logo

రైతు సాగుదారు.. జగన్‌ హక్కుదారు

జగనన్న జమానాలో భూ పరిపాలన.. ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడం ఏమో కానీ చుక్కలు చూపించింది..

Updated : 02 May 2024 05:54 IST

టైట్లింగ్‌ చట్టం అమలైతే జరిగేదిదే అంటున్న న్యాయ నిపుణులు
పెద్దఎత్తున భూ ఆక్రమణలకు వైకాపా ప్రభుత్వం కుట్ర
అభద్రతలో అన్నదాతలు

కీడే ఎక్కువ..

లోపభూయిష్టంగా ఉన్న ఈ చట్టం వల్ల కీడే ఎక్కువని విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఏపీ ల్యాండ్‌ అథారిటీ.. ఏ వ్యక్తినైనా టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా(టీఆర్‌వో) నియమించవచ్చని సెక్షన్‌ 5(1)లో పేర్కొన్నారు. టీఆర్‌వో అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా.. స్థిరాస్తులకు ప్రాథమికంగా టైటిల్‌ రికార్డు సిద్ధం చేస్తారు. రికార్డులో తన పేరును మార్చాలనుకున్న వాళ్లుంటే, వారి అభ్యర్థనలు స్వీకరిస్తారు. రిజిస్టర్‌ ఆఫ్‌ టైటిల్‌లో వివరాలు నమోదు చేస్తారు. టీఆర్‌వోలు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారే ఆస్కారముందుని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.

జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఏపీ టైట్లింగ్‌ చట్టం పేరిట భూ ఆక్రమణలకు తెరతీశారు. ఈ క్రమంలో 2019 జులైలోనే శాసనసభలో బిల్లు పెట్టారు. ఇలా ప్రక్రియ నడుస్తుండగానే భూ సమగ్ర సర్వే తెచ్చారు. దీన్ని 2023 ఏడాది చివరి నాటికి పూర్తి చేసి అర్హులందరికీ యాజమాన్య హక్కు పత్రాలు అందిస్తామన్నారు. ఆపై రైతులకు మాయమాటలు చెప్పి అక్రమాలకు పూనుకున్నారు. ఐదంచెల పరిశీలనను గాలికొదిలేశారు. క్షేత్రస్థాయికి, రికార్డులకు పొంతన లేకుండా చేశారు. పక్క రైతులకు తెలియకుండానే హద్దులు మార్చేశారు. ఇలా వచ్చిన పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులే తప్పులు.. వీటిని సరిచేసుకోవడానికి మ్యూటేషన్‌ అంటూ కొత్త నాటకం ఆడించారు. ఇందుకు రైతులు దరఖాస్తు చేసుకోవాలంటే వేలకు వేల రూపాయలు చెల్లించాల్సిందే.


పలుకుబడి ఉంటేనే..: భూములు కొనుగోలు చేసిన రైతులు పట్టాను తమ పేర మార్పించుకోవడానికి మ్యూటేషన్లు, వివిధ అవసరాలకు ల్యాండ్‌ కన్వర్షన్లు కావాలంటే రాజకీయ పలుకుబడి ఉన్నవారికి చేస్తున్నారు. లేకుంటే దరఖాస్తుల్ని బుట్టదాఖలా చేస్తున్నారు.


చిత్తూరు కలెక్టరేట్‌, న్యాయవిభాగం, న్యూస్‌టుడే: జగనన్న జమానాలో భూ పరిపాలన.. ప్రజలకు మెరుగైన సేవల్ని అందించడం ఏమో కానీ చుక్కలు చూపించింది.. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో.. దేశంలోనే తొలిసారి సమగ్ర భూముల రీసర్వే అంటూ గొప్పలు చెప్పారు.. భూ తగాదాలు కట్టడి చేస్తాం.. కచ్చితమైన కొలతలతో సంపూర్ణ హక్కు పత్రాలు ఇస్తామని ప్రజల్లో భ్రమలు కల్పించారు.. తీరా రీసర్వే పూర్తయ్యాక ప్రజల మధ్య చిచ్చుపెట్టారు.. వారికిచ్చిన భూహక్కు పత్రాల్లో ఆస్తిదారుడి భూవిస్తీర్ణం అనూహ్యంగా తగ్గిపోయింది.. సర్వే నంబర్లు మారిపోయాయి.. ఇలా అనేక తప్పులు.. ఇప్పడు.. అధికారం ముగుస్తున్న సమయంలో భూ వివాదాల పరిష్కార బాధ్యతను సివిల్‌ కోర్టుల పరిధి నుంచి తప్పించి, అధికారులకు అప్పగించేలా ఏపీ ప్రభుత్వం ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌(ఏపీ భూమి హక్కు చట్టం) తేవాలని చూస్తోంది. ఇలా భూహక్కుదారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది వైకాపా ప్రభుత్వం.

పాసుపుస్తకానికి ప్రదక్షిణలు

తవణంపల్లె మండలం అత్తిమాకులపల్లెకు చెందిన దంపతులు అన్నపూర్ణమ్మ, సూర్యప్రకాష్‌ల అనుభవంలోని 94 సెంట్ల భూమిపై డి.పట్టా ఉంది. దీనిపై పాసు పుస్తకం ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటే తిప్పించుకుంటున్నారు.

రీసర్వే తర్వాత 5 సెంట్లు మాయం..

ఈ రైతు దంపతుల పేర్లు ధనలక్ష్మీ, లక్ష్మీపతి. జీడీనెల్లూరు మండలం కోటగారం గ్రామానికి చెందిన వీరికి 2.15 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. రీసర్వే పూర్తయిన తర్వాత 2.10 ఎకరాలకే పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చారు. ఐదు సెంట్ల భూమి నమోదుకు మండల, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. కానీ న్యాయం జరగలేదు.

ఆన్‌లైన్‌లో నమోదు కోసం..

వ్యవసాయ భూ వివరాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కాళ్లరిగేలా తిరిగారు కార్వేటినగరం మండలం ఆర్‌కేవీబీపేటకు చెందిన మునెయ్య. 2002లో ఆయన.. ఓ రైతు నుంచి భూమి కొనుగోలు చేశారు. భూ రికార్డుల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తహసీల్దారు కార్యాలయానికి వెళ్లగా.. సదరు సర్వే నంబర్లు నోషనల్‌ ఖాతాలో ఉన్నాయని అధికారులు చెప్పారు. అప్పటినుంచి తిరుగుతున్నా ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు.

జిల్లాలో రీసర్వే ఇలా..

జిల్లాలో మొదటి దశలో 132, రెండో దశలో 91, మూడో దశలో 106 గ్రామాల్లో రీసర్వే చేశారు. సర్వే పూర్తయిన చోట్ల సరిహద్దు 3.09 లక్షల సర్వే రాళ్లు నాటామన్నారు. కానీ చాలా గ్రామాల్లో సర్వే రాళ్లను రైతులు పీకి పారేశారు. కొన్నిచోట్ల రాళ్లు అలానే వదిలేశారు. సర్వే పూర్తయిన చోట భూహక్కు పత్రాలు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 82,684 పత్రాలు పంపిణీ చేశారు. ఈ పత్రాల్లో అనేక తప్పులు. వాటి సవరణలకు ప్రజల్ని కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. కానీ పనిచేయడం లేదు.

విస్తీర్ణం 4.74 ఎకరాలు.. పత్రాల్లో 3.30 ఎకరాలే..!

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూరక్ష పథకం రైతులకు శాపంగా మారింది. కొనుగోలు చేసిన సెటిల్‌మెంటు భూములు సైతం అసైన్డ్‌ భూములుగా పాసుపుస్తకాల్లో నమోదు చేశారు. పెద్దపంజాణి మండలం చిన్నవెలగటూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచి వెంకటరమణ పేరిట రెవెన్యూ రికార్డుల్లో  4.74 ఎకరాలు ఉంది. సర్వే తర్వాత పంపిణీ చేసిన పాసుపుస్తకంలో 3.30 ఎకరాలే ఉన్నట్లు చూపారు. మిగిలిన 1.44 ఎకరాల నమోదు కోసం అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

20 రోజులకోసారి ఆస్తులు చెక్‌ చేసుకోవాలి

యజమానులకు, రైతులకు ఈ చట్టం వల్ల చాలా నష్టం జరుగుతుంది. ప్రజల భూమిని ఎవరైతే క్లెయిమ్‌ చేస్తారో వాళ్ల పేరిట మార్చొచ్చు. అలా మార్చినప్పుడు 20 రోజుల్లోగా అప్పీల్‌ చేయాలి. అలా చేయకుంటే ఆ భూమిని హక్కుదారు మరచిపోయే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి 20 రోజులకు ఒకసారి ప్రజల ఆస్తుల్ని చెక్‌ చేసుకుంటూ ఉండాలన్న మాట.    

అశోక్‌ ఆనంద్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శి, చిత్తూరు బార్‌ అసోసియేషన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని