logo

జిల్లాతో ఆత్మీయ అనుబంధం

 మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యకు జిల్లాతో, ఇక్కడి నాయకులతోనూ అనుబంధం ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగా స్వతంత్ర పార్టీ పెట్టి 1962లో చిత్తూరు లోక్‌సభ నుంచి గెలుపొందారు. మాజీ ఎంపీ దివంగత పాటూరు రాజగోపాల్‌నాయుడు, రోశయ్య

Published : 05 Dec 2021 05:59 IST


స్వతంత్ర పార్టీ అవిర్భావ సభలో ఎన్‌జీ రంగా, రాజగోపాల్‌నాయుడుతో రోశయ్య

ఈనాడు డిజిటల్‌, తిరుపతి మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యకు జిల్లాతో, ఇక్కడి నాయకులతోనూ అనుబంధం ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగా స్వతంత్ర పార్టీ పెట్టి 1962లో చిత్తూరు లోక్‌సభ నుంచి గెలుపొందారు. మాజీ ఎంపీ దివంగత పాటూరు రాజగోపాల్‌నాయుడు, రోశయ్య రంగాకు మద్దతుగా నిలిచి చిత్తూరు నుంచే కాకుండా రాష్ట్రంలో కీలక పాత్ర పోషించారు. పాటూరు రాజగోపాల్‌ నాయుడు, రోశయ్య, మాజీ సీఎం చంద్రబాబు రంగా శిష్యులే. రాజగోపాల్‌నాయుడు ద్వారా రంగాకు చంద్రబాబు దగ్గరయ్యారు. మాజీ ఎంపీ చెంగల్రాయనాయుడుతో ఎంతో అనుబంధం ఉంది. తమిళనాడు గవర్నర్‌గా పని చేసిన సమయంలో చిత్తూరులో చెంగల్రాయనాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేశారు.

శ్రీకాళహస్తిలో రాజగోపురం 2010 మే 26న నేల కూలింది. పునర్నిర్మాణానికి నవయుగ నిర్మాణ సంస్థ ముందుకు రావడంతో అప్పటి సీఎం రోశయ్య 2010 ఆగస్టు 29న శ్రీకాళహస్తి విచ్చేసి రాజగోపురం నిర్మాణానికి భూమి పూజ చేశారు. సీఎంగా జిల్లాకు పలు వంతెనలు, అతిథి గృహాలు ఆర్‌అండ్‌బీ తరఫున నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తిలో ఆయనకు పలువురు ఆత్మీయ అనుచరులు ఉన్నారు.

తితిదేలో సంస్కరణలు.. సీఎంగా రోశయ్య బాధ్యతలు స్వీకరించిన సమయంలో అప్పటి తితిదే ధర్మకర్తల మండలి వివాదాల్లో కూరుకుంది. కాలపరిమితి పూర్తికాగానే వెంటనే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు జె.సత్యనారాయణ, నాగిరెడ్డి, ఈవో ఐవైఆర్‌ కృష్ణారావుతో స్పెసిఫైడ్‌ అథారిటీని నియమించి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఏడాదికిపైగా ఉన్న కమిటీ దేవస్థానంలో పలు సంస్కరణలు తీసుకువచ్చింది. శ్రీవారి దర్శన, సేవాటికెట్ల జారీకి ఐడీ కార్డులు ప్రామాణికరగా ప్రవేశపెట్టడం వంటి చర్యలు తితిదే తీసుకుంది. నిజాయతీ అధికారిగా ముద్రపడ్డ కాటమనేని భాస్కర్‌ను జేఈవోగా రోశయ్య నియమించారు. శ్రీవారిని పలుమార్లు దర్శించుకున్నారు. అనారోగ్యం కారణంగా సీఎం హోదాలో బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించలేకపోయారు.

పలువురి సంతాపం..

రోశయ్య మృతికి మంత్రి పెద్దిరెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు చింతా మోహన్‌, పనబాక లక్ష్మి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంజీఎం గ్రూప్‌ ఛైర్మన్‌ గుండ్లూరు మల్లికార్జుననాయుడు, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రాజసింహులు, తెదేపా చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, ఎమ్మెల్యే ఆదిమూలం, శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి సంతాపం తెలిపారు.

నాన్నతో శిష్యరికం చేసిన రోశయ్య మంత్రివర్గంలో తాను మంత్రిగా పని చేశానని గల్లా అరుణ గుర్తు చేశారు.

శ్రీకాళహస్తిలో నూతన రాజగోపుర నిర్మాణానికి 2010లో

శంకుస్థాపన చేస్తున్న అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని