logo

కదిరి ఆసుపత్రిలో ఆగిన శస్త్రచికిత్సలు

పది మండలాల ప్రజలకు వైద్యసేవలందిస్తున్న కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పది రోజులపాటు శస్త్రచికిత్సలు నిలిచిపోనున్నాయి.

Updated : 04 Feb 2023 04:19 IST

అవస్థలు పడనున్న రోగులు

ఆపరేషన్‌ థియేటర్‌

కదిరి పట్టణం, న్యూస్‌టుడే : పది మండలాల ప్రజలకు వైద్యసేవలందిస్తున్న కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో పది రోజులపాటు శస్త్రచికిత్సలు నిలిచిపోనున్నాయి. వంద పడకల కదిరి ప్రాంతీయ వైద్యశాలలో అత్యవసర సేవలు, ఓపీ ద్వారా రోజూ సుమారు 600 మందికి చికిత్సలు అందుతున్నాయి. రూ.18 కోట్లతో కొత్త భవన నిర్మాణం కోసం 2020 అక్టోబరులో పాత భవనాలను కూల్చివేశారు. ఫలితంగా ఓపీ, చిన్నపిల్లల విభాగాలను సిబ్బంది నివాసాలు, ప్రసూతి విభాగంలోకి మార్చేశారు. 2022 నాటికి పూర్తి కావాల్సి కొత్తభవన నిర్మాణం పరిస్థితి మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. దీంతో అసౌకర్యాల మధ్యనే ఓపీ సేవలు అందిస్తున్నారు. తాజాగా కొన్నిరోజుల పాటు శస్త్రచికిత్సలే నిలిపివేశారు.


ప్రైవేటుకు పరుగులు పెట్టాల్సిందే....

కదిరి ప్రాంతీయ వైద్యశాలలోని ఆపరేషన్‌ థియేటర్ల గదుల మరమ్మతు కోసం శుక్రవారం నుంచి శస్త్రచికిత్స నిలిపివేశారు. ఇక్కడ సిజేరియన్‌, ట్యూబెక్టమీ, సాధారణ, ఆర్థోపెడిక్‌, నేత్ర సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. కదిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలు, కదిరి పట్టణంతోపాటు పుట్టపర్తి నియోజకవర్గంలోని నల్లమాడ, ఓబుళదేవరచెరువు, అమడగూరు, ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలాల ప్రజలు వైద్యసేవల కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం కదిరి ఆసుపత్రిలో రోజూ ఒకటిరెండు సిజేరియన్‌, ఆరేడు ట్యూబెక్టమీ, ఆర్థోఫెడిక్‌, సాధారణ శస్త్రచికిత్సలు రెండుచొప్పున జరుగుతున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు పది రోజులపాటు శస్త్రచికిత్సలు నిలిపి వేస్తున్నట్లు తెలిసింది. దీంతో శస్త్రచికిత్సల కోసం ప్రైవేటు వైద్యశాలకు పరుగు పెట్టాల్సిన పరిస్థితి ప్రజలకు ఏర్పడనుంది. శస్త్రచికిత్సలు ఆపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని రోగులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి శస్త్రచికిత్సలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.


మరమ్మతుల హడావుడి

ప్రసూతి వార్డులో పురిటి నొప్పులతో వచ్చిన వారికి అందుతున్న వైద్యసేవలను పరిశీలించేందుకు ఈ నెల 6, 7 తేదీల్లో దిల్లీ నుంచి ప్రత్యేక బృందం వచ్చే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్‌ థియేటర్ల మరమ్మతు చేపట్టారు. ముందుస్తు ప్రకటన ఇవ్వకుండానే ఉన్నఫలంగా శుక్రవారం నుంచి మరమ్మతు చేపట్టి ఆపరేషన్‌లు నిలిపివేశారు.


రోగుల శ్రేయస్సు దృష్ట్యా నిలిపివేశాం..

ఆపరేషన్‌ థియేటర్‌ గదుల్లో పైకప్పు పెచ్చులూడినందున వాటి మరమ్మతులు చేపట్టాం. పనులు చేస్తున్న సమయంలో ఆపరేషన్లు చేయడం రోగులకు మంచిదికాదు. దుమ్ము, ధూళి ఇతర వ్యర్థాల కారణంగా రోగికి ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుంది. వీటి దృష్ట్యా సమస్యను ఉన్నతాధికారులకు వివరించి కనీసం ఐదు రోజులపాటు శస్త్రచికిత్సలు నిలిపేశాం.

డాక్టర్‌ హుసేన్‌, సూపరింటెండెంట్‌, కదిరి ప్రాంతీయ వైద్యశాల

పెచ్చులూడిన ఆపరేషన్‌ థియేటర్‌ గది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని