logo

బదిలీలు మాయేనా?

ఆసుపత్రుల్లో ఏళ్ల తరబడి వైద్యులు పాతుకుపోయారు.. ప్రైవేటు ప్రాక్టీసుపై మక్కువ పెంచుకుని కొందరు ప్రభుత్వ సేవలపై నిర్లక్ష్యం చూపుతున్నారు.. రోగులకు సకాలంలో

Published : 13 Aug 2022 04:41 IST

వైద్యులు అలా వెళ్లి.. ఇలా వస్తున్నారు

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: ఆసుపత్రుల్లో ఏళ్ల తరబడి వైద్యులు పాతుకుపోయారు.. ప్రైవేటు ప్రాక్టీసుపై మక్కువ పెంచుకుని కొందరు ప్రభుత్వ సేవలపై నిర్లక్ష్యం చూపుతున్నారు.. రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించడం లేదన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. బోధనాసుపత్రుల వైద్యులను ఇతర జిల్లాలకు బదిలీ చేసింది. సాధారణ బదిలీల్లో భాగంగా అనంతపురం జిల్లా నుంచి 109 మందిని కర్నూలు, కడప, తిరుపతి బోధనాసుపత్రులకు కేటాయించారు. అలా వెళ్లిన వారు.. ప్రస్తుతం ఒక్కొక్కరు సిఫారసు లేఖలతో తిరిగి సొంత జిల్లాకు చేరుకుంటున్నారు.

పదోన్నతుల పేరుతో..
బదిలీల అనంతరం పదోన్నతుల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పదోన్నతుల్లో భాగంగా జిల్లాకు 10 మంది వైద్యులు తిరిగి వచ్చారు. అనస్తీషియాలో ఇద్దరు, సైక్రియాట్రీలో ఒకరు, జనరల్‌ సర్జరీలో ఒకరు, పథాలజీలో ఒకరు, గైనిక్‌లో ఇద్దరు, ఇతర విభాగాల్లో ముగ్గురు వచ్చేశారు. సొంత జిల్లాలో ప్రైవేటు ప్రాక్టీసు కొనసాగించవచ్చన్న ఉద్దేశంతో పలువురు పైరవీలు చేస్తున్నారు.

రాష్ట్ర సచివాలయం చుట్టూ ప్రదక్షిణ
జిల్లా సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వైద్యురాలు కర్నూలుకు బదిలీపై వెళ్లారు. ఆమె ఓ ఎమ్మెల్యేకు సమీప బంధువు. రాజకీయ అండతో తిరిగి అనంతకు బదిలీపై వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వైద్యురాలిని బదిలీ చేయడంతో ఇతరులు కూడా సిఫారసు లేఖలతో రాష్ట్ర సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. సర్వజనాసుపత్రికి రావడానికి మరో 19 మంది వైద్యులు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలు తీసుకున్నట్లు సమాచారం. మ్యూచు వల్‌ బదిలీల కోసం కొందరు ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈక్రమంలో భారీగా నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఒక్కో వైద్యుడు బదిలీ కోసం రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా మరి కొందరు వైద్యులు జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి బదిలీపై వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని