logo

ఆత్మీయత పంచుతూ.. భరోసానిస్తూ..

ఆత్మీయ పలకరింపులు.. అడుగడుగునా హృదయపూర్వక స్వాగతాలు.. నేనున్నాననే భరోసా.. భావి పౌరులకు ఉపాధి తన బాధ్యత అంటూ హామీ.. ఆడపడుచులకు రక్షణ కల్పించే అన్నగా ఉంటాననే మాట..

Published : 08 Feb 2023 04:10 IST

ఎమ్మెల్యే శ్రీనివాసులు భూ బకాసురుడు
చిత్తూరులో విశ్వవిద్యాలయం, ఎలక్ట్రానిక్స్‌ హబ్‌ ఏర్పాటు చేస్తాం
యువగళం సభలో నారా లోకేశ్‌
ఈనాడు డిజిటల్‌ - చిత్తూరు; చిత్తూరు (జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే

సభకు హాజరైన ప్రజలు

ఆత్మీయ పలకరింపులు.. అడుగడుగునా హృదయపూర్వక స్వాగతాలు.. నేనున్నాననే భరోసా.. భావి పౌరులకు ఉపాధి తన బాధ్యత అంటూ హామీ.. ఆడపడుచులకు రక్షణ కల్పించే అన్నగా ఉంటాననే మాట.. ఇలా అడుగడుగునా యువనేత, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ 12వ రోజు పాదయాత్ర సాగింది.. మంగళవారం ప్రత్యేకించి మహిళలు.. యువతులు తరలి వచ్చారు. పార్టీ కేడర్‌లో ధైర్యాన్ని నింపుతూ.. వైకాపా అవినీతిని ఎండగడుతూ యాత్ర సాగింది. తరలివచ్చిన ప్రజలు, తెదేపా శ్రేణుల నడుమ తెదేపా జిల్లా కార్యాలయం నుంచి ఆరంభమైన పాదయాత్ర రాత్రి విడిది దిగువ మాసాపల్లి చేరుకోవడానికి కనీసం నాలుగు గంటలకుపైగా పట్టింది.

చిత్తూరు ఎమ్మెల్యే భూ బకాసురుడని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. చిత్తూరులో మంగళవారం సాయంత్రం నిర్వహించిన యువగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తనపై ఎన్ని కేసులు పెట్టినా పర్లేదని, తెదేపా కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదన్నారు. హంద్రీ-నీవా పనులు పూర్తిగా ఆపేశారన్నారు. రూ.500 కోట్లు ప్రజాధనాన్ని దోచిన ఎమ్మెల్యే శ్రీనివాసులు, గుడిపాల మండలంలో 300 ఎకరాల పశువుల మేత భూమిని మింగేశాడని వెల్లడించారు. ఎమ్మెల్యే, ఆయన అన్న కుమారుడు శివ ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని, తచ్చూరు రహదారి నిర్మాణ కాంట్రాక్టర్‌ను బెదిరించి నగదు తీసుకున్నారన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంగా ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కారిస్తామని, చిత్తూరులో విశ్వవిద్యాలయం కలను చంద్రబాబు నెరవేరుస్తారని, లోకేశ్‌ను అడ్డుకుంటే యువగళం ఆగదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, రాజసింహులు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శులు బీద రవిచంద్ర, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, చల్లా రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ కఠారి హేమలత, రాష్ట్ర కార్యదర్శి సందీప్‌, మాజీ కార్పొరేటర్‌ వసంత్‌కుమార్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


‘సైకో జగన్‌.. ఉద్యోగాలు పీకేస్తాడు’

కొత్త అన్న క్యాంటీన్‌ను పర్యవేక్షిస్తున్న రాజశేఖర్‌ను అభినందిస్తున్న లోకేశ్‌

చిత్తూరు(జిల్లా పంచాయతీ): పాదయాత్ర చేస్తూ కొంగారెడ్డిపల్లిలోని పాత అన్న క్యాంటీన్‌ భవనంలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాన్ని మంగళవారం రాత్రి నారా లోకేశ్‌ పరిశీలించారు. అక్కడి సిబ్బంది అనుమతి తీసుకుని లోపలికి వెళ్లిన ఆయన అక్కడి పరిస్థితి చూశారు. సిబ్బందితో మాట్లాడారు. పక్కన ఉన్న నాయకులను మరిన్ని వివరాలు అడిగారు. సిబ్బంది తమతో మాట్లాడితే వారి ఉద్యోగాలను సైకో జగన్‌ తీసేస్తాడని లోకేశ్‌ పేర్కొన్నారు. ఎంతోమంది పేదల ఆకలిని తీర్చిన అన్న క్యాంటీన్లను మూసేసిన పాపం జగన్‌రెడ్డిని వదలదని హెచ్చరించారు. కొత్త అన్న క్యాంటీన్‌ను పర్యవేక్షిస్తున్న రాజశేఖర్‌ను ఆయన అభినందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు