logo

నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు ప్రవర్తిస్తే చర్యలు తప్పవు

వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.

Published : 25 Apr 2024 05:38 IST

చుట్టుగుంట, న్యూస్‌టుడే : వైకాపా నాయకులు పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకొని ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ ఒత్తిడితో కొంతమంది తెదేపా అభ్యర్థులపై కేసులు పెట్టారని ఆరోపించారు. సజ్జల, మరొకరు చెప్పారని తమపై అక్రమ కేసు పెడతారా? అని ప్రశ్నించారు. ఇద్దరు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చర్యలు తప్పవన్నారు. మధ్య నియోజకవర్గంలోని నార్త్‌ ఏసీపీ డి.ఎన్‌.వి.ప్రసాద్‌, నున్న సీఐ ఎన్‌.దుర్గాప్రసాద్‌లు వైకాపాకు అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పోస్టులు వేయించారని స్వామి భక్తి చూపుతున్నారని ఆరోపించారు. ప్రచారానికి అనుమతి ఇవ్వాలని అర్జీ పెట్టినా.. నిరాకరిస్తున్నారని, అడిగితే అసంబద్ధ కారణాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. నార్త్‌ ఏసీపీ, నున్న సీఐలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు.

జగన్‌, వెలంపల్లి నాటకాలు అర్థమయ్యాయి.. రాష్ట్రంలో 30 మంది పింఛనుదారులకు చనిపోవడానికి వైకాపానే కారణమని ఉమా ఆరోపించారు. సెర్ప్‌ సీఈవో మురళీధరరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించాలని కోరారు. వచ్చే నెలలో ఇళ్ల వద్దకే పింఛన్లు అందేలా ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి, వెలంపల్లి నాటకాలు ప్రజలకు అర్థమయ్యాయన్నారు. జూన్‌ నాలుగు తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఉండరన్నారు. కేసీఆర్‌, జగన్‌లు ఇద్దరూ హైదరాబాద్‌లో కూర్చుని ఒకరినొకరు ఓదార్చు కోవాలన్నారు. జగన్‌పై రాయి దాడి ఘటనలో నన్ను ఇరికించాలని.. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం చూపారని పేర్కొన్నారు. రాయి దాడి కేసు, ఆంక్షలతో తన ప్రచారాన్ని అడ్డుకోవాలని కుట్ర చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే కూటమి విజయం తథ్యమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు