logo

ఓటింగ్‌ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్‌ బ్యాలట్లు మురిగే ప్రమాదం

గుడివాడ పట్టణంలోని వీకేఆర్‌, వీఎన్‌బీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలట్‌్ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్‌ ఒక బూత్‌లో 9:50కి మరో బూత్‌లో 10:30 గంటలకు ప్రారంభం

Published : 05 May 2024 02:56 IST

ఆందోళనలో ఉద్యోగులు ఆలస్యంగా ప్రారంభమైన ప్రక్రియ
గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే

వీకేఆర్‌, వీఎన్‌బీ కళాశాలలో కేంద్రం వద్ద ఓటర్లు

గుడివాడ పట్టణంలోని వీకేఆర్‌, వీఎన్‌బీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలట్‌్ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్‌ ఒక బూత్‌లో 9:50కి మరో బూత్‌లో 10:30 గంటలకు ప్రారంభం కావడంతో అందరూ ఒకే సారి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈక్రమంలో కంగారులో చాలా తప్పులు దొర్లాయని.. దీనివలన కొందరి ఓట్లు మురిగి పోయే ప్రమాదం ఉందని పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయలు భావిస్తున్నారు.

  • పోస్టల్‌ బ్యాలట్‌్ ఎంపీ అభ్యర్థిది ఒక సారి, ఎమ్మెల్యే అభ్యర్థిది ఒక సారి పోలింగ్‌ అధికారి ఇవ్వాల్సి ఉండగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో రెండూ ఒకే సారి ఇవ్వడంతో అసలు సమస్య మొదలైంది. ఉపాధ్యాయులంతా ఒకే సారి బల్లలపై కూర్చొని ఓటు పత్రాల రాత కోతలు చేయాల్సి వచ్చింది.
  • పైగా 56 నుంచి 65 వరకు వరుస సంఖ్య ఓట్లు గల బూత్‌లో ఉదయం 9:50కు పోలింగ్‌ ప్రారంభించారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక్కడ పోలింగ్‌ సిబ్బందికి సరైన అవగాహన లేక చాలా మంది ఓటర్లు గందరగోళానికి గురయ్యారు.
  • బీ109 పోలింగ్‌ బూత్‌లో ఓటింగ్‌ 10:30 గంటలకు ప్రారంభమైనట్లు ఉద్యోగులు తెలిపారు. ఆలస్యంగా ఓటింగ్‌ ప్రారంభించడం వలన ఎంపీ ఓటు కవర్లో ఎమ్మెల్యే ఓటు పత్రం, ఎమ్మెల్యే ఓటు కవర్‌లో ఎంపీ ఓటు పత్రం పెట్టినట్లు చెబుతున్నారు.
  • ధ్రువీకరణ పత్రాలను పోలింగ్‌ అధికారి సంతకం చేసి ముందు ఇవ్వాలి. కానీ తర్వాత ఇచ్చారని పలువురు తెలిపారు.
  • పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేసిన బ్యాలట్‌్ పేపరు పెట్టి సీల్‌ చేయడానికి కనీసం జిగురు కూడా లేదని.. చివరికి పెన్నులు కూడా అందుబాటులో లేక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

గెజిటెడ్‌ అధికారుల స్టాంపులు వేయలేదు

పోస్టల్‌ బ్యాలట్‌్ వేసే వారిని ధ్రువీకరించడానికి ఒక గెజిటెడ్‌ అధికారి అవసరం ఉన్నందున ప్రతీ బూత్‌లకు అందుబాటులో ఒక గెజిటెడ్‌ అధికారిని ఆర్‌వో నియమించారు. కానీ 116 బూత్‌లో ఓటర్లకు కొందరికి సంతకం చేసి స్టాంపులు వేయలేదని.. ఓటు వేసి వచ్చిన తర్వాత గుర్తించిన ఓటర్లు తమ ఓటు మురుగి పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

ఫెసిలిటేషన్‌ అంటే ఇదేనా..?

ఉద్యోగులు ఎక్కడ ఉద్యోగం చేసినా వారికి ఓటు ఉన్న ప్రాంతంలో నియోజకవర్గ కేంద్రంలోకి వెళ్లి ఓటు వేయాలి. కానీ జిల్లాల పునర్విభజనలో ఉద్యోగం ఒక జిల్లాలో.. ఓటు మరో జిల్లాలో ఉండటం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోస్టల్‌ బ్యాలట్‌్ వేయడానికి చాలా ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. మండుటెండలో 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాలంటే కష్టంగా మారింది. దీని వల్ల వారు ఓటు వినియోగించుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఉద్యోగులు నివాసం ఉన్న మండల కేంద్రాల్లో ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఈ జిల్లాలో పని చేసి వేరే జిల్లాలో నివాసం ఉండే వారికి మరికొన్ని రోజులు ఓటు వేసే అవకాశం కల్పించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని