logo

నేర వార్తలు

పురపాలక పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Published : 01 Apr 2023 03:09 IST

యువతి అదృశ్యం

సూళ్లూరుపేట: పురపాలక పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువతి కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి కొద్ది రోజుల కిందట ద్వితీయ సంవత్సరం ఇంటర్‌ పరీక్షలు రాసింది. గత రెండు రోజులుగా కనిపించక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


ట్రాక్టర్‌, ఆటో ఢీ.. పలువురికి గాయాలు

సూళ్లూరుపేట: శ్రీహరికోట రోడ్డులో కేసీఎన్‌గుంట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్‌ను ఆటో ఢీకొని పలువురు గాయపడ్డారు. శ్రీహరికోట రోడ్డులో మట్టి ట్రాక్టర్‌ వెళ్తుండగా దాని వెనుక ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ ఉన్నట్టుండి బ్రేక్‌లు వేయడంతో వెనుక వస్తున్న ఆటో ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని వారు గాయ పడ్డారు. స్థానికులు వారిని సూళ్లూరుపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు.


పోలీసుల అదుపులో చోరీ అనుమానితులు

వాకాడు, న్యూస్‌టుడే: మండలంలోని బాలిరెడ్డిపాలెంలో రైతుకు చెందిన వ్యవసాయ పరికరాలు చోరీకి గురైయ్యాయి. ఈమేరకు బుధవారం చిట్టమూరు మండలం దరఖాస్తు గ్రామానికి చెందిన ఇద్దరు పాత సామాన్లు కొనుగోలు చేసుకొనే వారిని వాకాడు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాలిరెడ్డిపాలెంలో పొలంలో ఉన్న వ్యవసాయ పరికరాలను చోరీ చేసి చిట్టమూరు మండలం కొత్తగుంటలోని పాత సామాన్లు కొనుగోలు చేసే వ్యాపారికి విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. ఈ విషయమై వాకాడు ఎస్‌ఐ రఘునాథ్‌ను వివరణ కోరగా పరికరాలు చోరీ విషయమై విచారిస్తూ కోటకు పంపామన్నారు.


రెండు లారీలు ఢీ.. ట్రాఫిక్‌కు అంతరాయం

తడ, న్యూస్‌టుడే: మండలంలోని భీములవారిపాళెం తనిఖీ కేంద్రం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముందున్న లారీలోని ఇనుప గడ్డర్‌లు కింద పడ్డాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గంటకుపైగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగప్రవేశం చేసి క్రేన్‌ల సాయంతో గడ్డర్‌లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


మేయరు దంపతుల హత్య కేసు విచారణ 3కు వాయిదా  

చిత్తూరు(న్యాయవిభాగం):  దివంగత మేయరు దంపతుల హత్య కేసు విచారణను ఈ నెల 3వ తేదీకి వాయిదా వేస్తూ శుక్రవారం స్థానిక ఆరవ అదనపు జిల్లా కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి శాంతి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక పాత జిల్లా కోర్టు ప్రాంగణంలోని పోక్సో కోర్టులో ఈ కేసులో సాక్షుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు షెడ్యూల్‌ ప్రకారం 38మంది సాక్షులు కోర్టుకు హాజరుకాగా..ఇందులో 11 మంది వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయగా..మరొక సాక్షిని విచారించాల్సి ఉంది. మిగిలిన 26 మందిని విచారించాల్సిన అవసరం లేదని పీపీ పేర్కొనగా.. కోర్టు ఏకీభవించింది.


ఏఎస్సై, కానిస్టేబుల్‌ బదిలీ

జీడీనెల్లూరు: విశ్రాంత వీఆర్వో రవీంద్రనాథరెడ్డిపై నాకాబందీ నిర్వహిస్తున్న పోలీసులు గురువారం రాత్రి దురుసుగా ప్రవర్తించడంతో వైకాపా నేతలు, గ్రామస్థులు జీడీనెల్లూరులో చేపట్టిన ధర్నాపై పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం చర్యలు చేపట్టారు. నాకాబందీలో పాల్గొన్న ఏఎస్సై గజేంద్ర, కానిస్టేబుల్‌ వినోద్‌పై బదిలీ వేటు వేశారు. ఎస్సై శ్రీనివాసరావుపై విచారణ చేస్తామని చిత్తూరు తూర్పు సీఐ గంగిరెడ్డి తెలిపారు.


రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె దుర్మరణం

గంగవరం: రోడ్డు ప్రమాదంలో తల్లీకుమార్తె దుర్మరణం చెందిన ఘటన మండలంలో కేంద్రంలో శుక్రవారం జరిగింది. పలమనేరు పట్టణంలోని రఘువీరారెడ్డి కాలనీ సమీపంలో కాపురముంటున్న వనిత (32), ఆమె కుమార్తె చారులత (9) మండలంలోని చీలావారిపల్లెలోని తమ బంధువుల ఇంటికి ద్విచక్రవాహనంపై గురువారం వెళ్లారు. శుక్రవారం ఉదయం తిరిగి పలమనేరుకు వస్తుండగా గంగవరం వంతెన వద్ద కంటైనర్‌ ఢీకొనడంతో తల్లీకుమార్తె అక్కడికక్కడే మృతిచెందారు. భర్త లేకపోవడంతో కుతుర్ని చదివించుకుంటూ ఉండేది. ఇద్దరూ మృత్యువాత పడటంతో బంధువులు విలపిస్తున్నారు. ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని