logo

అంతరిక్షం.. ఆవిష్కరణల క్షేత్రం

సామాజిక అవసరాల దిశగా అంతరిక్ష సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇస్రో ఆధ్వర్యంలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది.

Updated : 04 Oct 2022 05:13 IST

నేటి నుంచి ప్రపంచ వారోత్సవాలు
షార్‌కు తమిళనాడు గవర్నర్‌ రాక


ప్రదర్శనకు ఏర్పాట్లు చేసిన నమూనా రాకెట్లు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: సామాజిక అవసరాల దిశగా అంతరిక్ష సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇస్రో ఆధ్వర్యంలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తోంది. మంగళవారం నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటివరకు మనదేశం అంతరిక్ష రంగంలో సాధించిన ఘనతలను మననం చేసుకుంటూనే భవిష్యత్తు అవసరాలకు నిర్దేశించుకున్న లక్ష్యాలను విశదీకరించనుంది. ‘స్పేస్‌ అండ్‌ సస్టైనబులిటీ’ నినాదంతో ఈ ఏడాది తలపెట్టిన వారోత్సవాలను తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ప్రారంభించనుండగా ఈ మేరకు షార్‌ యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. ఇస్రో ఆధ్వర్యాన మన రాష్ట్రంతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోని 8 ప్రాంతాల్లో ఈనెల 4 నుంచి 10 వరకు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. షార్‌ నుంచి సీనియర్‌ శాస్త్రవేత్తలు, అధికారులు హాజరై ఉపన్యాసాలు, ప్రదర్శనలు ఇవ్వనున్నారు. అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిని తెలిపే ప్రదర్శనలు వేదికల వద్ద ప్రదర్శిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి పాల్గొనే వారికోసం ఆన్‌లైన్‌లో చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్‌, విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు. వారోత్సవాల సందర్భంగా షార్‌ సందర్శనకు విద్యార్థులను అనుమతిస్తున్నారు. విద్యార్థుల వీక్షణ కోసం రాకెట్‌ ప్రయోగం చేపట్టనున్నారు. జిల్లాలో శ్రీహరికోటతోపాటు తిరుచానూర్‌, రంగంపేట, శ్రీసిటీలో కార్యక్రమాలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని