logo

జన సమీకరణకు కుస్తీలురి

మూడు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గుడివాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 9న ఉదయం 9 గంటలకు సీఎం జగన్‌ నేరుగా మాల్లాయపాలెంలో నిర్మించిన టిడ్కో కాలనీకి హెలికాప్టర్‌ ద్వారా చేరుకుంటారు.

Published : 07 Jun 2023 05:23 IST

మెప్మా, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు లక్ష్యాలు
9న సీఎం గుడివాడ పర్యటన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష

హెలి ప్యాడ్‌ను పరిశీలిస్తున్న పురపాలక పరిపాలనా విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, మంత్రి ఆదిమూలపు సురేష్‌, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ తదితరులు

గుడివాడ (నెహ్రూచౌక్‌), గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: మూడు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గుడివాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 9న ఉదయం 9 గంటలకు సీఎం జగన్‌ నేరుగా మాల్లాయపాలెంలో నిర్మించిన టిడ్కో కాలనీకి హెలికాప్టర్‌ ద్వారా చేరుకుంటారు. దీనికి సంబంధించి హెలీప్యాడ్‌ కూడా టిడ్కో కాలనీలో ఏర్పాటు చేశారు. తొలుత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం టిడ్కో ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందించి వారితో కాసేపు మాటామంతి నిర్వహిస్తారు. సీఎం సభను విజయవంతం చేసేందుకు భారీగా జనసమీకరణ చేయాలని ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు మెప్మా, సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లకు లక్ష్యాలు విధించారు. ఈ మేరకు వివిధ జిల్లాల నుంచి 400 ఆర్టీసీ, 200 ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేయనున్నారు. మండలం నుంచి 10 వేల మంది, గుడివాడ పట్టణం నుంచి దాదాపుగా 30 వేల మంది కచ్ఛితంగా వచ్చేలా చూడాలని వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ఎండలు మండుతుంటే సభకు జనాలు ఎలా వస్తారని ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు.
* ముఖ్యమంత్రి పర్యటన ఖరారు కావడంతో రాష్ట్ర పురపాలక పరిపాలనా విభాగం ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, పురపాలక, గృహనిర్మాణ శాఖల మంత్రులు ఆదిమూలపు సురేష్‌, జోగి రమేష్‌, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, కలెక్టర్‌ పి.రాజబాబు, ఎస్పీ పి.జాషువా తదితర అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు. జగన్‌ పరిశీలించనున్న 430, 300 చదరపు అడుగుల ఇళ్లను తనిఖీ చేశారు. గుడివాడ కోతి బొమ్మ సెంటర్‌ నుంచి టిడ్కో కాలనీ వరకూ మార్గ మధ్యలో టెంట్లు వేసి మంచినీరు సౌకర్యం కల్పించాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

గుడివాడలో అడుగు పెట్టకుండానే..

ముఖ్యమంత్రి నేరుగా టిడ్కో కాలనీ ప్రారంభోత్సవంలో పాల్గొని అక్కడి నుంచే హెలికాప్టర్‌ ద్వారా మంగళగిరి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గుడివాడ పట్టణంలో సీఎం అడుగు పెట్టకుండా ప్లాన్‌ చేయడంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. గుడివాడలో రోడ్‌షో నిర్వహిస్తే ఎమ్మెల్యే కొడాలి నాని బండారం బయట పడుతుందని, మరో వైపు రహదారుల దుస్థితి, అధ్వానంగా తయారైన మురుగు కాల్వలు,  పడకేసిన పారిశుద్ధ్యం సీఎం కంట పడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో సీఎంను సభా వేదిక నుంచి నేరుగా పంపించే ప్రయత్నం చేస్తున్నారని తెదేపా, జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను జగన్‌ ప్రారంభోత్సవం చేయడం సిగ్గుచేటని తెదేపా నాయకులు మండిపడుతున్నారు.  

ఏర్పాట్లపై సమీక్ష

సీఎం జగన్‌ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కలెక్టరు అధ్యక్షతన మంగళవారం సమీక్షించారు. మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ దాదాపు 30 వేల మందికి ఆవాసం కల్పించే టిడ్కో ఇళ్ల పంపిణీని విజయవంతంగా నిర్వహించే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరు రాజబాబు మాట్లాడుతూ ఎండ తీవ్రంగా ఉన్నందున ఈ సభకు వృద్ధులు, పిల్లలు, గుండె జబ్బులున్నవారిని తీసుకురాకుండా చూడాలన్నారు. అన్ని గ్యాలరీల్లో మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ విరివిగా సరఫరా చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 12.30 కల్లా సమావేశం ముగిసేలా చూడాలన్నారు. ఆర్డీవో పద్మావతి, మున్సిపల్‌ కమిషనరు మురళీకృష్ణ, ఎస్పీ జాషువా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని