logo

నాడు కళకళ.. నేడు వెలవెల

వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్‌ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్‌, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి.

Published : 19 Apr 2024 04:43 IST

బోసిపోతున్న ఆటోనగర్‌
న్యూస్‌టుడే, గుడివాడ(నెహ్రూచౌక్‌)

వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్‌ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్‌, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. మౌలిక సౌకర్యాల అభివృద్ధి, రాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం స్విస్తి పలకడంతో ఇప్పుడు ఆ కళ తగ్గి ఆటోనగర్‌ బోసి పోతోంది.  

ఉపాధి లేక వలసలు

ఒకప్పుడు పెద్ద కర్మాగారాలు నడిపిన వారు కూడా ప్రభుత్వ ఆదరణ లేక వాటిని మూసేసి మరో వ్యాపారంలోకి మారుతున్నారు. మేస్త్రీలు, వెల్డర్లు, కార్మికుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వలసపోతున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు కాలేదు. కనీస మౌలిక వసతులు లేక ఆటోనగర్‌వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాల్వలు కూడా లేకపోవడంతో రోజూ మురుగు తోడుకోవాల్సి వస్తోంది.


వ్యవసాయ పరికరాలకు రాయితీ లేదు

- ఎ.సూర్య, పరిశ్రమ నిర్వాహకుడు

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాలకు రాయితీలు ఇవ్వడం లేదు. ఇప్పటికే చాలా పరిశ్రమలు మూత పడ్డాయి. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితి. పనులు లేక వారు కూడా వలస వెళ్లిపోతున్నారు.


నిధులు మంజూరు కాలేదు

- లింగం ప్రసాదు, ఐలా పూర్వాధ్యక్షుడు

ఆటోనగర్‌ అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదు. కనీస మౌలిక వసతులు కూడా కల్పించే పరిస్థితి లేదు. ఒకప్పుడు వైభవం చూసిన తాము నేటి పరిస్థితులు చూడలేకపోతున్నాం. సొసైటీకి కేటాయించిన స్థలం నిరుపయోగంగానే మిగిలింది.


పన్నుల రూపంలో దోచుకుంటున్నారు

- అడ్సుమిల్లి  శ్రీనివాసరావు, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు

ఈ ప్రభుత్వ హయాంలో లారీలు తిప్పలేకపోతున్నాం. గ్రీన్‌ ట్యాక్సు భారీగా పెంచేశారు. వివిధ పన్నుల రూపంలో దోచుకుంటున్నారు. ఒకప్పుడు ఏటా కొత్త లారీ ఛాసిస్‌లు బుక్‌ చేసేవాళ్లం. ఇప్పుడా  పరిస్థితి లేదు. ఉన్న లారీలు అమ్మేసి ఈ రంగం నుంచి మారిపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని