logo

కొన్నే ఉన్నాయ్‌... కొనుక్కో అన్నాయ్‌!

ఆటోనగర్‌కు చెందిన ఓ వృద్ధుడు చర్మ సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. వైద్యుడికి చూపించిన తర్వాత నాలుగు రకాల మందులు రాసి ఇచ్చారు.

Updated : 31 Jul 2023 05:51 IST

విజయవాడ కొత్తాసుపత్రిలో మందుల కొరత
వైద్యులు రాసిన వాటిలో అరకొరగానే లభ్యం
నిరుపేద రోగులకు తప్పని ఆర్థిక భారం
ఈనాడు - అమరావతి

  • ఆటోనగర్‌కు చెందిన ఓ వృద్ధుడు చర్మ సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. వైద్యుడికి చూపించిన తర్వాత నాలుగు రకాల మందులు రాసి ఇచ్చారు. బాధితుడు ఆస్పత్రిలోని మందుల కౌంటర్‌కు వెళ్తే.. వాటిలో సగం మాత్రమే ఇచ్చి మిగతావి బయట కొనుక్కోమని ఆసుపత్రి సిబ్బంది మందుల చీటీపై టిక్‌ పెట్టి ఇచ్చారు.
  • మంగళగిరి ప్రాంత వృద్ధురాలికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్స జరిగింది. ఆసుపత్రిలో రెండు రోజులు ఉన్న తర్వాత గత గురువారం డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లేటప్పుడు వైద్యులు అయిదు రకాల మందులు రాసిచ్చారు.ఆమె కౌంటర్‌ వద్దకు వెళ్లి మందుల చీటీ చూపించగా.. మూడింటినే ఇచ్చారు. మిగతా.. మోక్సీప్రెడ్‌, నెపాఫెనాక్‌ అనే ఐడ్రాప్స్‌ లేవనీ.. బయట కొనుక్కోమని సిబ్బంది సూచించారు. మందుల చీటీలో ఈ రెండు లేవనేలా టిక్‌ పెట్టి ఇచ్చారు.
  • ఆటోనగర్‌కు చెందిన ఓ మహిళ ఊపిరితిత్తుల సమస్యతో ఆసుపత్రికి వచ్చింది. వైద్యుడిని సంప్రదించిన తర్వాత రెండు రకాల మందులను రాశారు. వాటి కోసం మందుల కౌంటర్‌కి వెళ్లింది. కానీ.. ఆ రెండూ కౌంటర్‌లో లేవు. దీంతో ఆసుపత్రి ఆవరణలోనే ఉన్న ప్రైవేటు జనరిక్‌ మందుల దుకాణంలో వాటిని డబ్బులిచ్చి కొనుక్కుంది.

విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలోని ఓపీకి సోమవారం నుంచి శనివారం వరకు నిత్యం 2,500 మందికి పైగా వస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని ప్రాంతాలు, పక్కనే ఉన్న గుంటూరు, ఏలూరు నుంచి కూడా ఓపీకి పెద్దసంఖ్యలో వస్తుంటారు. గ్యాస్ట్రో, ఆర్థో, జనరల్‌ మెడిసిన్‌, ఈఎన్‌టీ, కంటికి సంబంధ సమస్యలతో నిత్యం ఓపీకి వచ్చే రోగులు అత్యధికంగా ఉంటున్నారు. వీరికి వైద్యులు రాసే మందుల్లో ప్రస్తుతం కొన్నే కౌంటర్లలో ఇస్తున్నారు. మిగతావి బయట కొనుక్కోమని చెబుతున్నారు. కొన్నింటినే ఇస్తున్న తీరుపై రోగులు చాలాకాలంగా ఫిర్యాదులు చేస్తున్నా సమస్యను మాత్రం పరిష్కరించడం లేదు. ప్రతి పది మంది రోగుల్లో కనీసం ముగ్గురు నలుగురికి సగం సగమే ఇస్తున్నారు.

ఓపీ కౌంటర్ల వద్ద రద్దీ

రెండు మూడేళ్లుగా ఇంతే..

కొత్తాసుపత్రిలో మందుల కొరత గత రెండుమూడేళ్లుగా వేధిస్తూనే ఉంది. అధికారులు మాత్రం అన్ని మందులూ ఉన్నాయనీ, ఎలాంటి సమస్యా లేదని చెబుతున్నారు. వైద్యులు రాసే కాంబినేషన్‌ మెడిసిన్‌లోనూ కొన్ని ఇచ్చి మిగతావి లేవని చెబుతున్నారు. మిగతావి బయట కొనుక్కోండి.. లేదంటే రెండు రోజుల తర్వాత మళ్లీ రమ్మని చెబుతున్నారని పలువురు రోగులు వాపోతున్నారు. ఎక్కువ మంది విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలతోపాటు దూరంగా ఉన్న గ్రామాల నుంచి బస్సులు, ఆటోల్లో వస్తుంటారు. వీరు మళ్లీ ఆ రెండు మూడు మందుల కోసం ఆసుపత్రికి వచ్చే పరిస్థితి ఉండదు. వైద్యులు రాసిన మందులన్నీ ఇవ్వాలి కదా.. అని కొందరు రోగులు ప్రశ్నిస్తే.. అన్నీ ఉండవు.. మీరు కొన్ని బయట కొనుక్కోవాల్సిందేనని సిబ్బంది చెబుతున్నారు. పేద రోగులకు మందులు కొనే స్థోమత ఉండదు. అన్ని మందులూ కచ్చితంగా అందుబాటులో ఉంచాలి. ఒకవేళ ఏవైనా లేకపోతే.. వెంటనే కొనైనా ఇవ్వాలి.

జనరిక్‌ దుకాణం వద్ద కిటకిట..

కొత్తాసుపత్రి ప్రాంగణంలో ఉన్న జనరిక్‌ మందుల దుకాణం ప్రతిరోజూ కిటకిటలాడుతూనే ఉంటోంది. వైద్యులు రాసిన మందులు ఆసుపత్రి ఉచిత కౌంటర్‌లో లేక రోగులు జనరిక్‌లో కొంటున్నారు. సోమవారం నుంచి శనివారం వరకూ ఓపీ వేళల్లో కౌంటర్‌లో సగం మందులు ఇస్తే.. మిగతావి జనరిక్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఒకవేళ జనరిక్‌లోనూ కొన్ని లేకపోతే.. బయట మందుల దుకాణాల్లో కొనాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు.

కంటి సమస్యలతో వస్తుంటే..

ప్రస్తుతం కంటి ఇన్‌ఫెక్షన్‌తో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు. వీరిని వైద్యులు పరీక్షించి మందులు రాస్తుంటే.. కొన్నే ఉన్నాయనీ.. మిగతావి బయట కొనుక్కోమంటూ కౌంటర్‌లో చెబుతున్నారు. విజయవాడ మహిళలు ఇద్దరు కంటి ఇన్ఫెక్షన్‌తో రెండు రోజుల కిందట రాగా.. వారికి కూడా వైద్యులు రాసిన మందుల్లో కొన్నే ఇచ్చి.. డ్రాప్స్‌ లేవని, బయట కొనుక్కోమని కౌంటర్‌లో సిబ్బంది సూచించారు. ప్రస్తుతం జ్వరాలు, నేత్ర ఇన్‌ఫెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి విషయంలో అప్రమత్తమై.. అన్ని రకాల మందులను ఆసుపత్రిలో సిద్ధంగా ఉంచాలి. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల ప్రజలకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రే ప్రధానమైన వైద్య కేంద్రం. రోజూ వేల సంఖ్యలో వచ్చే రోగులకు తగ్గట్టుగా మందులు అందుబాటులో ఉంచడంలో అధికారులు విఫలమవుతున్నారు.

రెండు రకాల మందులు లేవని టిక్‌ పెట్టారిలా..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని