logo

బహిరంగంగా డబ్బు పంపిణీ

అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొనేసి గెలవడానికి అడ్డదారులను ఎంచుకుంటోంది.

Published : 07 May 2024 05:34 IST

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కొనుగోలు
అనంతలో వైకాపా బరితెగింపు

డబ్బు పంపిణీ చేస్తున్న వైకాపా నాయకులు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: అధికార వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది. ఎలాగైనా ఓట్లను కొనేసి గెలవడానికి అడ్డదారులను ఎంచుకుంటోంది. సోమవారం అనంత ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్దే ఈ బాగోతం నడవటం విశేషం. ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బలవంతంగా కవర్‌లో డబ్బు పెట్టి ఇస్తున్నారు. రూ.3 వేల నుంచి రూ.5 వేలు మధ్యలో కవర్‌లో పెట్టి ఇస్తున్నారు. కొందరికి నేరుగా నోట్లనే ఇచ్చారు. అత్యధిక శాతం మంది వైకాపా నాయకుల ప్రలోభాలకు లొంగలేదు. ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్దే బరితెగించి డబ్బు పంపిణీ చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. డబ్బు పంపిణీ వ్యవహారం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రధాన రహదారి పక్కనే ప్రత్యేక టెంటులోనూ ఈ తరహా బాగోతం చోటు చేసుకుంది. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్‌ అక్కడికి చేరుకోవడంతో వైకాపా నాయకులు జారుకున్నారు.

పోటెత్తిన ఉద్యోగులు

నాలుగో రోజైన సోమవారం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులు పోటెత్తారు. భారీ సంఖ్యలో తరలివచ్చారు. సోమవారంతో పీఓ, ఏపీఓ, పీఓపీల ఓటింగ్‌ ముగిసింది. ఇతర విధులు నిర్వర్తించే ఉద్యోగులు, పోలీసు, అంగన్‌వాడీ కార్యకర్తలు.. వంటి వారు సోమవారం నుంచే ఓటు వేస్తున్నారు. ఈ నెల 8 వరకూ వీరికి అవకాశం ఉంటుంది.  అనంత ఫెసిలిటేషన్‌ కేంద్రం నిర్వహణ, ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటింగ్‌ సరళిపై ఆరా తీశారు.  

ఆ ఓట్లు చెల్లనట్లేనా!

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల బాగోతం ఆరంభం నుంచి విమర్శల పాలవుతోంది. ఫాం-12 దరఖాస్తుల స్వీకరణ నుంచి ఓటు వేసే దాకా అనేక అవకతవకలు, బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కొట్టుకొచ్చినట్లు బహిర్గతం అవుతోంది. కొంతమంది అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు(ఆర్‌ఓ) పెద్ద తప్పు చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చే డిక్లరేషన్‌ ఫాంపై అక్కడే ఉన్న గెజిటెడ్‌ అధికారి ఓటర్ల వివరాలు ధ్రువీకరిస్తూ సంతకం చేసి, స్టాంపు వేయాల్సి ఉంటుంది.  లేదంటే... అనర్హత కింద పక్కన పెడతారు. చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయుల డిక్లరేషన్‌ ఫారాలపై సంతకాలు చేసి.. స్టాంపు వేయలేదు. ఈ తరహా ఓట్లు వందల్లోనే ఉంటాయని అంచనా.

వివాదంలో అనంత ఆర్వో

ఈనెల 3న రాప్తాడు ఫెసిలిటేషన్‌ కేంద్రంలో తొలి పది మందికిపైగా గెజిటెడ్‌ సంతకం, స్టాంపు లేకుండానే ఓట్లు వేసినట్లు తేలింది. ఓ పది ఓట్లు చెల్లకపోతే ఏమవుతుందిలే అంటూ అక్కడి ఆర్‌ఓ ఉద్యోగ, ఉపాధ్యాయులతో వాదనకు దిగారు. ఈ విషయాన్ని కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. అనంత ఆర్‌ఓ వ్యవహారం వివాదం అవుతోంది. తొలి రోజు కూడా ఇక్కడ సంతకాలు చేసి.. స్టాంపు లేకుండానే కొందరు ఓట్లు వేశారు. ఇక 5న మూడో బూత్‌లో ఓ వంద మందికిపైగా డిక్లరేషన్‌ ఫాంలపై స్టాంపు వేయనట్లు తెలుస్తోంది. స్వయాన ఆర్‌ఓ/ఆర్డీఓనే సంతకం చేసి.. స్టాంపు వేయలేదు. స్టాంపు వేయకపోయినా ఓట్లు చెల్లుతాయంటూ ఆ ఆర్‌ఓ బుకాయించారు. ఏం చర్య తీసుకుంటారో చూడాలి.

ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌  

10,499 మంది ఓటేశారు!

పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఈ నెల 5 వరకూ జిల్లా, ఇతర జిల్లాల వారు కలిపి మొత్తం 26,150 మంది ఉండగా 10,499 మంది ఓటేశారన్నారు. అత్యధికంగా అనంత నగరంలో 2773 మంది, రాయదుర్గంలో 579 మంది మాత్రమే ఓటేశారు. మొత్తంగా 40.15 శాతం మంది ఓట్లు వేసినట్లు చెప్పారు. ఈ నెల 8వ తేదీ దాకా గడువు ఉందన్నారు. హోం ఓటింగ్‌ కోసం 1247 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి దాకా 296 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని