logo

జగన్మోసం.. ప్రశ్నించలేని వారిపై ప్రతాపం

అభాగ్యులు, అవ్వాతాతలకు జరుగుతోన్న జగన్మోసం అంతాఇంతా కాదు.. ఓట్ల రాజకీయం కోసం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో చెలగాటమాడుతున్నారు.. ఒకటో తేదీన ఇంటి వద్ద ఇచ్చే పింఛను రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకులంటూ మండే ఎండల్లో అమాయకులను ముప్పతిప్పలు పెడుతున్నారు.

Published : 05 May 2024 03:19 IST

సాంకేతిక లోపంతో పలువురి ఖాతాల్లోనే సొమ్ము
పండుటాకులపై విభిన్న కోణాల్లో కక్ష సాధింపు
పంతం వీడని వైకాపా సర్కార్‌

శాంతిపురంలో బ్యాంకు వద్ద లబ్ధిదారుల అవస్థలు

చిత్తూరు(జిల్లా పంచాయతీ), న్యూస్‌టుడే: అభాగ్యులు, అవ్వాతాతలకు జరుగుతోన్న జగన్మోసం అంతాఇంతా కాదు.. ఓట్ల రాజకీయం కోసం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి వృద్ధులు, దివ్యాంగులతో చెలగాటమాడుతున్నారు.. ఒకటో తేదీన ఇంటి వద్ద ఇచ్చే పింఛను రెండు నెలలుగా సచివాలయాలు, బ్యాంకులంటూ మండే ఎండల్లో అమాయకులను ముప్పతిప్పలు పెడుతున్నారు.. స్థానికంగా పింఛను ఇచ్చేందుకు సరిపడా సిబ్బంది ఉన్నా జగన్నాటకాలాడుతున్నారు. కొందరికి ఇంటి వద్ద అని, మరి కొందరికి బ్యాంకు ఖాతాల్లో అని తికమక పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు.. ప్రశ్నిస్తే పింఛను పోతుందన్న భయంతో ఎవరూ నోరుమెదపకుండా అష్టకష్టాలు పడి బ్యాంకులకెళ్లి తెచ్చుకుంటున్నారు.. రానుపోను దారి ఖర్చులు, ఆటోలు, వాహనాల ఛార్జీలకు వచ్చే పింఛనులో కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ఖాతాల్లో పింఛను జమ చేసినా, ఏళ్ల తరబడి లావాదేవీలు లేని కారణంగా పలువురి ఖాతాలు ఇన్‌యాక్టివ్‌ కావడంతో అందులో సొమ్ము డ్రా చేయలేక పోతున్నారు. దీంతో చేసిది లేక కొత్తగా అర్జీ రాసిచ్చి, అదనంగా రూ.100 చెల్లిస్తే నాలుగు రోజుల అనంతరం బ్యాంకు సిబ్బం ది రమ్మంటున్నారు. ఇలా అడుగడుగునా పండుటాకులపై జగన్‌ సర్కార్‌ విభిన్న కోణాల్లో కక్ష సాధిస్తుండటం గమనార్హం.

పంపిణీ పూర్తి అని వెబ్‌సైట్‌లో..

జిల్లా వ్యాప్తంగా 1,89,497 మందికి రూ.56.84 కోట్లు బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ చేసి వంద శాతం పూర్తి చేసినట్లు అధికారిక వెబ్‌సైట్‌లో చూపించారు. అయితే మూడు వేల మందికి పైగా సాంకేతిక లోపంతో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ కాలేదు. ఇటు ఇంటి వద్దా ఇవ్వలేదు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు మూడ్రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరిగినా పింఛను అందకపోగా, అసలు విషయం ఆలస్యంగా తెలుసుకున్నా రు. మళ్లీ సచివాలయాలకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో అప్పటికప్పుడు విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి ఖాతాల్లో జమకాని వారికి పింఛను సొమ్మును సచివాలయ సిబ్బంది ఖాతాల నుంచి డ్రా చేసి స్థానికంగా పంపిణీ చేశారు.

ఖాతాకు చేరినా చేతికందలేదు..

జిల్లాలో 2,739 ఇన్‌యాక్టివ్‌ బ్యాంకు ఖాతాల్లో పింఛను జమైనట్లు గుర్తించారు. ఆఖాతాల్లో పింఛను సొమ్ము నిల్వ చూపుతున్నా, డ్రా చేసుకునేందుకు వీలు కాలేదు. రెండు, మూడ్రోజుల తర్వాత ఖాతాదారుల వినతులు స్వీకరించి బ్యాంకు సిబ్బంది మరో మూడు నాలుగు రోజుల తరవాత రావాలని చెప్పడంతో వారు నిరాశగా వెనుదిరిగారు.

  • పలమనేరులోని ఇండియన్‌ బ్యాంకులో పలువురికి పింఛను జమ అయింది. అయితే 30 మంది ఖాతా లు ఇన్‌యాక్టివ్‌లో ఉండటంతో రెండ్రోజులుగా వారు బ్యాంకుల చుట్టూ తిరిగినా నగదు డ్రా చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో బ్యాంకు సిబ్బంది సూచనలతో తమ ఖాతాలను యాక్టివ్‌ చేయాలని అర్జీలు రాసిచ్చి, రూ.100 చెల్లించారు. అయినా వారికి బుధవారం రమ్మని చెప్పారు. బ్యాంకులకు రావడానికి ఆటో ఖర్చులు, అర్జీలు రాసుకునేందుకు వారు చేతి నుంచి నగదు చెల్లించు కోవాల్సి వచ్చినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
  • పెనుమూరు మండలంలో 54 మంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయినట్లు సచివాలయ సిబ్బంది చెప్పారు. బ్యాంకుకెళ్లి చూస్తే ఖాతాలు ఖాళీ. సాంకేతిక కారణాలతో పింఛను సొమ్ము జమ కాలేదని తెలుసుకుని అధికారులకు ఫిర్యాదు చేస్తే, ఉన్న పళంగా అలాంటి వారి వివరాలను సేకరించి శనివారం స్థానికంగా వారికి పింఛను పంపిణీ చేశారు.
  • శాంతిపురం మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన వృద్ధుడు గంట్లప్పకు రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు దెబ్బతిన్నాయి. వాకర్‌ సాయం లేనిదే ఆయన లేవలేడు. అలాంటి ఆయనకు ఇంటి వద్దే పింఛను ఇవ్వాల్సి ఉన్నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. శనివారం ఆటోలో కుటుంబ సభ్యుల సాయంతో 6 కిలోమీటర్లు  ప్రయాణం చేసి శాంతిపురంలోని ఇండియన్‌ బ్యాంకుకెళ్లి నిరీక్షించి పింఛను డ్రా చేసుకున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని