logo

రెండు కుటుంబాల్లో విషాదం

రంజాన్‌ మాసం తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన ఓ యువకుడు.. కొవిడ్‌ తండ్రిని మింగేసినా ఇంటి భారాన్ని పెద్ద కొడుకుగా మోస్తున్న మరో యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది.

Updated : 01 Apr 2023 05:41 IST

పెళ్లి నిశ్చయమై ఒకరు.. కుటుంబ పెద్ద మరొకరు.. 
కబళించిన మృత్యువు

దినేష్‌ మృతదేహం కోసం ఎదురు చూస్తున్న గ్రామస్థులు

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: రంజాన్‌ మాసం తర్వాత పెళ్లి చేసుకోవాల్సిన ఓ యువకుడు.. కొవిడ్‌ తండ్రిని మింగేసినా ఇంటి భారాన్ని పెద్ద కొడుకుగా మోస్తున్న మరో యువకుడిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. చిత్తూరు జిల్లా సదుంలో స్నేహితుడి పెళ్లి వేడుకలకు హాజరై తిరిగి వస్తూ పనబాకం వద్ద గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. మృతదేహాలకు శవపరీక్ష నిర్వహిస్తున్న ఎస్వీ వైద్య కళాశాల వద్దకు ఆ రెండు కుటుంబాల సభ్యులు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ‘స్నేహితుడి పెళ్లికి వెళితే కదా.. మరో రెండు నెలల్లో జరిగే నా పెళ్లికి వస్తారంటూ వెళ్లి అనంత లోకాలకు చేరావా అంటూ’ ఇమ్రాన్‌ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి లేకపోయినా తల్లి సహకారంతో తమ్ముడికి అండగా ఉంటున్న దినేష్‌ మృతదేహం చూసి ఆ గ్రామస్థులు తల్లడిల్లిపోయారు.

విలపిస్తున్న ఇమ్రాన్‌ కుటుంబ సభ్యులు

తండ్రికి చేదోడుగా ఉంటూ..

తిరుపతి కుమ్మరితోపు ప్రాంతానికి చెందిన చాంద్‌బాషా, కరీమున్నీషా దంపతుల పెద్ద కుమారుడు ఇమ్రాన్‌ (24) డిగ్రీ వరకు చదువుకుని ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. టీవీ మెకానిక్‌ అయిన తండ్రికి చేదోడుగా ఉంటున్నారు. తిరుపతికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ తరుణంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై మృతి చెందారు.

కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి..

రేణిగుంట మండలం ఇప్పమానుపేటకు చెందిన హరి, రేణుక దంపతుల పెద్ద కుమారుడు దినేష్‌ (24) ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. కొవిడ్‌తో తండ్రి మృతి చెందినా కుటుంబానికి అండగా దినేష్‌ నిలిచారు. రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ప్రమాదంలో గాయపడ్డ శ్రీనివాసులు, పృథ్వీ, జయచంద్రారెడ్డి, తులసి నాయుడు, విశ్వనాథ్‌, విజయరెడ్డి రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి ఐదుగురు ప్రైవేటు ఆస్పత్రులకు.. ఒకరు ఈఎస్‌ఐ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్లారు. శవ పరీక్షల అనంతరం ఇద్దరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు శుక్రవారం సాయంత్రం అప్పగించారు.

దినేష్‌  ఇమ్రాన్‌ (పాత చిత్రాలు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని