logo

భాజపాతోనే దేశాభివృద్ధి

భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి అన్నారు.

Published : 31 May 2023 05:06 IST

మాట్లాడుతున్న చంద్రమౌళి తదితరులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: భాజపాతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి అన్నారు. నగరంలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనపై అవగాహన కల్పించేందుకు పార్టీ అధినాయకత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా జూన్‌ 25వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 2014కు ముందు, ఆ తర్వాత దేశంలో అభివృద్ధి, ప్రభుత్వ పథకాలను పరిశీలిస్తే మోదీ పాలన తీరు అర్థమవుతుందన్నారు. ప్రధాని స్వచ్ఛభారత్‌ ప్రారంభించినప్పుడు కొందరు హేళన చేశారని, దేశవ్యాప్తంగా 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామన్నారు. జన్‌ధన్‌ ఖాతాలు, డిజిటల్‌ చెల్లింపులు విస్తృతంగా పెరిగాయన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్‌ ఆసుపత్రి ఏర్పాటు ద్వారా నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న అనేక పథకాల్లో కేంద్రం భాగస్వామ్యం ఉందన్నారు. పార్టీ బందరు నియోజకవర్గ కన్వీనర్‌ సోడిశెట్టి బాలాజీరావు మాట్లాడుతూ మచిలీపట్నంలోని వైద్య కళాశాల ఏర్పాటుకు కేంద్రం తన వాటా నిధులు ఎప్పుడో విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. గిలకలదిండిలో హార్బర్‌ విస్తరణ పనులకూ నిధులు కేటాయించారన్నారు. వైకాపా ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు, ‘మోదీ తొమ్మిదేళ్ల పాలన’ కార్యక్రమ జిల్లా ఇన్‌ఛార్జి కపర్తి, కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు, నాయకులు బొమ్మిడి గణేష్‌, ఎన్‌.రాము, ధూళిపాళ్ల శ్రీరామచంద్రమూర్తి, గంటా సతీష్‌, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని