logo

నమ్మి ఓటేస్తే.. ముంచావేం జగన్‌

సీఎం జగన్‌ పేరు వింటేనే నిరుద్యోగుల్లో మండిపాటు ధోరణి వ్యక్తమవుతోంది.. ఎందుకంటే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు జగన్‌..

Published : 06 May 2024 04:52 IST

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని నిరుద్యోగుల్ని ఏమార్చి
అప్పు చేసి కోచింగ్‌కు.. వడ్డీలు కట్టలేక అవస్థలు

న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్‌, పుత్తూరు: సీఎం జగన్‌ పేరు వింటేనే నిరుద్యోగుల్లో మండిపాటు ధోరణి వ్యక్తమవుతోంది.. ఎందుకంటే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట ఇచ్చారు జగన్‌.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయనే ఆశతో వడ్డీలకు అప్పు చేసి కోచింగ్‌కు వెళ్లారు నిరుద్యోగులు.. నోటిఫికేషన్లు రాకపోగా.. చేసిన అప్పులకు వడ్డీలు కొండంత పెరిగిపోయింది.. తల్లిదండ్రులకు భారం కాకుండా ఆ అప్పుల్ని తీర్చలేక చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అవస్థలు పడుతున్నారు నిరుద్యోగులు.. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఏమారిస్తే మా కడుపు మండదా..! అంటూ ఆవేదనకు లోనవుతోంది నిరుద్యోగ లోకం.


కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలో నిరుద్యోగులు (పాతచిత్రం)

అన్ని శాఖల్లోనూ..: పుర, నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు, ఇంజినీరింగ్‌ విభాగంలో అనేక ఖాళీలు ఉన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖలో అటెండర్‌ నుంచి ఏవో హోదా వరకూ 320 ఖాళీలు ఉన్నాయి. ర.భ.శాఖలోనూ ఏఈలు, అటెండర్ల కొరత ఉంది.


ఎన్నికల స్టంట్‌లా డీఎస్సీ..

జిల్లాలోని జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల్లో 2,700కి పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అయితే ఎన్నికలకు ముందు హడావుడిగా జిల్లాలో 184 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది వైకాపా ప్రభుత్వం. నిరుద్యోగ అభ్యర్థులతో వందలాది రూపాయల్ని రుసుములుగా కట్టించుకుంది. పరీక్ష నిర్వహిస్తామని బీరాలు పలికింది. ఎన్నికల ప్రక్రియతో నోటిఫికేషన్‌ గాల్లోనే ఉండిపోయింది. ఐదేళ్లూ పట్టించుకోకుండా ఎన్నికలకు రెండు నెలల ముందు నోటిఫికేషన్‌ ఇవ్వడం మోసం చేయడం కాదా.. మాకు మండదా అని ప్రశ్నిస్తున్నారు డీఎస్సీ అభ్యర్థులు.

సచివాలయాల్లో ఖాళీల భర్తీ మరిచారు..

జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాలు  612 ఉన్నాయి. వీటిలో 6,624 మంది సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం 4,920 మంది పనిచేస్తున్నారు. 1,704 ఉద్యోగ ఖాళీలు ఉండగా పక్క సచివాలయాలకు చెందిన సిబ్బందితో పని చేయించుకుంటున్నారు.  ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రకటన ఇవ్వని మీ వైఖరిని చూస్తే గుండె మండుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు.


నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నా..: 2020లో డీఈడీ పూర్తిచేశా. నాలుగేళ్లుగా ఒక్క నోటిఫికేషన్‌ రాలేదు. నోటిఫికేషన్‌ ఇస్తారనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం అప్పు చేసి కోచింగ్‌కు వెళ్లా. దీంతో చేసేదేమీ లేక బట్టల దుకాణంలో పనిచేస్తున్నా. వచ్చిన అరకొర జీతంలో అప్పు తీర్చి, నా అవసరాలు, కుటుంబానికి వినియోగిస్తున్నా.

గిరి, నగరి


మెగా డీఎస్సీ అంటే నమ్మి మోసపోయా..: మెగా డీఎస్సీ అంటే నమ్మి గత ఎన్నికల్లో నిరుద్యోగులు ఓటు వేశారు. కానీ నాలుగేళ్లలో ఒక్క రోజూ కూడా మా గురించి పట్టించుకోలేదు. కోర్సు పూర్తిచేసిన ఒకటి, రెండేళ్లలో నోటిఫికేషన్‌ వస్తే అభ్యర్థులకు ఉపయోగకరం.

రవి, వడమాలపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని