logo

ఆ భోజనం మా కొద్దు

మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్‌ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

Published : 19 Apr 2024 04:51 IST

మెనూ మార్చినా ఆసక్తి చూపని విద్యార్థులు
సుద్దగా మారుతున్న అన్నం
మచిలీపట్నం కార్పొరేషన్‌, భాస్కరపురం, పెడన గ్రామీణం, బంటుమిల్లి, కృత్తివెన్ను, న్యూస్‌టుడే

ధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్‌ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మెనూలో ఎన్ని మార్పులు చేసినా మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య మాత్రం రోజు రోజుకు తగ్గిపోతోంది. భోజనం రుచిగా లేకపోవడం, నిర్దేశించిన మోతాదులో లేకపోవడం తదితర కారణాలతో విద్యార్థులు బడి భోజనం అంటేనే భయపడుతున్న విషయం ‘న్యూస్‌టుడే’ పరిశీలనలో వెల్లడైంది. మరోవైపు భోజనపథక నిర్వాహకులకు రావాల్సిన వేతనాలు, ఇతర బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడం కూడా భోజనం నిర్వహణపై ప్రభావం చూపుతోంది.

బందరు, పెడన నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు గురువారం హాజరైన విద్యార్థులు, వారిలో మధ్యాహ్న భోజనం చేసిన వారి సంఖ్యను పరిశీలిస్తే అతి తక్కువమంది మాత్రమే భోజనం చేశారు.బందరు నగరంలోని చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాలలో వివిధ తరగతులకు చెందిన 769మంది విద్యార్థులకు గానూ 577మంది హాజరు కాగా వారిలో కేవలం 194మంది మాత్రమే భోజనం చేశారు. 383మంది భోజనం చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. ఈ పాఠశాలలో గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా తగు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పెడన భట్టజ్ఞానకోటయ్య హైస్కూల్లో 625మంది వివిధ తరగతుల విద్యార్థులు హాజరైతే 425మంది మాత్రమే భోజనాలు చేశారు. బంటుమిల్లి మండలంలో రెండు , కృత్తివెన్ను మండలంలో రెండు పాఠశాలలను తనిఖీ చేయగా అక్కడ కూడా తక్కువ సంఖ్యలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు.

ఇచ్చేది నాసిరకం బియ్యం

మెనూ ప్రకారం భోజనం అందించడం, విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను తల్లిదండ్రులు కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పరిశీలించడం, యాప్‌లో నమోదు చేయడం ఇలా అధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసినా ఎందుకు  బడిభోజనం చేయడం లేదంటే ఎక్కువశాతం మంది నాసిరకం బియ్యం ఇవ్వడం వల్ల అన్నం సుద్దగా మారుతోందని చెబుతున్నారు. ఈ సమస్యపై అనేకమంది విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మౌఖికంగా చెప్పడంతోపాటు అర్జీలు కూడా అందజేశారు. పోర్టిఫైడ్‌ బియ్యాన్ని ఇస్తున్నారన్నమాటే కానీ తరచూ అన్నం సుద్ద అవుతుందని భోజన పథక కార్మికులు చెబుతున్నారు. కేవలం బియ్యం కారణంగానే అనేకమంది తల్లిదండ్రులు పిల్లలకు ఇంటినుంచి భోజనం పంపిస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాలే చెబుతున్నాయి.


అనేకసార్లు ఫిర్యాదు చేశాం  

 - విన్నకోట సత్యకీర్తిరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు

వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బాగుండడం లేదని అనేక సార్లు ఫిర్యాదు చేయడంతోపాటు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కావడం లేదు. చాలా పాఠశాలల్లో మెనూ అమలు కావడం లేదు. పలు సమస్యల కారణంగా విద్యార్థులు మధ్యాహ్నభోజన పథకానికి దూరం అవుతున్నారు.


ఇంటి నుంచే భోజనం

 - సమరం, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

మధ్యాహ్న భోజనంలో అనేక మార్పులు చేసినా ఎక్కువశాతం మంది విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. సంఘ పరంగా వివిధ పాఠశాలల్లో పరిశీలించిన సమయంలో ఈ విషయాన్ని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా తీరులో ఏమాత్రం మార్పు లేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం  అందుతుందున్న భరోసా కల్పించలేకపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బడిలో భోజనం చేయవద్దని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని