logo

మరో చెత్త నిర్ణయం!

చెత్త పన్ను వసూలుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకొనేలా లేరు. ఇప్పటికే ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరించగా తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. పన్ను వసూలు కోసం పలు రూపాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతూ వచ్చినా ససేమిరా అంటున్నారు.

Updated : 11 Mar 2023 05:28 IST

ఇంటి పన్నుతో అనుసంధానం

ప్రజలపై ఆర్థిక భారం

క్లాప్‌ ఆటోలోకి చెత్త వేస్తున్న ప్రజలు

అనంత నగరపాలక, న్యూస్‌టుడే:  చెత్త పన్ను వసూలుకు ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకొనేలా లేరు. ఇప్పటికే ప్రభుత్వం అనేక మార్గాలను అనుసరించగా తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తెరమీదకు తీసుకొచ్చింది. పన్ను వసూలు కోసం పలు రూపాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతూ వచ్చినా ససేమిరా అంటున్నారు. చెత్తకు పన్ను వసూలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సచివాలయం, మహిళా సంఘాలకు లక్ష్యాలను నిర్ధేశించినా ఆశించిన మేరకు వసూలు కావడం లేదు. ఉమ్మడి అనంత జిల్లాలో ఇంటి పన్నుకు చెత్త పన్నును అనుసంధానం చేసి పిండుకొనేందుకు సరికొత్త ఉపాయం చేస్తున్నారు. కేవలం అనుసంధానం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ ఎప్పుడూ లేని చెత్త పన్నుతో ఎందుకు అనుసంధానం చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికిప్పుడు కాకున్నా రాబోయే రోజుల్లో ఇంటి పన్నుతో సహా ప్రతి ఆర్నెల్లకోసారి చెత్త పన్ను కలిపేసేందుకు ప్రక్రియ చేపడుతున్నట్లు అవగతమవుతోంది.

మ్యాపింగ్‌కు చిక్కులే..

క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) ప్రక్రియ గత సంవత్సరం జూన్‌ నుంచి ప్రారంభించారు. ఇప్పటికే సంవత్సరం దాటినా ఇళ్ల నుంచి ప్రతి నెలా చెత్త పన్ను లక్ష్యం మేరకు వసూలు కావడం లేదు. క్లాప్‌ పథకం అమలు కింద ఒక్కో ఆటోకు ప్రతినెలా ప్రభుత్వం కొంత సొమ్ము ఏజెన్సీకి చెల్లించాలి. కానీ, చెత్త పన్నులు సక్రమంగా వసూలు కాకపోవడంతో ఒక్క అనంతపురం నగరపాలక పరిధిలోనే రూ.39 లక్షలు సాధారణ నిధుల నుంచి ఏజెన్సీకి చెల్లించారు. ఇదే పరిస్థితి రెండు జిల్లాలోనూ ఉంది. నగరపాలక సంస్థలో కొంత ఆర్థిక వనరులు ఉండటంతో భారమైనా నిధులను సర్దుబాటు చేసి ఆటోలు తిరగడానికి ప్రయత్నిస్తున్నారు. చిన్న చిన్న పట్టణ, పురపాలికల్లో ప్రతినెలా చెత్త పన్నులు ఆయా మున్సిపాలిటీల నుంచి చెల్లించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ఇంటి పన్నుతో మ్యాపింగ్‌ చేపట్టారు. సాధారణంగా ఇంటి యజమాని పేరుతో పన్నులు వసూలు చేస్తారు. కొందరు బహుళ అంతస్థులు, నివాసాలు తదితర ప్రాంతాల్లో అద్దెకు ఉంటారు. అద్దెకు ఉన్నవారు చెత్తను వేస్తే ఇంటి యజమాని పన్ను కట్టాల్సి వస్తుంది. అత్యధికంగా అనంతపురం నగరంలో 89.79 శాతం, అత్యల్పంగా మడకశిరలో 13.52 శాతం నివాసాలను మ్యాపింగ్‌ చేసే ప్రక్రియ పూర్తయింది. ఈ విధానం రాబోయే రోజుల్లో ఇంటి యజమానులకు సమస్యగా మారనున్నా యంత్రాంగం మాత్రం ఉత్తర్వులు వచ్చిందే తరువాయి మ్యాపింగ్‌ను మాత్రం చకచకా చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల ఇంటి పన్ను కట్టే అంశంలో ప్రతిబంధకంగా మారనుండటంతో పన్నుల వసూళ్లపై ప్రభావం పడే ప్రమాదం ఉంది.

సేకరణ అంతంత మాత్రమే..

ఇంటింటా చెత్తను వేరు చేసి క్లాప్‌ ఆటోల ద్వారా తరలించాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికీ మూడు చెత్త బిన్నులు ఇవ్వడంతో తడి, పొడి, హానికారక వ్యర్థాలను అందులోకి వేయాల్సి ఉంటుంది. ఆటో రాగానే మూడు అరల్లోకి వేయాల్సి ఉంటుంది. వాహనం వద్ద డ్రైవరు ఉండగా ఒక్కోసారి కార్మికులు పట్టించుకోవడం లేదు. చెత్త వేరుచేయాలన్న నిబంధనలున్నా అంతా ఒకే అరలోకే పడేస్తున్నారు. రోజూ వాహనాలు రావడం లేదు. నగరం, పుర, పట్టణాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్త దర్శనం ఇస్తుండటంతో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం నెరవేరడం లేదు.

అనుసంధానం చేస్తున్నాం: - భాగ్యలక్ష్మి, అనంత నగర కమిషనరు

ఇంటి పన్నును సచివాలయం వారీగా ఉన్న నివాసాలను గుర్తించి క్లాప్‌ పరిధిలోకి వచ్చేవాటిని అనుసంధానం చేస్తున్నాం. యూజర్‌ ఛార్జీలు వసూలు కోసం అని కాదు.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో తెలియదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని