logo

‘శోకో’పాధ్యాయ పాఠశాలలు

జగన్‌ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్‌ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్‌ కమిషన్‌.

Updated : 25 Apr 2024 06:21 IST

బోధన, అదనపు పనిభారంతో ఏకోపాధ్యాయులు సతమతం
విలీనంతో చిన్నారులు బడులకు దూరం

జగన్‌ పాలనలో బడి పిల్లలు, పంతుళ్ల బతుకులు అతలాకుతలమయ్యాయి. జీవో 117 వారి జీవితాల్లో చీకట్లు నింపింది. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మాణం అవుతుందని కొఠారి కమిషన్‌ చెబితే.. పాఠాలు చెప్పేవారిని ఇబ్బందులు పెట్టాలంటుంది జగన్‌ కమిషన్‌. భావిభారతావనికి మంచి పౌరులనందించే నిర్మాతలే ప్రభుత్వ ఉపాధ్యాయులు. అలాంటివారిని హేతుబద్ధీకరణతో బదిలీలు, జీవో 117 పేరుతో ఏకోపాధ్యాయులుగా మార్చిన ఘనత మన జగ్గూభాయ్‌ సొంతం.

ఈనాడు డిజిటల్‌, తిరుపతి

న్యూస్‌టుడే, చిత్తూరు(విద్య), పూతలపట్టు: జాతీయ నూతన విద్యావిధానం-2020 పేరుతో 117 జీవో అమలుచేసి 98 మంది విద్యార్థులకన్నా తక్కువున్న ప్రభుత్వ పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కి.మీ దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. అందులోని ఉపాధ్యాయులను సైతం హేతుబద్ధీకరణ పేరుతో బదిలీ చేశారు. ప్రధాన, జాతీయ రహదారుల పక్కనున్న పాఠశాలలకు కేంద్రం మినహాయింపు ఇస్తే, వైకాపా ప్రభుత్వం మాత్రం ఆ ఉత్తర్వులు బేఖాతరు చేసి వాటిల్లోనూ విలీన ప్రక్రియ సాగించింది.

ఏకంతో సంకటమే..

ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడే 1-5 తరగతులకు అన్ని సబ్జెక్టులు బోధించాలి. యాప్‌లో విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన అమలు, మరుగుదొడ్ల శుభ్రత వంటివి నమోదు చేయాల్సిందే. మండల విద్యాధికారులు ఇచ్చే అసైన్‌మెంట్లు చేయాలి. సెలవు పెట్టాలంటే సమీప పాఠశాలల్లోని ఉపాధ్యాయులను బతిమాలాలి. ఇలా బోధన, అదనపు పనిభారంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. జగన్‌ మెగా డీఎస్సీ ఊసే మరవడం, ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడం వీరికి శాపంగా మారంది. డిప్యూటేషన్‌ వేసివారూ సక్రమంగా విధులకు హాజరుకారు. వచ్చినా మధ్యాహ్నం భోజనం వడ్డించి వెళ్లిపోతున్నారు.

జీవో 117తో పేదలకు దూరంగా విద్య

జీవో 117తో నిరుపేదలకు అందని ద్రాక్షలా మారింది విద్య. 3, 4, 5 తరగతులను హైస్కూల్‌లో విలీనం చేయడంతో అంతదూరం నడవలేక అట్టడుగు విద్యార్థులు చదువుకు స్వస్తి చెబుతున్నారు. మరోవైపు తమ పిల్లలను హైవే పక్కన చదివించేందుకు భయపడి, ప్రైవేట్‌ పాఠశాలలకు పంపిస్తున్నారు.

300 పైగా ప్రభుత్వ బదిలీలు

అమాత్యులు, ఉన్నతాధికారుల సిఫార్సుతో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలోనే 300కు పైగా ప్రభుత్వ బదిలీలు జరిగాయి. ఇందులో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేసే వారు సైతం ఉన్నారు. వీటి కోసం ఒక్కొక్కరు రూ.5-7 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇందులోనూ డమ్మీ బదిలీలూ ఉన్నాయి.

  • సూళ్లూరుపేట మండలంలో 22 ఏకోపాధ్యాయ పాఠశాలలున్నాయి. ఉపాధ్యాయులు లేని పాఠశాలలు దామానెల్లూరు, చెరువుమిట్ట ఉన్నాయి. పులికాట్‌ తీరంలోని చెరువుమిట్టలో కొన్ని నెలలుగా అసలు ఉపాధ్యాయుడే లేరు. ఇక్కడ ఏకోపాధ్యాయుడు ఉంటే అతను కొన్ని నెలలపాటు పాఠశాలలకే రాలేదు. ఈ విషయం విద్యాశాఖకు తెలిసినా తూతూమంత్రంగా విచారణ జరిపి, చేతులు దులుపుకొన్నారు. దొరవారిసత్రం మండలంలో ఏకంగా 25 పాఠశాలలున్నాయి.
  • యర్రావారిపాలెం మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 1-5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్నారు. గతంలో ఇద్దరు ఉండగా హేతుబద్ధీకరణ పేరుతో ఒకరిని బదిలీచేశారు. ఆ పాఠశాలలో ఉన్న 20 మంది విద్యార్థులకు ఆఒక్క ఉపాధ్యాయుడే అన్ని పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. దాంతోపాటు యాప్‌ల భారం మోస్తూ నానా తంటాలు పడుతున్నారు.
  • తడ మండలంలోని ఓ ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుడే 1-5 తరగతులు బోధిస్తున్నారు. ఇటీవల అనారోగ్యం కారణంగా సెలవు పెట్టాల్సి వచ్చింది. మండలాధికారి అనుమతితో ఇద్దరున్న పాఠశాలలో ఉపాధ్యాయులను తన పాఠశాలలో పాఠాలు చెప్పేందుకు ఒప్పించి సెలవు పెట్టాల్సి వచ్చింది.

విద్యార్థులను పరిశీలించలేకున్నారు

చిత్తూరులోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మా అబ్బాయి చదువుతున్నాడు. ఒకే టీచర్‌ ఐదు తరగతుల విద్యార్థులకు బోధించడం కష్టంగా ఉంది. పిల్లలందరూ ఎలా చదువుతున్నారో పరిశీలించేందుకు అతనికి సమయం లేకుండా పోయింది.

వెంకటరమణ, విద్యార్థి తండ్రి, చిత్తూరు

నిరంతరం భయమే

పూతలపట్టు మండలంలోని మోకటంపల్లి ప్రాథమిక పాఠశాలలో 1-5 తరగతి వరకు గతంలో ఉండేవి. ఇప్పుడు 3, 4, 5 తరగతులను కి.మీ దూరంలోని పి.కొత్తకోట జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీంతో విద్యార్థులు జాతీయ రహదారి గుండా వెళ్లాల్సి వస్తోంది. నిరంతరం అతివేగంగా వాహనాల రాకపోకలు సాగిస్తుండటంతో పిల్లలు ఇంటికి వచ్చేంతవరకు ఆత్రుతగా ఎదురుచూస్తుంటాం.

రమణారావు, విద్యార్థి తండ్రి, పి.కొత్తకోట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు