logo

నాడు-నేడు జగన్మాయ

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు.

Updated : 19 Apr 2024 06:00 IST

పాఠశాల విద్యలో మేమే సంస్కరణలు తీసుకొచ్చాం. గతంలో ఎన్నడూ లేనట్లు బడుల రూపురేఖలు మార్చేశాం. కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్ది.. మెరుగైన బోధన అందిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాం.  

పలు వేదికలు, కార్యక్రమాల్లో సీఎం జగన్‌ చెప్పిన గొప్పలివి.

నాడు-నేడు పథకం ప్రచార ఆర్భాటానికే పరిమితమైంది. అరకొర నిధులు ఇచ్చినా ఒక్క నిర్మాణమూ సంపూర్ణం కాలేదు. కొన్నిచోట్ల రంగులద్ది మమ అనిపించారు. ఐదేళ్లలో ఉన్న వాటిని కూల్చి.. కొత్త నిర్మాణాలను పూర్తి చేయకపోవడంతో విద్యార్థులకు నిత్యం కష్టాలు తప్పడం లేదు.

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిలివి.


అనంతపురం విద్య, న్యూస్‌టుడే

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రగతి పనులను అటకెక్కించారు. నాడు-నేడు పథకం కింద బడులను ఎంపిక చేశారే తప్ప అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి తగిన నిధులు కేటాయించడం లేదు. కార్పొరేట్‌ తరహాలో తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పథకం కింద అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణంతోపాటు తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. అనంత జిల్లాలో 1102, శ్రీసత్యసాయి జిల్లాలో 1081 పాఠశాలలు పథకం కింద ఎంపికయ్యాయి. పనులు చేపట్టిన ఏ ఒక్క పాఠశాలలోనూ నిర్మాణాలు పూర్తి చేయలేదు. మూడు విడతల్లో అరకొర నిధులు విడుదలయ్యాయి. గతేడాది నవంబరు 30 నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించినా.. నిధులు సకాలంలో విడుదల చేయక.. పథకానికి పాతరేసి, గాలిమాటలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను వైకాపా సర్కారు మభ్యపెట్టింది.

తప్పని నరకయాతన

ప్రభుత్వం జారీ చేసిన 117 జీవో ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు సమీప ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. 3 నుంచి 10వ తరగతి వరకూ తరగతులు నిర్వహించడం కష్టమవుతోంది. చాలాచోట్ల అదనపు గదుల పనులు పూర్తి చేయకపోవడంతో విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. నిర్మాణ సామగ్రి చెంతన... చెట్లు, రేకుల షెడ్ల కింద చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది.


సిమెంట్‌ లేక.. నిర్మాణం సాగక

కళ్యాణదుర్గం గ్రామీణం: తూర్పుకోడిపల్లి ప్రాథమిక పాఠశాలలో 58 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. గదుల మరమ్మతులు, వంటగది, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణానికి రూ.8 లక్షలు వచ్చాయి. ఇప్పటికే రూ.6 లక్షలకు సంబంధించిన పనులు పూర్తయ్యాయి. ప్రహరీ గేట్‌, ప్లాస్టరింగ్‌ చేయాల్సి ఉంది. సిమెంట్‌ లేక పనులు ఆగిపోయి.


నిధుల కొరత.. విద్యార్థులకు వెత

అనంతపురం: కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అర్ధాంతరంగా ఆగిన అదనపు తరగతి గదులివి. సమీపంలోని గిల్డ్‌ ఆఫ్‌ సర్వీస్‌, విద్యారణ్య ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడటంతో అక్కడి విద్యార్థినులు కేఎస్‌ఆర్‌ పాఠశాలలో చేరడంతో సంఖ్య 1,220కి చేరింది. నిధులు అందక గదుల నిర్మాణం ఆగిపోయింది. గదుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


ఆగిన నిధులు.. నిలిచిన పనులు

యాడికి: స్థానిక కేజీబీవీలో అదనపు గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి మూడేళ్లు దాటింది. నాడు-నేడు కింద రూ.కోటి దాక వెచ్చించి ఎనిమిది గదుల నిర్మాణం చేపట్టారు. ఇంకా రూ.50 లక్షల వరకు నిధులు మంజూరు రాకపోవడంతో మొదటి అంతస్తులోని గదుల నిర్మాణం ఆగింది. ఆవరణలోనే నిర్మాణ సామగ్రి వదిలేయడంతో బాలికలు ఇబ్బందులు పడుతున్నారు.


సరఫరా కాని నిర్మాణ సామగ్రి  

ఇటుకలు, కడ్డీల కొనుగోలు, నిర్మాణ కార్మికులకు కూలి చెల్లించడానికి పథకం కింద ప్రభుత్వం నిధులు చెల్లించాలి. బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, కిటికీలు, తలుపులు, నీటిశుద్ధి యంత్రాలు, సిమెంటు, ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలి. సామగ్రి సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.


బోధనకు వరండానే దిక్కు

విడపనకల్లు: స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 3 నుంచి 10వ తరగతి వరకు 719 మంది విద్యార్థులున్నారు. పాఠశాలకు నాడు-నేడు ఫేజ్‌-2 కింద నాలుగు అదనపు తరగతి గదులు మంజూరయ్యాయి. ఏడాదిన్నర కాలంగా పనులు ముందుకు సాగడం లేదు. మూడు తరగతులకు నిత్యం వరండాలోనే బోధన సాగుతోంది.


ఆర్డీటీ భవనంలో తరగతులు

గుంతకల్లు గ్రామీణం: పులగుట్టపల్లి పెద్దతండాలోని ప్రాథమిక పాఠశాలలో 32 మంది చదువుతున్నారు. పైకప్పు లీకేజీ ఉండటంతో మరమ్మతులు చేపట్టారు. వెనుకవైపు ప్రహరీ నిర్మించి భవనానికి రంగులు వేయాల్సి ఉంది. నిధులు లేకపోవడంతో ఆర్డీటీకి చెందిన భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని