logo

అంగన్‌వాడీ పోషణ అంతంతే!

Published : 27 Mar 2024 04:48 IST

సరకుల లెక్క గందరగోళం
లబ్ధిదారుల సంఖ్యలో వ్యత్యాసం

  • శింగనమల ప్రాజెక్టు పరిధి బీకే సముద్రం మండలంలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలు 32 మంది, గర్భిణి, బాలింతలు 17 మంది ఉన్నారు. బియ్యం, కందిపప్పు, నూనె మాత్రం 21 మంది పిల్లలు, 13 మంది గర్భిణి,బాలింతలకు వచ్చాయి. తక్కిన వారికి అందలేదు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి.
  • అనంత గ్రామీణ ప్రాజెక్టు పరిధిలోని ఓ కేంద్రంలో లబ్ధిదారుల సంఖ్య 43 ఉంటే... 21 మందికే సరకులు అందాయి.

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ఈఏడాది జనవరి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు సరిపడా పౌష్టికాహారం అందడం లేదు. ఉమ్మడి అనంత జిల్లాలో ఈ దుస్థితి మూడు నెలలుగా కొనసాగుతున్నా సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడం లబ్ధిదారుల పాలిట శాపంలా మారింది. అరకొర పోషణతో చేతులు దులుపేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోషణ ట్రాకర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంపూర్ణ పోషణ యాప్‌ల్లో నమోదయ్యే లబ్ధిదారుల సంఖ్యలో వ్యత్యాసం ఉండటమే కారణం. రాష్ట్ర యాప్‌లో ఎక్కువ సంఖ్య చూపడం, కేంద్ర యాప్‌లో తక్కువ లెక్కలు ఉండటంతో సరకులు, ఇతరాత్ర పౌష్టికాహారం తగినంత రావడం లేదు. డిసెంబరులోనే ఈ సమస్య ఉత్పన్నమైనా... సిబ్బంది నిరవధిక సమ్మెలో ఉండటంతో బహిర్గతం కాలేదు. జనవరిలో పది రోజులే ఉండటంతో పెద్దగా సమస్య బయటకు పొక్కలేదు. ఫిబ్రవరిలో నిల్వ, ఇండెంటు తేడా కనిపించడంతో అసలు బాగోతం తెరపైకి వచ్చింది. మార్చిలో సరిచేస్తామని చెప్పినా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికీ అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, కందిపప్పు, వంట నూనె.. తదితర సరకులు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. ప్రస్తుత నెలలో ఐదు రోజులే ఉన్నా వేలాది లబ్ధిదారులకు సరకులు అందలేదు.

ఎందుకిలా?

అంగన్‌వాడీ కేంద్రాలకు బియ్యం, కంది పప్పు, వంటనూనె.. తదితర వాటిని వంద శాతం కేంద్ర ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. కోడిగుడ్లకు సంబంధించి 50 శాతం నిధులు కేంద్రం ఇస్తోంది. గతేడాది అక్టోబరు దాకా సంపూర్ణ పోషణ యాప్‌లో మాత్రమే ప్రతి నెలా ఇండెంటు నమోదు చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మతలబు, ప్రచారాన్ని కేంద్రం పసిగట్టింది. తాము ఇచ్చే పౌష్టికాహారానికి లెక్కలు చెప్పాలంటూ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే అక్టోబరు నుంచే ఇండెంటును పోషణ ట్రాకర్‌లోనే నమోదు చేయాలని ఆదేశించింది. నవంబరులో పోషణ ట్రాకర్‌, సంపూర్ణ పోషణలో వేర్వేరుగా ఇండెంటు పెట్టారు. రెండింటిలో లబ్ధిదారుల సంఖ్య నమోదులో వేర్వేరుగా చూపారు. కేంద్రానికి పక్కా లెక్కలు చెప్పారు. రాష్ట్రానికి పంపిన లెక్కల్లో ఎక్కువ నమోదైంది. అసలు సమస్య ఇక్కడే తెరపైకి వచ్చింది. ఇండెంటు ప్రకారం కేంద్రం సరుకులు పంపిస్తున్నా అంగన్‌వాడీలకు చాలడం లేదు.

ఇండెంటులో మతలబు

అనంత, శ్రీసత్యసాయి జిల్లాల వ్యాప్తంగా 5126 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 3.08 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి నెలా పదో తేదీలోపు రెండు యాప్‌ల్లో ఇండెంటు నమోదు చేస్తున్నారు. డిసెంబరులో నమోదైన ఇండెంటే ఇప్పటికీ కొనసాగుతుంది. అప్పట్లో రెండు యాప్‌ల్లో వేర్వేరుగా లబ్ధిదారులను నమోదు చేసినట్లు తెలుస్తోంది. డిసెంబరు 12న సిబ్బంది సమ్మెలోకి వెళ్లడం... జనవరి 22న విధుల్లో చేరారు. డిసెంబరు, జనవరి సరకులు మిగిలాయన్న ఉద్దేశంతో సర్దుబాటు చేశారు. ఫిబ్రవరిలో సరకులే రాలేదు. కొన్ని చోట్లా వచ్చినా అరకొరగానే అందాయి. ఇక ఈనెలలో ఊసేలేదు. 3-6 ఏళ్ల వయసు పిల్లలకు కేంద్రాల్లో వంటావార్పు చేయాల్సి ఉన్నా వంద శాతం ఇప్పటికీ అమలు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని