logo

ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు

బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.

Published : 19 Apr 2024 04:56 IST

వైకాపా పాలనలో పడకేసిన పరిశ్రమలు
మచిలీపట్నం(గొడుగుపేట), పెడన, న్యూస్‌టుడే

బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్‌గోల్డ్‌ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. పరిశ్రమలకు అనేక రాయితీలు ఇచ్చి ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆ తరువాత వాటి గురించి పట్టించుకోకపోవడం పట్ల పరిశ్రమల యజమానుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రోత్సాహకాలు లేక అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.పెడన పరిసర ప్రాంతాల్లోని కలంకారీ చేనేత పరిశ్రమలు కూడా చాలావరకు మూతపడ్డాయి.

మచిలీపట్నంలో ఏటా రూ.120 కోట్ల వ్యాపారం

పోతేపల్లి జ్యూయలరీపార్కులో మొత్తం 236 పరిశ్రమలు ఉన్నాయి. కొవిడ్‌ కారణంగా కోలుకోని స్థితికి వెళ్లిన పరిశ్రమలను ప్రభుత్వం కూడా ఆదుకోకపోవడంతో చాలావరకు మూతపడ్డాయి. మచిలీపట్నం కేంద్రంగా ఏటా రూ.120 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. పరిశ్రమల ద్వారా పన్నుల రూపేణా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంటుంది. అలాంటి పరిశ్రమలను ఆదుకునేందుకు పరిశ్రమ నిర్వాహకులకు వర్కింగ్‌ క్యాపిటల్‌గా రూ.2లక్షలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి ప్రభుత్వమే హామీగా ఉంటుందని కూడా మార్గదర్శకాల్లో పొందుపరిచారు. క్షేత్రస్థాయిలో మాత్రం బ్యాంకులు ఆ దిశగా అమలు చేసిన దాఖలాలు లేవు.

హస్తకళలపైనా నిర్లక్ష్యమే

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది జీఐ ట్యాగ్‌ ఉన్న కలంకారీని రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా పూర్తి నిర్లక్ష్యం చేసింది. కలంకారీపై ఆధారపడి పెడన నియోజకవర్గంలో 5వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈపరిశ్రమను గుర్తించకపోవడంతో రాయితీలు అందటంలేదు. గత తెదేపా ప్రభుత్వం హయంలో విరాజిల్లిన కలంకారీ పరిశ్రమ నేడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.


ఆదుకోలేదు

-ఆలపాటి రమేష్‌, మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు

పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామని ప్రభుత్వం చెప్పడమే తప్ప ఆ దిశగా సహకారం అందించిన దాఖలాలు లేవు. పెట్టుబడి కావాలంటే బ్యాంకులకు ఆస్తులు హామీ పెట్టాల్సి వస్తోంది. అందరికీ రుణాలు ఇస్తామని చెప్పడమే తప్ప అమలు చేసిన దాఖలాలు లేవు.  


మార్కెటింగ్‌ ప్రభుత్వమే చేయాలి

- కొండ్రు గంగాధర్‌, హస్తకళల నిపుణుడు

కలంకారీకి ప్రభుత్వం రాయితీలు అందిస్తే మరింత మంది ఈ పరిశ్రమను ఉపాధిగా ఎంచుకుంటారు. మార్కెటింగ్‌ సైతం ప్రభుత్వం తమ సంస్థల ద్వారా చేయిస్తే పరిశ్రమ వర్గాలు మరిన్ని లాభాలను పొందుతారు. ప్రస్తుతం అరకొర లాభాలతో ఉత్పత్తి చేయడం ఇబ్బందికంగా మారింది.


ఎగ్జిబిషన్లు లేవు

-బళ్ల ప్రసాద్‌, పారిశ్రామిక వేత్త

గత ప్రభుత్వ హయంలో దిల్లీలోని ఏపీ భవన్‌లో ఏడాదికి రెండుసార్లు ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసేవారు. సంక్రాంతి సంబరాలు, దసరా వేడుకల పేరిట ఈ ప్రదర్శనలు జరిగేవి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా ఇలాంటివి నిర్వహించలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ హస్తకళల మార్కెటింగ్‌ సంస్థ లేపాక్షిని కూడా నిర్వీర్యం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని