చెత్త తరలింపు వాహనాల అడ్డగింత
ఎక్సెల్ ఫ్యాక్టరీ పర్యవేక్షక సిబ్బంది, వాహన సిబ్బందిని చుట్టుముట్టిన ప్రజలు, సీపీఎం నాయకులు
అజిత్‌సింగ్‌నగర్, న్యూస్‌టుడే : స్థానిక ఎక్సెల్ ఫ్యాక్టరీ ఆవరణలోకి రాకపోకలు సాగిస్తున్న చెత్త డంపింగ్, తరలింపు వాహనాలను బుధవారం ప్రజలు అడ్డుకున్నారు. చెత్త నిల్వతో తామంతా ఇబ్బందులు పడుతున్నామని, దుర్వాసనతో అల్లాడుతున్నామని తమ సమస్యలను తెలిపేందుకు పలువురు మహిళలు ఎక్సెల్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. వాహనాల రాకపోకలతో తమ ఇళ్లన్నీ దుమ్ముతో నిండిపోతున్నాయని, బంధువులు రావడానికి భయపడుతున్నారని చెప్పగా.. సిబ్బంది సరైన రీతిలో సమాధానమివ్వలేదు. దీంతో ప్రజలు వాహనాలను అడ్డుకున్నారు. వీరికి సీపీఎం నాయకులు బి.రమణారావు, ప్రవీణ్ తదితరులు మద్దతుగా నిలిచారు. ప్రజలు తమ ఆవేదన చెప్పేందుకు వస్తే సిబ్బంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని రమణారావు అన్నారు. ఇక్కడ చెత్త డంపింగ్ చేయవద్దని ప్రతిపక్షంలో ఉన్నపుడు ఆందోళన చేసిన నాయకులే ఇప్పుడు ఎమ్మెల్యేగా, డిప్యూటీ మేయర్‌గా ఉన్నారని, ఇప్పుడు వారికి ప్రజా సమస్య ఎందుకు కనిపించడం లేదో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను జనావాసాల మధ్య నుంచి తరలిస్తామని తెదేపా, వైకాపా ప్రభుత్వాలు చెప్పాయని.. ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా చెత్త డంపింగ్ ఆపాలని, నిల్వలను తరలించాలని డిమాండ్ చేశారు. ఎక్సెల్ ప్యాక్టరీ ప్రధాన గేటుకు అడ్డుగా రాళ్లు, భారీ దుంగలు ఉంచి వాహనాల రాకపోకలను నిలువరించారు. వేరే మార్గం ద్వారా వాహనాలను నడపాలని కోరారు. దీనికి సిబ్బంది అంగీకరించడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు జి.సుజాత, నిజాముద్దీన్, విజయలక్ష్మి, దేవికుమారి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.