logo

Sankalpa Siddhi: అల్లిబిల్లి పాయింట్లతో టోకరా.. సంకల్ప సిద్ధి మోసంలో కొత్త కోణం

డిపాజిటర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా కేవలం రెఫరల్‌ పాయింట్లనే చూపిస్తూ సంకల్ప సిద్ధి నిర్వాహకులు టోకరా వేశారు.

Updated : 06 Dec 2022 07:37 IST

ఈనాడు - అమరావతి: డిపాజిటర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకుండా కేవలం రెఫరల్‌ పాయింట్లనే చూపిస్తూ సంకల్ప సిద్ధి నిర్వాహకులు టోకరా వేశారు. వీటి కోసం ప్రత్యేకంగా వ్యాలెట్‌ను రూపొందించారు. అందులో ఇవి జమ అయ్యేవి. ఈ పాయింట్లను ఇతరులకు కూడా బదిలీ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ కేసులోని నిందితులు సంస్థ వెబ్‌సైట్‌లో తమ బంధువుల పేర్లు పెట్టి లాగిన్‌ ఐడీలు రూపొందించారు. వాటికి ఈ పాయింట్లను క్రెడిట్‌ చేశారు. ఎక్కువ మందిని చేర్చిన వారికి మొబైల్‌, ట్యాబ్‌లు ఇవ్వనున్నట్లు ఆశచూపారు. దీంతో చాలా మంది పోటీపడి మరీ తెలిసిన వారిని చేర్పించారు. వెబ్‌సైట్‌ను పరిశీలిస్తున్న పోలీసులు కుప్పలుతెప్పలుగా ఉన్న ఐడీలను చూసి విస్తుపోయారు..

మొత్తం 17 బ్యాంకు ఖాతాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వీటి ద్వారా అధికశాతం లావాదేవీలు జరిగినట్లు తేలింది. వీటికి సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవడమే కారణం. పాయింట్లతో బోగస్‌ సభ్యులను కుప్పలుతెప్పలుగా నిర్వాహకులు చేర్పించారు. సైట్‌ సామర్థ్యం తక్కువ కావడంతో క్రాష్‌ అయింది. అందరి వివరాలను వడపోస్తున్నారు. అసలు డిపాజిటర్ల సంఖ్య 30 నుంచి 35 వేల వరకు ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

రూ. వందల కోట్లలో వసూలు చేసిన డిపాజిట్లను ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారన్న అంశంపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు గుర్తించిన ప్రకాశం జిల్లా కనిగిరి, నిడమానూరు, తదితర చోట్ల నిర్వాహకుల పేరున స్థిరాస్తులను సీజ్‌ చేసి, అటాచ్‌ చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. మరికొన్ని చోట్ల కూడా భూములు కొనుగోలు చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వీటి వివరాల కోసం పోలీసులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి లేఖ రాయనున్నారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురిని ఆరెస్టు చేశారు. సంస్థ సీఎండీ వేణుగోపాలకృష్ణ.. పోలీసుల ఇంటరాగేషన్‌లో పెద్దగా నోరు విప్పడం లేదు. తనకేమీ తెలియదని, కిరణ్‌కు అన్ని విషయాలూ తెలుసని చెబుతున్నారు.

ఈ గొలుసుకట్టులో చేరింది ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగులే. వీరు తిరిగి తమకు తెలిసిన వారిని, బంధువులను కూడా కమీషన్‌ కోసం చేర్పించారు. గన్నవరం డిపో పరిధిలో చాలా మంది ఆర్టీసీ ఉద్యోగులు సంకల్ప సిద్ధిలోని వివిధ పథకాల్లో డిపాజిట్‌ చేయడంతో పాటు మరికొందరిని చేర్పించారు. పోలీసుల్లోనూ పలువురు బాధితులు ఉన్నారు. విద్యుత్తు సౌధలోనూ పెద్ద సంఖ్యలో సభ్యులుగా చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని