటార్‌ సైకిల్‌పై ప్రయాణించాలంటే భయంగానే ఉంది. చినముత్తేవిలో ఇటీవల వంతెన శ్లాబు కూలిపోయింది. గేదెలకోడుపై వంతెన రెయిలింగ్‌ ఊడిపోయి ప్రమాదభరితంగా మారింది. ఏ వంతెన పడిపోయినా కూచిపూడి నుంచి పామర్రు, నిడుమోలు మీదుగా అధిక దూరం ప్రయాణించి మచిలీపట్నం చేరుకోవాలి. ఈ రెండు వంతెనల్ని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలు, ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని