logo

ఓటుకు రేటు..!

ఉమ్మడి జిల్లాలో అది కీలక నియోజకవర్గం. అక్కడ అభివృద్ధి లేక.. స్థానిక ప్రజాప్రతినిధి బూతులు వినలేక.. సకల సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న జనం ఈసారి స్పష్టమైన మార్పు కోరుతున్నారు.

Updated : 07 May 2024 06:12 IST

వారం ముందు నుంచే పంపిణీ
కడప నుంచి దిగిన బృందాలు
ప్రలోభపర్వానికి ఓ పక్షం సన్నాహాలు
జనాగ్రహాన్ని నోట్లతో కొనేందుకు యత్నం
ఈనాడు, అమరావతి

జనం నమ్మే పరిస్థితి లేదు...
ఐదేళ్లుగా ఎక్కడా అభివృద్ధి జాడే లేదు..
ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్న సంస్కారమూ లేదు!
తిమ్మినిబమ్మిని చేసి.. ఎలాగైనా ఓటర్లను కొనేయాలనుకుంటోంది ఓ ప్రధాన రాజకీయ పక్షం. ఇందుకోసం టక్కుటమార మాయోపాయాలను పన్నుతోంది. ప్రజాస్వామ్య ప్రక్రియనే అపహాస్యం చేస్తోంది.

మ్మడి జిల్లాలో అది కీలక నియోజకవర్గం. అక్కడ అభివృద్ధి లేక.. స్థానిక ప్రజాప్రతినిధి బూతులు వినలేక.. సకల సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న జనం ఈసారి స్పష్టమైన మార్పు కోరుతున్నారు. ఇది పసిగట్టిన ప్రధాన రాజకీయపక్షం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే ఉద్దేశంతో అడ్డదారులను ఎంచుకుంటోంది. ఓటు విలువను రూ. 5 వేలుగా నిర్ణయించింది. తమ ప్రభుత్వ హయాంలో భారీ ప్రాజెక్టులతో లబ్ధి పొందిన.. ఓ బడా కాంట్రాక్టరుపై కొంత భారం మోపింది. అంతే.. ఎక్కడికక్కడ గ్రామాల్లోకి మనుషులను దింపేసి పంపకాలకు సిద్ధం చేశారు. కనీసం లక్షమందికిపైగా ఓటర్లను కొనాలనేది నిర్ణయం. ఎందుకంటే ఆ పార్టీ అధినాయకుడికి ఇది ఎంతో కీలకమైన నియోజకవర్గం కాబట్టి.

కడప ప్రాంతం నుంచి వచ్చిన 70 మంది యువకులు.. మైలవరంలో సంచరిస్తున్నారు. వీరికి మైలవరం బైపాస్‌లో మూతపడ్డ ఓ సూపర్‌మార్కెట్‌లో బస కల్పించారు. వీరు పదిరోజులుగా సర్వే చేసి ఓటరు జాబితా సహకారంతో స్వపక్ష, విపక్ష సానుభూతిపరులను గుర్తించారు. తటస్థుల పేర్లతో మరో జాబితా సిద్ధం చేశారు. తటస్థులకు, తమ పార్టీ సానుభూతిపరులకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేస్తున్నారు. దీనిపై అవతలిపక్షంవారు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పుడేమీ చర్యలు తీసుకోలేమని వారు చేతులెత్తేశారు. ప్రచారపర్వం ముగిశాక బయటప్రాంత వ్యక్తులను పంపిస్తామని సెలవిచ్చారు.

  • గుడివాడ, గన్నవరంలో ఓటుకు రూ. 5 వేలు ఇస్తామని సదరు రాజకీయపక్ష శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
  • గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని వరుసగా నాలుగుసార్లు గెలిచారు. అయిదోసారి పోటీలో ఉన్నారు. ఇదే చివరిసారి పోటీ అని సానుభూతికోసం ప్రయత్నిస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ పోల్‌ మేనేజ్‌మెంట్‌తో బయటపడ్డామని, ఈసారి కూడా అదే పంథా ఎన్నుకున్నారు.

  • 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి తెదేపా తరఫున గెలిచిన వంశీ తర్వాత వైకాపాకు జైకొట్టారు. తర్వాత పరిణామాలతో జనంలో చులకనయ్యారు.
  • ఈ నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఓటరుకు రూ. 10 వేలైనా ఇవ్వాలని భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రచారం పేరుతో ఆయన అనుచరులు కవర్లు పంచుతుండగా అనేకసార్లు వెలుగులోకొచ్చింది.
  • పెనమలూరుకు కొత్తగా వచ్చిన ఓ అభ్యర్థి.. ఎన్నికల కోడ్‌ రాకమునుపే పంపకాలను ప్రారంభించేశారు. ఇసుక తవ్వకాలతో భారీగా డబ్బు పోగేసిన నాయకులుసైతం.. ఎన్నికల్లో పంపకాలకు తెర తీశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లకు సైతం వెల కట్టారు. తాజాగా ఓటుకు రూ. 5 వేలైనా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
  • విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గానికి వలస వచ్చిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎసరు పెట్టారు. దీంతో ఓ సామాజికవర్గం వ్యతిరేకంగా మారిపోయింది.
  • ఈ నియోజకవర్గంలో పోల్‌ మేనేజ్‌మెంట్‌ పేరుతో ఓ అభ్యర్థి పంపకాలకు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కుక్కర్లు, ఇతర సామగ్రిని ఓటర్లకు పంచిన ఆయన ఎన్నికల సంఘం దృష్టిలో పడ్డారు.
  • ఎలాగైనా తన వారసుడికి పట్టం కట్టాలని భావిస్తున్న మరో మాజీ మంత్రి అరాచకాలతోపాటు డబ్బు పంపిణీని నమ్ముకున్నారు. తామెంత చెబితే అంత అన్నట్టుగా అక్కడ తండ్రీకొడుకులు వ్యవహరిస్తున్నారు. 
  • మిగిలిన నియోజకవర్గాల్లో సైతం నగదు పంపిణీకి సదరు రాజకీయపార్టీ ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక కీలక ప్రజాప్రతినిధుల అనుచరులు, బంధువులకు పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొంతమందికి నగదుగాను, మరికొందరికి ఫోన్‌పే ద్వారా చెల్లింపులు జరిగిపోతున్నాయి. నందిగామలో గుంపగుత్తగా ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. ఎన్నికల అధికారులేమో ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు.
  • విజయవాడ సెంట్రల్‌లో మసీదులో డబ్బు పంపిణీ చేసినా ఎన్నికల సంఘం అధికారులు కేసు నమోదు చేసి వదిలేశారు.

న్టీఆర్‌ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ప్రధాన రాజకీయపక్షానికి అభ్యర్థే లేకుండాపోయారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వేరే పార్టీలో చేరడంతో సదరు అధినాయకత్వం అహం దెబ్బతింది. ఎలాగైనా సిట్టింగ్‌ను ఓడించాలన్న కసితో ఓ ‘బలహీన’వర్గానికి చెందిన అభ్యర్థిని పోటీకి దింపి, ఈయన్ను గెలిపించే బాధ్యతను కొంతమంది రాష్ట్ర నేతలకు అప్పగించింది.. ప్రస్తుతం ఓటుకు రూ. 2 వేలివ్వాలన్నది నిర్ణయం. ప్రత్యర్థి ఏమైనా ఇస్తే దానికంటే మరో రూ. 500 ఎక్కువ ఇవ్వాలన్నది పైనుంచి ఆదేశాలు. ఇందుకోసం కడప నుంచి ప్రత్యేక బృందాలు దిగిపోయాయి. అయిదేళ్ల కాలంలో అనేక వైఫల్యాలకు ఆ రాజకీయ పక్షమే ప్రధాన కారణం. గుంతల రోడ్లు.. నిరుద్యోగ విజృంభణ.. పడకేసిన అన్ని రంగాలతో రాష్ట్రం పదేళ్లకు వెనక్కిపోయింది. సాగునీటి ప్రాజెక్టుల జాడే లేదు. అరాచక శక్తుల ఆగడాలు మితిమీరిపోయాయి. బాధ్యతలు మరచిన ప్రజాప్రతినిధులు బూతుల్నే నమ్ముకున్నారు. ఫలితంగా అన్ని వర్గాలవారిలోనూ తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇది గుర్తించిన సదరు రాజకీయపక్షం ఆఖరి అస్త్రంగా డబ్బు వెదజల్లాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉద్యోగవర్గాల ఓట్ల కొనుగోలు కోసం ఒక్కొక్కరిపైనా రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు ఇచ్చేందుకు ప్రయత్నించింది..


డబ్బు.. డబ్బు..

పోలింగ్‌కు వారం ముందుగానే ఓటర్లకు డబ్బు పంచేయాలని సదరు రాజకీయపక్షం సన్నాహాలు చేసింది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల బాధ్యతలను ఆ పార్టీ రాష్ట్ర నేతలు, బడా గుత్తేదార్లకు అప్పగించినట్టు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని