logo

పట్టా లేదు... వంశీ.. పత్తా లేరు..

గన్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి.

Updated : 06 May 2024 05:05 IST

స్థలాలు అందుబాటులో ఉన్నా ఫలితం శూన్యం
11 వేల మందికి మొండిచెయ్యి
హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే

గతంలో ఏం చేప్పారు?నియోజకవర్గంలో వేల సంఖ్యలో పేదలు ఇళ్ల స్థలాలకు ఎదురు చూస్తున్నారు. అందరికీ మంజూరు చేయాలనే వైకాపాకు మద్దతు తెలిపా. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ న్యాయం చేస్తా. ఇంటి స్థలం రాలేదని ఎవరూ బాధపడకూడదు.

ఏం చేశారు?

ఇంటి స్థలాలకు వేలాది మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే నాటికి కూడా చాలా గ్రామాల్లో భూసేకరణ జరపకపోవడం, కొన్నిచోట్ల చేసినా రైతులకు ధర చెల్లించకపోవడం, ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నా కూడా పట్టాలు తయారు చేయించడంలో జాప్యంతో దాదాపు 11 వేల మంది అర్హులకు నిరాశే మిగిల్చారు.

న్నవరం నియోజకవర్గంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అర్హులకు అందని ద్రాక్షగానే మారాయి. రాజకీయ అండదండలు ఉన్నవారికే అధిక శాతం పట్టాలు దక్కాయి. అర్హతే ప్రామాణికంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని వైకాపా ప్రభుత్వం చెప్పినా, ఆచరణలో నాయకులు, అధికారుల తీరు ఇందుకు విరుద్ధంగా ఉంది. ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టి మూడేళ్లు దాటినా నేటికీ వేలమందికి స్థలం సమకూరలేదు. కొన్నిచోట్ల చేతికి పట్టాలు ఇచ్చి ‘మమ’ అన్పించారు తప్పితే, స్థలం ఎక్కడో చూపలేదు. మరికొన్ని చోట్ల ఇంకా ప్రతిపాదనలకే పరిమితం చేయడంతో వేల సంఖ్యలో లబ్ధిదారులకు సెంటున్నర జాగా కోసం ఎదురుచూపులే మిగిలాయి.


గ్రామంలో ఒక్కరికీ ఇవ్వలేదు

- సాంబశివరావు, మల్లవల్లి

మా గ్రామంలో ఒక్కరంటే ఒక్కరికీ సెంటున్నర స్థలం దక్కలేదు. 40 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండి, లేఔట్‌ రూపొందించి, అర్హుల జాబితా తయారు చేసిన అధికారులు, ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చే వరకు అదిగో పట్టా, ఇదిగో స్థలమంటూ కాలయాపన చేశారు. తీరా కోడ్‌కు ముందే పట్టాలు సిద్ధమయ్యాయని నమ్మబలికి, పంపిణీ చేయకపోవడం దారుణం.


స్థలాలిచ్చినా లేఔట్‌ వేయలేదు

- రంగారావు, పెరికీడు

మా ఊళ్లో 168 మందికి చెరువు భూమిలో స్థలాలిచ్చారు. రెండున్నరేళ్ల కిందటే అందరికి ఆర్భాటంగా పట్టాలిచ్చిన అధికారులు, ఇంతవరకు ప్లాట్లు విభజించి స్థలాలు కేటాయించలేదు. కనీసం లేఔట్‌ను మెరక చేసి రహదారులు కూడా విభజించలేదు. ఎన్నికల కోడ్‌కు ముందు పట్టాల్చిన వారి స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియ నుంచి మా గ్రామాన్ని మినహాయించారు. దీన్నిబట్టి కంటితుడుపు పట్టాలేనన్న సంగతి అర్థమైంది.


భూసేకరణలో తీవ్ర జాప్యం

- కృష్ణారావు, రంగన్నగూడెం

మా గ్రామ పంచాయతీలో 114 మందికి పట్టాలివ్వడానికి అర్హుల జాబితా తయారు చేశారు. ఆర్‌.ఎస్‌.నంబరు 56లోని ప్రభుత్వ పోరంబోకు భూమిలో నాలుగెకరాలు ఎంపిక చేశారు. ఇది చెరువు భూమని కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో పట్టాల ప్రక్రియ ఆగిపోయింది. అప్పట్నుంచి ప్రత్యామ్నాయ భూసేకరణ జరపకుండా కాలయాపన చేస్తూ వచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని